సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ నాయకత్వాన్ని, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలతో తమ పార్టీలో అపోహలు రావొచ్చని.. అందుకే ఈ వివరణ అన్న సజ్జల.. కోటరీలో వైఎస్ జగన్ బందీ అయితే తక్కువ సమయంలోనే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేదా? అంటూ ప్రశ్నించారు. ఇవాళ (ఆదివారం) మీడియాతో మాట్లాడిన సజ్జల.. వైఎస్ జగన్‌పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
‘‘పార్టీకి సుదీర్ఘకాలం నాయకత్వం వహించే సత్తా ఉన్న నేత వైఎస్ జగన్ ఒక్కరే. పేదల జీవితాల్లో వైఎస్ జగన్ మార్పు తీసుకొచ్చారు. పార్టీని వీడిన వారిపై మేము ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయలేదు. విజయసాయిరెడ్డి సొంత కారణాలతో పార్టీ నుంచి బయటకు వెళ్లారు. వైఎస్ జగన్‌పై దాడి చేసేందుకు కొత్త పాత్రలు తెరపైకి వస్తుంటూనే ఉంటారు. అలానే ఇప్పుడు విజయసాయిరెడ్డి అనే పాత్ర తెరపైకి వచ్చింది. వైఎస్ జగన్‌పై సాయిరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల దృష్టి తన మీద పడాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ జగన్ అన్ని మతాలపట్ల సమాన గౌరవం చూపిస్తారు’’ అని సజ్జల పేర్కొన్నారు.
వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తే పబ్లిసిటీ వస్తుందని విజయసాయిరెడ్డి అనుకుంటున్నారు. వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేలా విష ప్రచారం చేస్తున్నారు. పార్టీలో వైఎస్ జగన్ ఒక్కరే నాయకుడు.. మేమంతా కార్యకర్తలం. వైఎస్ జగన్‌పై ఎవరైనా విమర్శలు చేస్తే ఎల్లో మీడియా పండగ చేసుకుంటుంది. వైఎస్ జగన్.. విజయసాయిరెడ్డికి ఎంతో గౌరవం ఇచ్చారు. విజయసాయిరెడ్డిని ఆయన ఉన్నత స్థానంలో కూర్చొబెట్టారు’’ అని సజ్జల వివరించారు.

‘‘గతంలో వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి అన్నారు. రాజీనామా సమయంలో ఎవరితోనూ సమస్యలు లేవని చెప్పారు. ఎంపీగా, జాతీయ కార్యదర్శిగా ఇలా ఎన్నో పదవులు పార్టీ ఇచ్చింది. వైఎస్సార్సీపీలో విజయసాయిరెడ్డికి వచ్చినన్ని పదవులు ఎవరికి రాలేదు’’ అని సజ్జల పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అంబటి రాంబాబుకు వైఎస్ జగన్ పరామర్శ
‘‘వైఎస్సార్సీపీకి కర్త, కర్మ, క్రియ ఒక్క వైఎస్ జగనే. పార్టీలో నంబర్ వన్, నంబర్ టూ అనే ప్రశ్నే లేదు. వైఎస్ జగన్ నంబర్ టూ, సజ్జల నంబర్ వన్ అన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్య అత్యంత అన్యాయం. వైఎస్ జగన్ లేని వైఎస్సార్సీపీకి అర్థమే లేదు. విజయసాయిరెడ్డిని పార్టీలో వెనక్కి లాగారన్న ఆరోపణకు ఆయనకు వచ్చిన పదవులే సమాధానం. రాజ్యసభ సభ్యత్వం, జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఉత్తరాంధ్ర సమన్వయకర్త, అనుబంధ విభాగాల ఇన్చార్జ్ వంటి అత్యంత కీలక బాధ్యతలు ఆయనకే దక్కాయి. 2020 నుంచే తనను తగ్గించారని విజయసాయిరెడ్డి ఇప్పుడు చెబుతున్నారు. అలా అయితే 2022లో రెండోసారి రాజ్యసభకు ఎందుకు పంపారు?
