సాక్షి, విజయవాడ: విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల ఉద్యమం ఉధృతమైంది. తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘సీఎం సార్.. మా డబ్బులు మాకు ఇవ్వండి’ అంటూ బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు.
ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన నోటీసును ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఉద్యోగ సంఘాల నేతలు అందజేశారు. రేపటి నుంచి తొలి దశ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ బత్తిన రామకృష్ణ తెలిపారు. తక్షణమే పీఆర్సీ కమిషనర్‌ను నియమించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గతంలో పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపినా తమ డిమాండ్లు పరిష్కారం కాలేదని ఆయన అన్నారు.
ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. కొందరు తమ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగులను కించపరుస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఓట్లతో గెలిస్తే ఎమ్మెల్యేగా మీకు హక్కు వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత ఉద్యోగిగా మాకు కూడా హక్కులు వస్తాయి. మాకు రావాల్సినవి, ప్రభుత్వం ఇవ్వాల్సినవే మేం అడుగుతున్నామని ఆయన అన్నారు.
సెప్టెంబర్ 26 వరకు ఉద్యమం
ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా విభాగం ప్రతినిధి లక్ష్మి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 26 వరకు తొలి దశ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం ముందు మొత్తం 29 డిమాండ్లను ఉంచామని, వాటిని నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఏపీ అవుట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సంపత్ మాట్లాడుతూ.. పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు తాము ఆర్థికపరమైన అంశాలపైనే మాట్లాడామని, తమ నాయకులు, ఉద్యోగులను విమర్శిస్తే ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉద్యోగుల 29 డిమాండ్లతో ప్రారంభమైన ఈ ఉద్యమం.. సెప్టెంబర్ 26 వరకు ఏ రూపం దాల్చుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


