శ్రీకాకుళంలో ర్యాలీ చేస్తున్న ఏపీజేఏసీ నాయకులు, ఉద్యోగులు
పీఆర్‌సీ, ఐఆర్ ఎప్పుడు? 5 పెండింగ్ డీఏల సంగతేమిటి?
రూ.40 వేల కోట్ల బకాయిలెప్పుడు చెల్లిస్తారు?.. హామీలు అమలు చేయమనడమే తప్పా?
మా సమస్యలంటే అంత నిర్లక్ష్యమా?
చంద్రబాబు సర్కారుపై ఉద్యోగుల సమరశంఖం
26 జిల్లాల్లో కలెక్టర్లకు ఉద్యమ నోటీసులు
భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు
3 నుంచి 5వ తేదీ వరకూ కలెక్టరేట్‌లు, ఆర్డీవో ఆఫీసుల వద్ద నిరసనలు
15వ తేదీ నుంచి వర్క్ టు రూల్.. ఇదీ ఉద్యమ కార్యాచరణ
సాక్షి, అమరావతి: రెండేళ్ల పాటు ఎదురుచూసిన ఉద్యోగులు ఇక చాలు అనుకున్నారు. చంద్రబాబు సర్కారుకు మొరపెట్టుకోవడం చెవిటివాడి ముందు శంఖమూదిన చందంలా ఉందన్న నిర్ణయానికి వచ్చారు. తమ సమస్యల పరిష్కారానికి, చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుకు పోరాటం తప్ప వేరే గత్యంతరం లేదని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా తొలి అడుగు వేశారు. పోరాటం ప్రారంభించారు. పీఆర్సీ, మధ్యంతర భృతి (ఐఆర్), 5 పెండింగ్ డీఏలు, రూ.40 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉద్యమాన్ని ప్రారంభించారు. 26 జిల్లాల్లో కలెక్టర్లు, జేసీలు, డీఆర్‌ఓలకు జేఏసీ జిల్లాల నేతలు తాము ఉద్యమంలోకి వెళుతున్నట్లు నోటీసులు అందించారు. తమ జేఏసీ రాష్ట్ర కమిటీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్‌ను కూడా దానికి జత చేశారు. ఈ కార్యక్రమానికి అన్నిచోట్లా ఉద్యోగులు భారీ ర్యాలీగా కలెక్టరేట్లకు తరలివెళ్లారు. ‘సీఎం సార్ మా డబ్బులు మాకు చెల్లించండి’ అనే నినాదాలతో సోమవారం కలెక్టరేట్లు మార్మోగాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేవరకూ పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు.
1వ తేదీ నుంచి నల్లబ్యాడ్జీలతో నిరసన
ఉద్యమ కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఉద్యోగులంతా తమ సెల్‌ఫోన్‌లో వాట్సాప్ డీపీగా ‘సీఎం సార్.. మా డబ్బులు మాకు ఇవ్వండి’ అనే నినాదాన్ని పెట్టుకుంటారని నోటీసుల్లో పేర్కొన్నారు. 1 నుంచి 5వ తేదీ వరకు విధులకు హాజరయ్యే ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలుపుతారని తెలిపారు. సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకూ రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల దగ్గర భోజన విరామం సమయంలో నిరసనలు తెలుపుతామని పేర్కొన్నారు. 15వ తేదీ నుంచి వర్క్ టు రూల్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సోమవారం కలెక్టర్లకు తెలిపినట్లు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ప్రజాస్వామ్య పద్ధతిలో దశల వారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రకటించిన కార్యాచరణ ప్రకారం తదుపరి దశల్లో మరింత ఉధృతంగా ఉద్యమాన్ని చేపడతామన్నారు. 
చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరడమే తప్పా?
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరడమే తప్పన్నట్లు చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోందని ఉద్యోగులు అంటున్నారు. అసలు తమకు న్యాయంగా రెగ్యులర్‌గా రావాల్సినవి కూడా పెండింగ్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు పీఆర్సీ తదితర అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు రెండేళ్లు గడిచినా ఒక్కటి కూడా అమలు చేయలేదని, ఆ వాగ్దానాలు నెరవేర్చాలని అడిగితే మంత్రులు బెదిరించేలా మాట్లాడటం సరికాదని రాయలసీమకు చెందిన ఓ ప్రభుత్వోద్యోగి వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వమైనా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిగిన వెంటనే నిర్ణయాలు వెల్లడిస్తాయని, కానీ చంద్రబాబు ప్రభుత్వం జూలై 22న చర్చలు జరిపి నెల రోజులు దాటినా ఎటువంటి నిర్ణయాలు ప్రకటించలేదని ఆయన తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కాలయాపన చేయడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయని తెలిపారు. తాము చేసే ఉద్యమం కేవలం బకాయిల కోసం చేసే పోరాటం కాదని, ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవం, భద్రత, భవిష్యత్తు కోసం చేసే పోరాటమని మరో ఉద్యోగి వ్యాఖ్యానించారు.
మా సమస్యలంటే అంత నిర్లక్ష్యమా?
సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా, వినతిపత్రాలు ఇచ్చినా, చర్చలకు హాజరైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విశాఖకు చెందిన ఉద్యోగిని వ్యాఖ్యానించారు. కూటమి నాయకులు ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ, చర్చల పేరుతో కాలయాపన చేస్తూ తమ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విజయవాడకు చెందిన ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు. తమ సమస్యలపై ప్రభుత్వం వైపు నుంచి కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలవుతాయని ఇంతకాలం ఓపికతో ఎదురు చూశామని, అయితే దీన్ని ఉద్యోగుల బలహీనతగా చూడకూడదని గుంటూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పేర్కొన్నారు.
కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన ఉద్యోగులు
చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ అమరావతి ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం ఉద్యోగులు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయా జిల్లాలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టర్లకు మొత్తం 29 డిమాండ్లతో కూడిన నోటీసులను అందజేశారు. 14 లక్షల మంది ఉద్యోగులు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటమిది అని నాయకులు పేర్కొన్నారు. తమ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించకుంటే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీకి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఉద్యోగుల సమస్యలతో కూడిన నోటీసు/వినతి పత్రాన్ని అందజేశారు. 
ఒంగోలు కలెక్టర్‌కు ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చిన అనంతరం కలెక్టరేట్ ఎదుట జేఏసీ నాయకులు, ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏలూరులో కలెక్టర్ వెట్రిసెల్విని కలిసి ఉద్యోగులు నోటీసు అందజేశారు. రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తికి ఉద్యోగులు వినతి పత్రం ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉద్యోగులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతి పత్రం అందజేశారు. ఉద్యమ కార్యాచరణ నోటీసును కూడా అందజేశారు. అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ప్లకార్డులతో పెద్ద సంఖ్యలో ర్యాలీ చేసి నిరసన తెలిపారు. కడపలో ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించి కలెక్టర్‌కు నోటీసు అందజేశారు. 
కర్నూలు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఉద్యోగులు కలెక్టర్ డాక్టర్ ఎ.సిరికి, నంద్యాల కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారికి ఉద్యోగులు నోటీసులు అందజేశారు. చిత్తూరులో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి నిరసన నోటీసు అందజేశారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. ఉద్యోగులు పల్నాడు కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. తమ 8 ప్రధాన డిమాండ్లతో కూడిన వాల్‌పోస్టర్లను ప్రదర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని రెవెన్యూ భవన్‌లో పీజీఆర్‌ఎస్ హాల్ ఎదురుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు నోటీసు అందజేశారు. అనంతపురంలో ఉద్యోగులు ర్యాలీగా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌కు చేరుకుని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌కు ఉద్యమ నోటీసు అందజేశారు.