..పార్టీ నుంచి వెళ్లినప్పుడు ‘వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నాను. ఎవరిపైనా కోపం లేదు, సజ్జల వల్ల రాజీనామా చేయలేదు’ అని చెప్పిన విజయసాయిరెడ్డి ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారన్న విజయసాయిరెడ్డి ఆరోపణ దారుణం. వైఎస్ కుటుంబం అన్ని మతాలను ఎలా గౌరవించిందో దశాబ్దాలుగా దగ్గరగా ఉన్న విజయసాయిరెడ్డికి బాగా తెలుసు. సాయిరెడ్డిపై వైఎస్ జగన్‌కు ప్రత్యేకమైన అభిమానం, విశ్వాసం ఉండేది. తప్పుడు కేసుల్లో తనతో పాటు ఇబ్బందులు పడ్డారన్న భావనతో అత్యున్నత స్థాయి అవకాశాలు, బాధ్యతలు ఇచ్చారు.
..రాజకీయ పార్టీ పెట్టుకోవాలంటే విజయసాయిరెడ్డి స్వేచ్ఛగా పెట్టుకోవచ్చు. కానీ కొత్త రాజకీయ ప్రయాణానికి ప్రచారం కోసం వైఎస్ జగన్‌ను, వైఎస్సార్సీపీని టార్గెట్ చేయడం సరికాదు. ఇదే ధోరణి కొనసాగితే సమాధానం కూడా అంతే ఘాటుగా ఉంటుంది. 2024 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా వైఎస్సార్సీపీ సంస్థాగతంగా మళ్లీ పుంజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకైనా, 2029 సాధారణ ఎన్నికలకైనా, అంతకంటే ముందే ఎన్నికలు వచ్చినా పార్టీ సిద్ధం. వైఎస్సార్సీపీ ఎన్నికలకు భయపడటం లేదు. డెడ్, అబ్సెంట్, ఘోస్ట్ ఓట్లను తొలగించి ఓటర్ల జాబితా శుద్ధి చేసిన తర్వాత ఎన్నికలు జరపాలన్నదే పార్టీ డిమాండ్.
..వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్ నాయకత్వం, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేయడమే రాజకీయ ప్రత్యర్థుల ప్రధాన అజెండాగా మారింది. ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా వైఎస్ జగన్ చుట్టూ వివాదాలు సృష్టించి అసలు అజెండాను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియాలోని ఫేక్ ఫ్యాక్టరీల ద్వారా జగన్‌పై నిరంతర విషప్రచారం జరుగుతోంది. ప్రజా సమస్యలు చర్చకు వస్తే చంద్రబాబు ప్రభుత్వానికి మైనస్ మార్కులే వస్తాయి. అందుకే వ్యక్తిగత వివాదాలను ముందుకు తెస్తున్నారు.
..వైఎస్ జగన్‌ను ఎవరో ఒక ‘కోటరీ’ నడిపిస్తోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఎలాంటి పొత్తులు లేకుండా పార్టీని నిర్మించి, రికార్డు మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడిని ఎవరో వెనక నుంచి నడిపిస్తున్నారనడం హాస్యాస్పదం. 2019లో భారీ విజయం, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన చారిత్రక ఫలితాలు వైఎస్ జగన్ నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనం. సంక్షేమం, అభివృద్ధి, పేదల జీవితాల్లో సమూల మార్పు అనే అజెండాతోనే వైఎస్సార్సీపీ పుట్టింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలు, సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అనే అజెండాలో వైఎస్సార్సీపీకి మార్పు లేదు.
..వైఎస్ జగన్ ఇచ్చిన మాట, మేనిఫెస్టో, ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో రాజీ పడని నాయకత్వం. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు తొలుత కావాలనే స్పందించలేదు. ఆయన సృష్టించాలనుకున్న అజెండాలో పార్టీ పడకూడదన్నదే ఉద్దేశం. వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తే కొన్ని మీడియా సంస్థల్లో భారీ ప్రచారం వస్తుందనే పరిస్థితి ఏర్పడింది. వరుస ఆరోపణలతో పార్టీ కార్యకర్తల్లో కూడా అపోహలు వచ్చే పరిస్థితి రావడంతో స్పందించాల్సి వచ్చింది. విజయసాయిరెడ్డికి పార్టీలో అన్యాయం జరిగిందన్న వాదనకు వాస్తవాలు సరిపోవు. వైఎస్ జగన్ తర్వాత అత్యంత కీలక పదవులు, బాధ్యతలు పొందినవారిలో విజయసాయిరెడ్డి ముందువరుసలో ఉన్నారు. 2016లో రాజ్యసభ సభ్యత్వం, 2017లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యత.
..వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకత్వం వంటి అత్యంత కీలకమైన బాధ్యత కూడా విజయసాయిరెడ్డికే. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్ స్థాయి హోదా కూడా విజయసాయిరెడ్డికే. 2020–22 మధ్య ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమన్వయకర్తగా బాధ్యత. పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్గా కూడా కీలక బాధ్యత. 2022లో రెండోసారి రాజ్యసభ సభ్యత్వం. ఇన్ని అవకాశాలు పొందిన తర్వాత ‘నన్ను ఎదగనివ్వలేదు, వెనక్కి లాగారు’ అనడం వాస్తవాలకు విరుద్ధం. విజయసాయిరెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యంపై పార్టీలో ఇతరులు ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. తప్పుడు కేసుల్లో వైఎస్ జగన్‌తో పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న సానుభూతి కూడా విజయసాయిరెడ్డిపై జగన్‌కు ఉండేది.
..వైఎస్ జగన్ ఇచ్చిన ప్రత్యేక ప్రాధాన్యాన్ని తన వ్యక్తిగత ప్రతిభ వల్లే వచ్చిందని విజయసాయిరెడ్డి భావించి ఉండవచ్చు. పార్టీ నుంచి వెళ్లినప్పుడు చెప్పిన కారణాలకు, ఇప్పుడు చెబుతున్న కారణాలకు పొంతన లేదు. ‘సజ్జల వల్ల నేను పార్టీని వీడాను’ అన్న మాట విజయసాయిరెడ్డి రాజీనామా సమయంలో ఎక్కడా చెప్పలేదు. తన ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని గతంలో విజయసాయిరెడ్డే ప్రకటించారు. వైఎస్సార్సీపీలో ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్. మిగిలిన వారందరూ కార్యకర్తలే. వైఎస్ జగన్‌ను నంబర్ టూగా చూపించి మరొకరిని నంబర్ వన్‌గా ప్రచారం చేయడం రాజకీయ దురుద్దేశం. పార్టీ ఆవిర్భావం నుంచి విధానాలు, రాజకీయ నిర్ణయాలు, ఎన్నికల వ్యూహం అన్నింటిలో జగన్‌కే పూర్తి స్పష్టత.
..ఒక వ్యక్తి ఆలోచన, నిబద్ధత, ప్రజా అజెండా చుట్టూ రూపుదిద్దుకున్న పార్టీ వైఎస్సార్సీపీ. వైఎస్ జగన్ నాయకత్వం లేకుండా వైయస్సార్సీపీ అనే రాజకీయ వ్యవస్థకు అర్థమే లేదు. వైఎస్ జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారన్న ఆరోపణ అత్యంత దారుణం. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ అన్ని మతాల పట్ల గౌరవంతో వ్యవహరించిన విషయం విజయసాయిరెడ్డికి ప్రత్యక్షంగా తెలుసు. వైఎస్ హయాంలోనే తిరుమలలో అన్యమతస్తుల ఉద్యోగాల అంశంపై చర్యలు తీసుకున్నారు. నలభై ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో పరిచయం ఉందని చెప్పుకునే వ్యక్తే ఇప్పుడు మతమార్పిడుల ఆరోపణ చేయడం అన్యాయం. నిజంగా వైఎస్ కుటుంబానికి మతమార్పిడుల అజెండా ఉంటే దశాబ్దాలుగా అత్యంత దగ్గరగా ఉన్న విజయసాయిరెడ్డికే మతమార్పిడి జరిగి ఉండేదిగా
..కొత్త రాజకీయ పార్టీ పెట్టుకోవడం విజయసాయిరెడ్డి ఇష్టం; ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఆ హక్కు ఉంది. కొత్త పార్టీకి మీడియా స్పేస్ కోసం జగన్‌ను తిట్టడం రాజకీయ విధానం కాకూడదు. వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తే ఫుల్పేజీలు, బ్యానర్ హెడ్డింగులు వస్తాయనే ఉద్దేశంతో రాజకీయాలు చేయడం సరికాదు. టీడీపీ అనుకూల మీడియాకు పనిముట్టుగా మారి వైఎస్సార్సీపీపై నిరంతరం దాడి చేస్తే ఇక మౌనంగా ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పటివరకు ‘మన సాయిరెడ్డి’ అనే భావనతో సంయమనం పాటించాం.. ఇదే ధోరణి కొనసాగితే రాజకీయంగా వేరే విధంగా ట్రీట్ చేయాల్సి వస్తుంది.
..విజయసాయిరెడ్డి ఆరోపణల వల్ల వైఎస్ జగన్ రాజకీయ స్థాయి గానీ, వైఎస్సార్సీపీ బలం గానీ తగ్గవు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్సీపీ బలహీనపడలేదు; సంస్థాగతంగా తిరిగి పుంజుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి సన్నద్ధత. 2029 ఎన్నికలకు పూర్తి సన్నద్ధత. అంతకంటే ముందే సాధారణ ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం. ఎన్నికలకు భయపడి కోర్టుకు వెళ్లారన్న ప్రచారం అవాస్తవం. ఓటర్ల జాబితాలో డెడ్, అబ్సెంట్, లేని ఓటర్లను గుర్తించి తొలగించే ప్రక్రియ పూర్తిచేయాలన్నదే డిమాండ్. లేని ఓట్లతో ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యం కాదు. ఓటర్ల జాబితా శుద్ధి చేసి ఎన్నికలకు వెళ్లాలన్నది న్యాయమైన డిమాండ్.
..సజ్జల పాత్రపై వచ్చిన ఆరోపణలకు డైరెక్ట్ సమాధానం. పదవులు, హోదాలు వ్యక్తిగత కిరీటాలు కాదు; పార్టీ అప్పగించిన బాధ్యతలు మాత్రమే. వైఎస్ జగన్ విజన్‌కు అనుగుణంగా పనిచేసే అవకాశం రావడమే ముఖ్యమైనది. జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి రావడం ముందుగా వేసుకున్న ప్రణాళిక కాదు. వైఎస్ మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాల్లో వైఎస్ జగన్‌తో కలిసి సాగిన ప్రయాణం నాది. 2014 వరకు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్‌గా పనిచేసి, అనంతరం పూర్తిస్థాయిలో రాజకీయ బాధ్యతల్లోకి ప్రవేశించా
..క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా పనిచేసే నాయకులు, కార్యకర్తలకే మరింత గౌరవం, ప్రాధాన్యం ఇవ్వాలన్నది వైఖరి. ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చూసేవారికి అవసరమైన ప్రాధాన్యం, రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి వారి పాత్రకు తగిన ప్రాధాన్యం.. ఇదంతా టీమ్‌వర్క్. టీడీపీతో సంబంధాలు ఉన్నందుకే సజ్జలపై కేసులు లేవన్న విజయసాయిరెడ్డి ఆరోపణకు అర్థం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌పై కేసులు పెట్టిన సమయంలో విజయసాయిరెడ్డి రాజకీయాల్లోనే లేరు. ఆ సమయంలో నేను సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్‌గా ఉన్నాను
..ఒక పార్టీలో ఉన్న వ్యక్తి మరో పార్టీతో ఒప్పందం చేసుకుని తనపై కేసులు రాకుండా చేసుకోగలడన్న వాదన అసంబద్ధం. విజయసాయిరెడ్డి చేస్తున్న తాజా ఆరోపణలు ఆయన రాజకీయంగా ఎటువైపు వెళ్తున్నారో వెల్లడిస్తున్నాయి. భౌతిక దాడి జరిగిందని నిజంగా భావిస్తే విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. 74 సార్లు అవమానించారని, దాడి జరిగిందని ఆరోపణలు చేస్తే వాటికి సంబంధించిన వివరాలను అధికారికంగా బయటపెట్టాలి. ప్రస్తుత ‘రెడ్‌బుక్’ పాలనలో పాత ఫిర్యాదులపైనా కేసులు పెడుతున్న పరిస్థితి ఉంది. విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం వెంటనే స్పందించే అవకాశం ఉంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.


