మధ్యంతర ఎన్నికలపై సర్వేలన్నీ ప్రతికూల ఫలితాలు ఇస్తున్న వేళ.. అమెరికా ఓటర్లకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ ఇచ్చారు. రిపబ్లికన్లు కాంగ్రెస్ రెండు సభల్లోనూ పట్టు నిలబెట్టుకుంటే.. ప్రతీ అమెరికన్(వయోజన)కు 5,000 డాలర్లు (సుమారు రూ.4.2 లక్షలు) చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. దీనికి ‘ట్రంప్ డివిడెండ్’గా పేరు పెడతామని చెప్పారు.
భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం డలాస్‌లో రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన సదస్సులో ప్రసంగించిన ట్రంప్.. ఎన్నికల్లో తన పేరు బ్యాలెట్‌పై లేకపోయినా, తనను అభ్యర్థిగా భావించి ఓటేయాలని మద్దతుదారులను కోరారు. ‘‘రిపబ్లికన్లు గెలిస్తే.. మీరూ మాతో గెలిచినట్టే. మీకు 5,000 డాలర్లు లభిస్తాయి’’ అని పేర్కొన్నారు. అయితే ఈ మొత్తాన్ని ఎక్కడి నుంచి సమకూరుస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. ‘‘మన దేశం ఎంతో డబ్బు సంపాదిస్తోంది’’ అని మాత్రమే చెప్పారు.
ట్రంప్ ప్రతిపాదన అమలు చేస్తే ప్రభుత్వంపై కనీసం 1 ట్రిలియన్ డాలర్ల భారం పడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ హామీ ఆర్థికంగా, రాజకీయంగా ఎంతవరకు సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలి అభిప్రాయ సర్వేల్లో ట్రంప్ ఆమోద రేటింగ్ 30 శాతం దిగువన ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ధరలు, ఇరాన్‌తో యుద్ధం వంటి అంశాలపై అమెరికన్లలో అసంతృప్తి పెరుగుతోంది.
‘బ్యాలెట్‌లో నేనే ఉన్నట్లు భావించండి’
మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు రెండు సభల్లోనూ విజయం సాధిస్తారని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘నేను బ్యాలెట్‌లో ఉన్నాను.. ఉన్నాను.. మరోసారి చెబుతున్నా.. నేనే బ్యాలెట్‌లో ఉన్నట్లు భావించండి’’ అంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇరాన్ యుద్ధంపైనా ట్రంప్ వ్యాఖ్యలు
సదస్సు ప్రసంగంలో ట్రంప్ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని పదేపదే ప్రస్తావించారు. ఈ యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందన్న విషయాన్ని కూడా ఆయన అంగీకరించినట్లు కనిపించారు. ఇరాన్ అణ్వస్త్రాన్ని తయారు చేయడానికి రెండు, మూడు వారాల దూరంలో ఉందన్న కారణంతోనే యుద్ధానికి దిగాల్సి వచ్చిందని వివరించారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధికి తన పేరును పెట్టాలని కూడా ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై విజయం సాధించిన వెంటనే చమురు ధరలు తగ్గుతాయని చెప్పారు. ఆహారం సహా దాదాపు అన్ని వస్తువుల ధరలు తగ్గుతున్నాయని పేర్కొంటూ.. ‘‘ఇరాన్‌తో యుద్ధంలో గెలిచిన వెంటనే చమురు ధరలు కూడా తగ్గుతాయి’’ అని అన్నారు.
టారిఫ్‌లపై వెనక్కి తగ్గేది లేదంటూ..
అమెరికా వాణిజ్య భాగస్వాములపై భారీ సుంకాలు విధించడాన్ని కూడా ట్రంప్ సమర్థించుకున్నారు. ప్రస్తుతం ఏర్పడుతున్న ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో వాటి ఫలితాలు మెరుగ్గా ఉంటాయని ఆయన వాదించారు. అమెరికాలో కమ్యూనిజం పెరుగుతోందంటూ డెమొక్రాట్లపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘వాళ్లు గెలిస్తే అమెరికా కమ్యూనిస్టు దేశంగా మారిపోతుంది’’ అని హెచ్చరించారు. వచ్చే 250 ఏళ్లలో అమెరికా ఎలా ముందుకు సాగాలన్నది ఓటర్ల చేతుల్లోనే ఉందని అన్నారు.
అయితే ప్రస్తుత అంచనాలు మాత్రం రిపబ్లికన్లకు ప్రతికూలంగా ఉన్నాయి. డెసిషన్ డెస్క్ హెచ్‌క్యూ అంచనా ప్రకారం.. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు 230–205 ఆధిక్యంతో గెలిచే అవకాశం ఉండగా, సెనేట్‌లోనూ 51–49తో మెజారిటీ సాధించే అవకాశం ఉంది. రిపబ్లికన్ సదస్సు ముగింపు కార్యక్రమానికి ట్రంప్ గురువారం మరోసారి హాజరుకానున్నారు. అంతకుముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పేరును, వ్యక్తిగత ప్రభావాన్ని ఉపయోగించి రిపబ్లికన్ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు ఎంతవరకు తీసుకురాగలరన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
ఇదీ చదవండి: ఇరాన్ యుద్ధానికి ముగింపు! బోనస్‌గా ఉక్రెయిన్ వార్ కూడా!!


