మారికవలస గురుకులాన్ని కొనసాగించాల్సిందే | Extreme tension in Marikavalasa girls boarding school | Sakshi
Sakshi News home page

మారికవలస గురుకులాన్ని కొనసాగించాల్సిందే

Aug 31 2026 5:32 AM | Updated on Aug 31 2026 5:32 AM

Extreme tension in Marikavalasa girls boarding school

ఆర్డీవోను అడ్డుకున్న  ప్రజా సంఘాలు

పోలీసుల సాయంతో బయటకు వెళ్లిపోయిన ఆర్డీవో  

బాలికల గురుకులంలో తీవ్ర ఉద్రిక్తత

మధురవాడ(విశాఖపట్నం): మారికవలస గిరిజన గురుకుల సంక్షేమ బాలుర ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలను యధావిధిగా కొనసాగిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుందని ప్రజా సంఘాలు, వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు విశాఖ ఏజెన్సీ పర్యటన సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకునే అవకాశం ఉందని భావించిన అధికారులు మారికవలస నుంచి వివిధ ప్రాంతాలకు తరలించిన విద్యార్థులందరినీ తిరిగి తీసుకొచ్చి అక్కడే చదివేలా చర్యలు తీసుకుంటామని రెండు రోజుల క్రితం ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. 

అయితే ఇతర ప్రాంతాలకు తరలించిన విద్యార్థులను తిరిగి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. మారికవలస పాఠశాలలోని సుమారు 150 మంది 5, 6 తరగతుల బాలురను మెట్రో వెనుక ఉన్న గిరిజన బాలికల క్యాంపస్‌కి తరలించి అక్కడే ఉంచారని, వారిని గురుకులానికి తీసుకొచ్చే యత్నాలు చేయలేదని ధ్వజమెత్తారు. పైగా అక్కడ ఉన్న బాలికలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. నీట్, ఐఐటీ కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీఓఈ) పేరిట ఇలా గురుకులాలను గందరగోళంలోకి నెట్టడం తగదన్నారు.

ఆర్డీఓను అడ్డుకుని నిరసన 
ఈ నేపథ్యంలో గిరిజన బాలికల క్యాంపస్‌ని ఆదివారం మధ్యాహ్నం ప్రజా సంఘాల నాయకులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు వేర్వేరుగా సందర్శించారు. అక్కడికి వచ్చిన విశాఖ ఆర్డీవో దిలీప్‌ చక్రవర్తిని ప్రజా సంఘాల నాయకులు అడ్డుకున్నారు. పాఠశాల గేటు వద్ద బైఠాయించారు. దీంతో పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెనుకవైపు ఉన్న మరో గేటు ద్వారా ఆర్డీఓను కారు వద్దకు ద్విచక్రవాహనంపై పోలీసులు తీసుకెళ్లిపోయారు. 

ఆందోళనకారులు ఆయనను అనుసరించే యత్నంచేశారు. అయితే ఆర్డీఓ అప్పటికే వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుంభా రవిబాబు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థులపట్ల అధికారుల తీరును నిరసించారు. ఐఏఎస్‌ అధికారులతో ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి కూడా సుబ్రహ్మణ్యం, దండకారణ్య ఉద్యోగ సమితి జాతీయ కార్యదర్శి సమరరెడ్డి మాణిక్యం, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మేం చాలా ఇబ్బందులు పడుతున్నాం
ఈ ప్రభుత్వానికి గిరిజన పిల్లలు అంత చులకనగా కనిపిస్తున్నారా? మా పిల్లల భవిష్యత్తు కోసం మేం ధర్నా చేస్తుంటే మారికవలసలోనే అందరినీ చదివిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చారు. మా పిల్లలు అంటే అంత అలుసా? ఎందుకు ఇలా ఇబ్బందులు పెడుతున్నారు? పాడేరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన 37 మంది పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.– పుష్పావతి, విద్యార్థి తల్లి, తరాలిసింగి, పాడేరు

అమ్మాయిల హాస్టల్‌లో అబ్బాయిలా?
అమ్మాయిల గురుకులంలో బాలురను ఉంచడం సరికాదు. మాకు మా పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ పేరిట విద్యాసంవత్సరం మధ్యలో గురుకులాలను గందరగోళంలోకి నెట్టడం ఏమిటీ?  అధికారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడి విద్యార్థులను అక్కడే చదువుకోనివ్వాలి. – పి. సుబ్రమణ్యం, బాలికల గురుకులం ఎస్‌ఎంసీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement