బాబూ... చెత్త ఎవరిది? సోషల్‌ మీడియాలో రివర్స్‌ కౌంటర్‌! | KSR's Comments On Chandrababu Politics Debate | Sakshi
Sakshi News home page

బాబూ... చెత్త ఎవరిది? సోషల్‌ మీడియాలో రివర్స్‌ కౌంటర్‌!

Aug 31 2026 11:30 AM | Updated on Aug 31 2026 11:47 AM

KSR's Comments On Chandrababu Politics Debate

పీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు భలే ప్రకటనలు చేస్తుంటారు. వాటిని ఎల్లో మీడియా పరమ పవిత్రం అన్నట్లుగా ప్రముఖంగా ప్రచురించి ప్రచారం చేస్తుంటుంది. చంద్రబాబు ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. అది ఏమిటంటే రాజకీయాలలో చెత్తను తొలగిద్దాం.. అని అన్నారు. మామూలుగా అయితే ఇది ఆహ్వానించదగిందే. కాని ఆయన లక్ష్యం వేరు. ప్రతిపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన అనుకోవచ్చేమోకాని, వాటిని విన్నవెంటనే, పత్రికలలో చదివిన వెంటనే గుర్తుకు వచ్చేది అధికార పార్టీలో ఉండేవారు చేసే అక్రమాల గురించే కదా! ఆ విషయాన్ని ఆయన పట్టించుకోకుండా స్పీచ్‌లు ఇస్తుండడం విశేషం.

మనం రాజకీయాలలో ఉన్నవారిని అలాంటి పదాలతో సంభోధించడం సరైన పద్దతి కాదు. ఎవరు తప్పు చేసినా తప్పే. అసలు రాజకీయాలలో చెత్త అంటే ఏమిటో ఆయన ఒక నిర్వచనం ఇస్తే బాగుంటుంది కదా! ఎవరిపైన కేసులు ఉంటే వారు ఆ కోవలోకి వస్తారని అన్న భావనా? లేక ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే దానిని ఆ విధంగా పరిగణించాలన్న అర్థమా? ఎన్నికలలో డబ్బు ఖర్చు చేసేవారిపై వ్యాఖ్యలా?

ఒక విశేషం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఈ స్పీచ్ ఇవ్వడానికి రెండు రోజుల ముందు జాతీయ స్థాయిలో ప్రజస్వామ్య సంస్కరణల వేదిక ఒక నివేదిక విడుదల చేసింది. అందులో ఏమి ఉంది? ఏపీలో 79 శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయనే కదా! అంటే అత్యధిక సంఖ్యలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల మీదే కదా! నేర చరిత్ర కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబుది నాలుగో స్థానం అని అందులో ప్రకటించారు. ఈయనపై 19 క్రిమినల్ కేసులు ఉంటే, కొన్ని తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని రిపోర్టు చెబుతుంది. ఆయన శిష్యుడుగా గుర్తింపు పొందిన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై ఏకంగా 89 కేసులు ఉన్నాయట. ఆయన అగ్రస్థానంలో ఉన్నారు.

వీటిలో పెక్కు రాజకీయపరమైన కేసులు ఉండవచ్చని వీరు వాదించవచ్చు. కాని ఎదుటి పక్షాలపై అలాంటి కేసుల ఆధారంగానే చంద్రబాబు ఆరోపణలు చేస్తుంటారే! అక్కడే వచ్చింది సమస్య. తాను ఎవరిపైన ఆరోపణ చేస్తే అందులో నిజం ఉందని అనుకోవాలన్నది ఆయన భావన. అదే తనపై ఎవరైనా ఆరోపణ చేస్తే ఎవరూ నమ్మకూడదన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఎంతసేపు ఎదుటివారిపై బురద వేయడమే పనిగా పెట్టుకున్నప్పుడు ఆ బురద తమపై కూడా పడే అవకాశం ఉంటుందని వారు గుర్తించాలి కదా! తనకు మీడియా బలం ఉంది కనుక తను చెప్పిందే జనంలోకి వెళుతుందని చంద్రబాబు భ్రమపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనకే నష్టం.

ఇవి కూడా చదవండి: వైఎస్‌ జగన్‌ ప్రశ్నలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి..!

చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఆయనను ఎద్దేవ చేస్తూ అనేక విషయాలను ఫాక్ట్స్ అండ్ ఫిగర్స్‌తో పోస్టులు వస్తున్నాయి. గొడ్డలి పార్టీ అని వైఎస్సార్‌సీపీని అంటూ తన పార్టీని వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు పిలిపించుకుంటున్నారు. మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు చాలా అనుచితంగా ఉంటున్నాయి. చంద్రబాబు తన హోదాను, సీనియారిటీని కూడా మర్చిపోయి ఏది పడితే అది ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం దురదృష్టకరం. ప్రజలు నిజాయితీగా ఉంటే నాయకులు తప్పులు చేయరట. ఎన్నికలలో డబ్బు ప్రభావం లేకుండా చేయవలసిన బాధ్యత ప్రజలదట. అది జరిగితేనే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందట. అంటే ఇప్పట్లో రాష్ట్రం స్వర్ణాంధ్ర కాదని పరోక్షంగా చెప్పినట్లు అనుకోవాలా? ఎంతసేపు ప్రజలను నిందిస్తున్నారే తప్ప, తాము డబ్బు పంచకుండా ఎన్నికలలో పోటీచేస్తామని మాటవరసకు చెప్పలేకపోతున్నారన్న విమర్శ వస్తోంది.

సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు అయితే నేరుగా రాజకీయాలలో డబ్బు ప్రభావం తెచ్చిందే చంద్రబాబు అని స్పష్టంగా చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ పార్టీ అధినేత పీఏ వందల కోట్లు సంపాదించారని ఆయన ఏ ఆధారంతో చెప్పారో తెలియదు. కాని చిత్రం ఏమిటంటే స్వయంగా చంద్రబాబు పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీబీటీడీనే రెండువేల కోట్ల అక్రమాలను గుర్తించినట్లు ప్రకటించింది. దాని గురించి ఎన్నడైనా చంద్రబాబు వివరణ ఇచ్చారా? స్కిల్ స్కామ్‌లో ఆయన పీఏ అరెస్టు కాకుండా అమెరికాకు పంపించిందెవ్వరో తెలియదా! స్కిల్ స్కామ్‌లో అప్పటి సీఐడీ చేసిన అభియోగాలపై ఎన్నడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాయింట్ వైజ్ వివరణ ఇచ్చి, తానేమి తప్పు చేయలేదని చెప్పి ఉండాలి కదా!

ఈ స్కామ్‌లో ఏ అధికారులు అరెస్టు అయింది అందరికి తెలుసే. డీఎస్సీ, ఏపీపీఏస్సీ అంశాలను చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు ప్రస్తావిస్తూ తమ వాదన సమర్థించుకునే యత్నం చేస్తున్నా, జగన్ విసిరిన సవాల్, అంటే సీబీఐ విచారణకు సిద్దపడకపోవడం వారి బలహీనతగా కనిపించదా! నకిలీ మద్యంతో గత ప్రభుత్వంలో 30వేల మంది చనిపోయారని ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం.

విశేషం ఏమిటంటే కూటమి అధికారంలోకి వచ్చాక తంబళ్లపల్లె నియోజకవర్గంలో ములకల చెరువు గ్రామం వద్ద టీడీపీ నేతలే నకిలీ మద్యం తయారీ కేంద్రాన్నే పెట్టిన విషయం బహిర్గతం అయింది. అలాంటివి ఏవైనా జగన్ టైమ్‌లో కనిపించాయా? అయినా ఈ ఆరోపణలు ఏమిటో! చంద్రబాబు స్పీచ్ ఇస్తున్న టైమ్‌లోనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై టీడీపీకే చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి తీవ్ర ఆరోపణ చేశారే. ఈ రెండేళ్లలో 200 కోట్లు భూ దోపిడీ, ఇతరత్రా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరి వాటిపై విచారిస్తానని ఎందుకు చెప్పలేకపోయారు.

అంతేకాదు. అదే ఎమ్మెల్యే తనకు ప్రతినెల మామూళ్లు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించినట్లు కూడా వార్తలు వచ్చాయే!విజయవాడ టీడీపీ ఎంపీ వర్గంపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణల మాటేమిటి? గంజాయి, మట్టి, ఇసుక మాఫియాగా మారి ఏ విధంగా అక్రమాలు చేస్తున్నదానిపై ఎన్ని ఆరోపణలు చేసింది ఆయనకు తెలియదా? వాటిపై చర్య తీసుకోకపోగా పార్టీ కమిటీ కొలికపూడిని పిలిచి మందలించిందని వార్తలు వచ్చాయే. ఇటీవలే ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పోలీస్ స్టేషన్ అడ్డగానే దందాలు చేస్తున్నట్లు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారే. వారిద్దరు బహిరంగంగా మాట్లాడవద్దని సలహా ఇస్తే సరిపోతుందా!

ఇక మహిళలను వేదించిన కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలను కనీసం పిలిచి కోప్పడ్డారా? ఒక మంత్రే తనను వేధించారని ఒక ఎన్‌ఆర్‌ఐ మహిళ ఫిర్యాదు చేస్తే ఏమి చర్య తీసుకున్నారో ప్రజలకు తెలియచేసి ఉండాల్సింది కదా! ఇలా చెప్పుకుంటూ పోతే భారతం అంత అయ్యే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వ అద్వాన్న పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనబడుతుంది.

ఇక మంత్రి లోకేష్ డీఎస్సీపై ఐదో సారి చర్చకు రమ్మన్నా రావడం లేదని సభలలో ఉపన్యాసాలు ఇచ్చి, జనం వాటినే నమ్మాలని తండ్రి మాదిరే అనుకుంటే ఎలా? జగన్ విసిరిన సీబీఐ సవాల్‌ను దమ్ముగా ఎదుర్కుని స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరగలేదని రుజువు చేసుకోవచ్చు కదా! చంద్రబాబు, లోకేష్‌లు తమను తాము పొగుడుకుంటే పొగుడుకోవచ్చు. కాని ఎదుటివారిపై నిందలు మోపే ముందు, అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు అవి తమకు కూడా తగులుతాయేమో చూసుకుని మాట్లాడితే వారికే మంచిది కదా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement