కిడ్నాప్‌కు గురైన రవిప్రకాశ్ , టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
ఏ2గా ఆయన కుమారుడు రవికుమార్, ఏ1గా మరో వ్యక్తిపై కేసు
బెంగళూరులో బీజేపీ నేత డాక్టర్ రవిప్రకాశ్ కిడ్నాప్‌పై పోలీసులకు భార్య ఫిర్యాదు
పుట్టా, ఆయన కుమారుడు రవికుమార్ అనుచరులే లాక్కెళ్లారని వెల్లడి
14 ఎకరాల భూమిని లాక్కునేందుకే తప్పుడు కేసు అంటూ ఆరోపణ
యశవంతపుర/కడప : వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌పై బెంగళూరు పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. కిడ్నాప్ వ్యవహారంలో ఆయన్ను ఏ3గా పేర్కొన్న పోలీసులు ఆయన కుమారుడు రవికుమార్‌ను ఏ2గా, ఏ1గా అపరిచిత వ్యక్తిపై ఎస్‌సీ,ఎస్‌టీ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు (267/2026) నమోదు చేశారు. బెంగళూరులో బీజేపీ నాయకుడు, తన భర్త డాక్టర్ రవిప్రకాశ్‌ను మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కుమారుడు రవికుమార్, వారి అనుచరులు కిడ్నాప్ చేసినట్టు బాధితుడి భార్య సబీనా రాజరాజేశ్వరీనగర ఠాణా పోలీసులను ఆశ్రయించారు.
ఆదివారం ఉదయం 10.15 గంటలకు నాలుగు కార్లలో టీడీపీ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్, అతని కుమారుడు రవికుమార్ అనుచరులు వచ్చి కిడ్నాప్ చేశారని సబీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో తాను కేకలు వేయడంతో స్థానికులు చుట్టుముట్టి కారులో ఉన్న ముగ్గురు కిడ్నాపర్లను పోలీసులకు అప్పగించారని తెలిపారు. ‘మా నాయకుడిపై కేసు వేసి అనవసరంగా కోర్టుకు తిప్పుతారా?’ అని వారు దౌర్జన్యం చేశారని, పోలీసులకు చెబితే అంతుచూస్తామని బెదిరించారని ఆమె తెలిపారు. అంతకు ముందు కొందరు తమ ఇంటి ముందు రెక్కీ నిర్వహించినట్లు సబీనా ఆరోపించారు.
భూ వివాదమే కారణం!
బెంగళూరులో రవిప్రకాశ్‌కు చెందిన 14 ఎకరాల భూమిపై రవిప్రకాశ్–పుట్టా సుధాకర్‌ల మధ్య కేసు నడుస్తోంది. గత నెలలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు భూమి వద్దకు వచ్చి గొడవ చేశారు. మళ్లీ ఆదివారం ఉదయం రవిప్రకాశ్ ఫాంహౌస్‌లోకి చొరబడేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో రవిప్రకాశ్‌పై తప్పుడు కేసు బనాయించి, భూమిని లాక్కొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సబీనా, ఆమె కూతురు రూపాలి ప్రకాశ్‌లు ఆరోపించారు. ఇదిలా ఉండగా రవిప్రకాశ్ కిడ్నాప్ కాలేదని, ఓ హత్య కేసులో ఐదో నిందితునిగా ఉన్న కారణంగా మైదుకూరు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు బెంగళూరు నగర పోలీసులు తెలిపారు. సాధారణంగా ఇతర రాష్ట్రాల పోలీసులు స్థానిక పోలీసుల సాయం తీసుకుని నిందితులను అరెస్ట్ చేయాలి. అయితే ఆ నిబంధనలేవీ పాటించకుండా పలు కార్లకు నంబర్ ప్లేట్ లేకుండా వచ్చి దౌర్జన్యంగా తీసుకెళ్లడం కలకలం రేపింది.
వరుస వివాదాల్లో పుట్టా కుటుంబం
అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెంగళూరుకు చెందిన డాక్టర్ రవిప్రకాశ్‌ను బలవంతంగా ఎత్తుకొచ్చి, అరెస్ట్ చూపడం టీడీపీ నేతల ల్యాండ్ గ్రాబింగ్ దందాలకు అద్దం పడుతోంది. వైఎస్సార్ జిల్లా ఉప్పగుంటపల్లెకు చెందిన మురళీమోహన్ యాదవ్‌పై దాడి చేశారనే ఫిర్యాదుతో గత జూలై 22న డాక్టర్ రవిప్రకాశ్‌తో పాటు మరో ఐదుగురిపై మైదుకూరు పోలీసులు (క్రైమ్ నెంబర్ 229/2026) కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా బెంగళూరు నగరంలో రూ.వందల కోట్ల విలువైన భూ వివాదాన్ని పుట్టాకు అనుకూలంగా మలుచుకోవాలనే లక్ష్యం ఉందని, ఈ క్రమంలోనే రవిప్రకాష్ అరెస్ట్ అని సమాచారం.
ఈ కేసు ఆధారంగానే ప్రస్తుతం మైదుకూరు పోలీసులు రవి ప్రకాశ్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపారు. కాగా, ఇటీవల పుట్టా పెద్ద కుమారుడు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారం రచ్చ రచ్చ అయిన విషయం తెలిసిందే. ఓ వ్యవహారానికి జడిసి పుట్టా కుటుంబం రూ.కోట్లు సైబర్ నేరగాళ్లకు అప్పగించడం చర్చనీయాంశమైంది. తాజాగా పుట్టా మరో కుమారుడు పుట్టా రవికుమార్‌పై సైతం ఆర్థిక, భూ వివాదం కేసు నమోదు కావడం గమనార్హం.


