సాక్షి, విజయవాడ: మాది ఉద్యోగుల అజెండా... రాజకీయ అజెండా కాదంటూ ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చి చెప్పారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హామీలు నెరవేర్చమంటే రాజకీయ అజెండా అంటారా? అంటూ కూటమి సర్కార్‌ఫై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం తమపై చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదన్నారు.
‘‘ఏపి జేఏసీ అమరావతి పక్షాన 28న జరిగిన సదస్సులో ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. సామరస్యంగా జరుగుతున్న చర్చలకు మేము విఘాతం కలిగించామని.. సీఎంను అవమానించేలా కుట్ర పూరితంగా మాట్లాడామంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి మూడో సంవత్సరం జరుగుతుంది. మాకు రావాల్సిన డబ్బులు, మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలనే అడుగుతున్నాం’’ అంటూ బొప్పరాజు ధ్వజమెత్తారు.
..మీరు కాలయాపన చేసినంత వరకు మేం ఓపిగ్గా ఉన్నాం. ఉద్యమం వైపు వెళ్తున్న మమ్మల్ని చర్చలకు వెనక్కి పిలిచారు. ఈ నెల 28న కూడా మా సమస్యలు, మీరు ఇచ్చిన హామీలు ప్రస్తావించాం. అనేక ఉద్యోగ సంఘాల జేఏసీని పిలిచి చర్చించారా లేదా?. ఐదుగురు మంత్రులు, పది మంది ఐఏఎస్ లతో కూడిన కమిటీ మాతో చర్చించారు. నలభై రోజులుగా మీరు చర్చించిన అంశాలు అమలు చేయలేదు. మా సభలను వాయిదా వేయించారా లేదా?. చర్చల తర్వాత ఆ సారాంశాన్ని ఎందుకు వెల్లడించలేదు’’ అంటూ బొప్పరాజు నిలదీశారు.
..ప్రతినెల జీతంలో 25 శాతం కోల్పోతుంటే ఇంకా భరించాలా? మా బకాయిలపై వివరాలను పే స్లిప్‌లలో ఇవ్వమని అడిగాం.. కానీ స్పందించలేదు. విధిలేని పరిస్థితుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వం చేసిన ప్రకటన ఉద్యమాన్ని పక్కదారి పట్టించేలా ఉంది. ఉద్యోగ సంఘాలు ఎప్పుడూ కోరుకునేది చర్చలే. చర్చల సారాంశాన్ని వెల్లడించమనే మేం కోరాం. మాకు ఎలాంటి రాజకీయ అజెండాలు లేవు’’ అని బొప్పరాజు పేర్కొన్నారు.


