చైనాలో సైనిక ప్రక్షాళన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా జనరల్ జావో జోంగ్‌కిని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కీలక బాధ్యతల నుంచి తప్పించారు. గతంలో భారత్‌తో డోక్లామ్ ప్రతిష్టంభన, గాల్వాన్ ఘర్షణ సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌కు నేతృత్వం వహించింది ఈయనగారే. ఇందుకుగానూ జిన్‌పింగ్ నోట హీరోగా ప్రశంసలు అందుకున్న వ్యక్తే.. ఇప్పుడు వేటుకు గురి కావడం గమనార్హం.
భారత్‌తో కీలక సరిహద్దు ఘర్షణల సమయంలో చైనా సైన్యానికి నాయకత్వం వహించిన జనరల్ జావో జోంగ్‌కి (Zhao Zongqi)పై తాజాగా వేటు పడింది. 2017లో డోక్లామ్ ప్రతిష్టంభన, 2020లో గాల్వాన్ ఘర్షణ సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌కు నేతృత్వం వహించిన జావోను చైనా అత్యున్నత రాజకీయ సలహా మండలి నుంచి తొలగించింది. అయితే ఆ తొలగింపునకు కారణాలను మాత్రం బీజింగ్ వర్గాలు వెల్లడించలేదు.
2016లో వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌ను పునర్వవ్యవస్థీకరించిన తర్వాత తొలి కమాండర్‌గా జనరల్ జావో జోంగ్‌కి బాధ్యతలు చేపట్టాడు. టిబెట్, జిన్‌జియాంగ్‌తోపాటు భారత్‌తో చైనా సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో పీఎల్‌ఏ కార్యకలాపాలను ఈ కమాండ్ పర్యవేక్షిస్తుంటుంది. అయితే 2017లో భారత్-చైనా-భూటాన్ త్రిసంధికి సమీపంలోని డోక్లామ్‌లో 72 రోజులపాటు ఇరు దేశాల సైనికులు ఉద్రిక్తతల్లో జావోనే కీలక పాత్ర పోషించారు. ఇందులో జావోదే పూర్తి బాధ్యత ఉందంటూ అంతర్జాతీయ మీడియా సైతం కథనాలు ఇచ్చింది.
ఆ తర్వాత 2020లో తూర్పు లడ్డాఖ్‌లో ఉద్రిక్తతలు మొదలైనప్పుడు కూడా ఆయన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ బాధ్యతల్లోనే ఉన్నారు. అదే ఏడాది జూన్ 15న గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. చైనా అధికారికంగా నలుగురు PLA సైనికులు మరణించినట్లు ప్రకటించింది.
గల్వాన్ ఘర్షణకు సంబంధించి అమెరికా నిఘా వర్గాల అంచనాలను ఉటంకిస్తూ.. 2020లో వచ్చిన ఓ నివేదికలో జావో జోంగ్‌కి ఆపరేషన్‌కు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారత్‌కు ‘గుణపాఠం చెప్పాలనే’ ఉద్దేశంతో ఈ చర్యకు ఆయన ఆమోదం తెలిపినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ వాదనను చైనా అధికారికంగా ధృవీకరించలేదు. డోక్లామ్, గాల్వాన్ వంటి భారత్‌తో అత్యంత సున్నితమైన సరిహద్దు ఘర్షణలకు జావో నేతృత్వం వహించిన నేపథ్యంలో ఆయన తాజా తొలగింపు ఆసక్తికరంగా మారింది.
ఆగస్టు 26న చైనా అత్యున్నత రాజకీయ సలహా మండలి అయిన చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (CPPCC) జావోను తన స్టాండింగ్ కమిటీ నుంచి తొలగించింది. అలాగే జాతి, మత వ్యవహారాల కమిటీ డిప్యూటీ డైరెక్టర్ పదవి నుంచి తప్పించడంతోపాటు సీపీపీసీసీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. అయితే ఈ చర్యకు కారణమేంటన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయా? లేదంటే క్రమశిక్షణా ఉల్లంఘనలపై దర్యాప్తు జరుగుతోందా? అనేది కూడా స్పష్టం చేయలేదు.
జిన్‌పింగ్ ‘పర్జ్’లో మరో వికెట్?
జావోపై చర్యలు తీసుకున్న సమయంలోనే చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC)లోనూ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సీనియర్ జనరల్స్ జాంగ్ యూషియా, లియు జెన్‌లీపై కూడా క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
2012లో జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా సైన్యంలో అవినీతిపై ప్రారంభమైన చర్యలు క్రమంగా విస్తృత ప్రక్షాళనగా మారాయి. పలువురు సీనియర్ సైనికాధికారులు పదవులు కోల్పోవడం, కనిపించకుండా పోవడం(చంపేశారనే అనుమానాలు), దర్యాప్తులను ఎదుర్కోవడం జరిగింది. ఆయుధాల కొనుగోలు, రక్షణ విశ్వవిద్యాలయాలు, కీలక కమాండ్ల వరకు ఈ ప్రక్షాళన విస్తరించినట్లు తెలుస్తోంది.
2026 ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) అంచనా ప్రకారం.. 101 మంది సీనియర్ పీఎల్‌ఏ అధికారులు పదవుల నుంచి తొలగించబడ్డారు. వాళ్లలో చాలామంది ఏమయ్యారో తెలియదు. ఈ నిర్ణయం ఎంతలా అంటే.. చైనా సైనిక నాయకత్వంలోని దాదాపు 52 శాతం పదవులను ప్రభావితం చేసిందట.
ఇదీ చదవండి: కాళరాత్రి.. చైనా చరిత్రకే మాయని మచ్చ


