ఆడపిల్లకు ఇచ్చే ఆస్తి కన్నా ఆమెకు అందించే విద్యే జీవితాంతం అండగా నిలుస్తుంది. చదువు ఉంటే ఆత్మవిశ్వాసం వస్తుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఏ రంగంలోకి వెళ్లినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కూతురిని చదివించి ఆమెకు నచ్చిన రంగంలో ఎదిగే అవకాశం కల్పిస్తే ఆ కుటుంబానికి ఆమె కేవలం కూతురిగా కాకుండా బలమైన శక్తిగా ఎదిగి, అండగా నిలుస్తుంది. ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావించిన కుటుంబాలు ఇప్పుడు అదే కూతురిని తమ భవిష్యత్ ఆశగా చూస్తున్నాయి. చదువులో రాణిస్తూ, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు ఎదుగుతూ కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న కూతుళ్లు తల్లిదండ్రుల ఆలోచనలను మారుస్తున్నారు. అందుకే ‘కూతురే కావాలి’ అనే మాట వినిపించే రోజులు వస్తున్నాయి. నేడు కూతుళ్ల దినోత్సవం (డాటర్స్ డే) సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సాక్షి ప్రతినిధి,కామారెడ్డి: రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు రామస్వామిగౌడ్, శోభ దంపతులకు నలుగురు కూతుళ్లు. పెద్ద కూతురు సవిత ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఈడీ చదివింది. స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. రెండో కూతురు శైలజ ఎంఎస్సీ, ఎంఈడీ చదివింది. ఎస్‌జీటీగా పనిచేస్తోంది.
మూడో కూతురు స్వప్న ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఈడీ చదివింది. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తోంది. చిన్నకూతురు సంగీత ఎంఏ, ఎంఈడీ చదివింది. గురుకుల పాఠశాలలో పీజీటీగా పనిచేస్తోంది. నలుగురూ ఉన్నత చదువులు, ఉద్యోగాలతో స్థిరపడి కన్నవారికి సంతోషాలను పంచుతున్నారు. ‘ఆడపిల్లలు అన్న భావన లేకుండా పెంచాం. తక్కువ సంపాదనతో నలుగురిని చదివించడానికి కష్టాలు పడ్డాం. మా కష్టాలను చూసిన పిల్లలు ఇష్టంగా చదివి ఉన్నతంగా ఎదిగారు’ అని రామస్వామిగౌడ్ ఆనందం వ్యక్తం చేశారు.


