హత్యకేసులో అనుచరుడిని రక్షించేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు యత్నాలు | Kakinada incident | Sakshi
Sakshi News home page

హత్యకేసులో అనుచరుడిని రక్షించేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు యత్నాలు

Sep 1 2026 5:54 AM | Updated on Sep 1 2026 5:54 AM

Kakinada incident

కాకినాడలో నిరసన తెలుపుతున్న సతీష్ రెడ్డి కుటుంబం, బంధువులు

ఎమ్మెల్యే అనుచరుడు శ్రీనుని పోలీసులు ఎందుకు విచారించడంలేదు?  

హత్యాస్థలాన్ని పోలీసులే ఎందుకు కడిగేశారు?  

కాకినాడలో నిలదీసిన.. హతుడు సతీష్‌రెడ్డి భార్య జయశ్రీ

కాకినాడ క్రైం: కాకినాడలో ఈ నెల 23న జరిగిన జిమ్‌ట్రైనర్‌ కొడమటి సతీష్‌రెడ్డి హత్యకేసులో పోలీసుల తీరు పలు అనుమానాలు కలిగిస్తోందని సతీష్ రెడ్డి భార్య జయశ్రీ, కుటుంబసభ్యులు చెప్పారు. కాకినాడ అర్బన్‌ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్‌ కొండబాబు అనుచరుడైన బోను శ్రీను అలియా­స్‌ కటౌట్‌ శ్రీను ఈ హత్య చేయించాడని ఆరోపించారు. శ్రీనుని రక్షించేందుకు ఎమ్మెల్యే కొండబాబు పోలీసులతో మంతనాలు జరుపుతున్నారన్నారు. జయశ్రీ, సతీష్ రెడ్డి తల్లి ఈశ్వరి, కుటుంబసభ్యులు, బంధువులు, సతీష్ రెడ్డి స్నేహితులు సోమవారం హత్యాస్థలంలో నిరసనకు దిగారు. 

ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలంలో రక్తపు మరకలు లేకుండా పోలీసులే కడిగేయడం పలు అనుమానాలు కలిగిస్తోందని చెప్పారు. అర్ధరాత్రి రెండుగంటల సమయంలో హత్య జరిగితే మూడు గంటలకే.. అంటే గంట వ్యవధిలోనే శుభ్రం చేసేశారని తెలిపారు. పోలీసులు క్రైం సీన్‌ ప్రొటెక్షన్‌ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. హత్య జరిగిన చోట మార్కింగ్, డు నాట్‌ ఎంటర్‌ బ్యాండ్లు ఏర్పాటు చేయలేదని చెప్పారు. ఉదయానికి చూస్తే అసలు అక్కడ హత్య జరిగిందన్న ఆనవాళ్లు కూడా లేవన్నారు.

ఈ హత్యచేయించాడని తాము అనుమానాలు వ్యక్తం చేస్తున్నా.. ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడైన బోను శ్రీనును ఇప్పటివరకు ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. తాము కటౌట్‌ శ్రీను పే­రు చెబితే ఓ అధికారి మీడియాకు ఆ పేరు చెప్పొద్దని ఒ­త్తిడి చేశారన్నారు. శ్రీను ప్రణాళికతోనే సాయికిరణ్‌ బృందం హత్యచేసిందన్నారు. ఎమ్మెల్యే అనుచరుడైనందువల్లే పోలీసులు కటౌట్‌ శ్రీను గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. 

పోలీసులు న్యాయం చేస్తారనే 
న­మ్మ­కం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదునెలల గర్భిణిని అయిన తాను, గుండె సమస్యతో బాధపడుతున్న తన అత్త ఈశ్వరి న్యాయం కోసం ఇలా తిరుగుతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. కటౌట్‌ శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించాలని, హంతకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే కొండబాబు అర్థం చేసుకుని కటౌట్‌ శ్రీనును రక్షించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

ఎస్పీ కార్యాలయానికి తరలింపు  
ఉదయం నుంచి నిరసన చేపట్టిన జయశ్రీ, ఆమె కుటుంబసభ్యులతో పోలీసులు చర్చించారు. మధ్యాహ్నం వారిని జిల్లా పోలీస్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఎస్పీని కలిసిన అనంతరం బాధితులు ఆయన సూచనమేరకు  కాకినాడ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

కటౌట్‌ శ్రీనును విచారించిన పోలీసులు
టీడీపీ ఎమ్మెల్యే వన­మాడి కొండబాబు అనుచరుడు కటౌట్‌ శ్రీనును సోమ­వారం పోలీసులు విచారించారు. హత్యకు కారకుడని మృతుడు సతీష్‌ రెడ్డి భార్య జయశ్రీ ఆరోపణలు చేస్తు­న్న నేపథ్యంలో పోలీసులు శ్రీనును అదుపు­లోకి తీసు­కొని విచారణ చేస్తున్నారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు సాంకేతిక సాయం తీసుకుంటున్నామని సీఐ అప్పలనాయుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement