సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కూటమి సర్కార్ వచ్చిన దగ్గర్నుంచి తానను టార్గెట్ చేస్తూనే ఉన్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. గుంటూరులో కోట్ల విలువైన ఇరిగేషన్ భూమి విషయంలో నాపై వార్తలు రాశారు. నిస్సిగ్గుగా నాపై ఆంధ్రజ్యోతి వార్త రాసింది. ప్రభుత్వం రాగానే నా కుమారుడిపై కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం కేసులో నన్ను, నా తమ్ముడిని 83 రోజులు జైల్లో పెట్టారు. నా ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులు చేయించారు’’ అని జోగి రమేష్ ధ్వజమెత్తారు.
‘‘నా కుమారుడు, నాపై పెట్టిన కేసుల్లో మా పాత్రను నిరూపించలేకపోయారు. నా కుమారుడి వ్యక్తిగత వ్యవహారాన్ని కూడా రోడ్డుకి ఈడ్చారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ప్రభుత్వాన్ని కోరుతున్నా.. గుంటూరులో ఇరిగేషన్ భూముల వ్యవహారంలో ఉన్న ప్రైవేట్ వ్యక్తి ఎవరో వాస్తవాలు వెల్లడించండి. నన్ను, నా కుటుంబాన్ని అన్ని రకాలుగా టార్గెట్ చేశారు. గుంటూరు ఇరిగేషన్ భూముల విషయంలో నాపై వచ్చిన ఆరోపణలపై విచారణకు నేను సిద్ధం. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని చంద్రబాబును కోరుతున్నా. విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరుతున్నా
..అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలతో నాపై బురద చల్లాలని చూస్తున్నారు. నా గొంతు నొక్కాలని చూడటం మీకు సాధ్యం కాదు. అప్పులను తీర్చుకోవడానికి నాకు ఉన్న భూములను అమ్ముకుంటున్నా.. నాకు గుంటూరు ఇరిగేషన్ భూములతో ఎలాంటి సంబంధం లేదు. నాపై మీకు కక్ష తీరకపోతే ఇంకా ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. నా భార్య బైబిల్ చదివితే తప్పేంటి? నాతో పాటు నా భార్య కూడా ఆలయాలకు వస్తుంది. మొన్ననే నేను, నా భార్య కాశీ విశ్వేశ్వరుడి వద్దకు వెళ్లొచ్చాం. మూడేళ్ల క్రితం నా ఇంట్లో జరిగిన ఛండీయాగంలో నా భార్య, నేను పాల్గొన్నాం. తప్పుడు ప్రచారాలు చేయొద్దని చంద్రబాబును కోరుతున్నా’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు.


