విజయవాడ ఎస్‌ఎన్‌పురం పోలీస్ స్టేషన్‌లో ఆదివారం అరెస్టు అయిన సచివాలయ ఉద్యోగులు
కేసుల నమోదుపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం
తమ సమస్యలను చెప్పుకోవడమే నేరమా అని ఆవేదన
ఇదంతా కక్ష సాధింపేనని మండిపాటు
సీఐ గుండెపోటుతో చనిపోతే ఉద్యోగులే కారణమనడం దారుణం
సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర అని సర్వత్రా చర్చ
సాక్షి, అమరావతి: తమ సమస్యలు పరిష్కరించాలని కోరడమే పాపమైపోయిందని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చంద్రబాబు సర్కారుపై మండిపడుతున్నారు. ఎన్నిమార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోనందునే ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టాల్సి వచ్చిందని.. అంత మాత్రాన తామేదో క్రిమినల్స్ అన్నట్లు వ్యవహరించడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ధర్నా చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అదర్స్ అంటూ పలువురు ఉద్యోగులపై కేసులు నమోదు చేయడాన్ని ఉద్యోగ సంఘం నేతలు తప్పుపడుతున్నారు. నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులనే ప్రభుత్వం క్రిమినల్స్‌గా చూడడం దారుణమంటూ మండిపడుతున్నారు.
నెలలు, సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి తమ సమస్యలు పరిష్కరించండి అంటూ అనేక వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోని పరిస్థితుల్లో ప్రభుత్వానికి తమ గొంతు బలంగా వినిపించాలన్న ఉద్దేశంతో విజయవాడలో నిరసన చేపట్టడం నేరమా అంటూ తప్పుపడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న కారణంగా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఈ వ్యవస్థపైనే కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందన్న చర్చ ఉద్యోగుల్లో సాగుతోంది. ప్రభుత్వం అమలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో అమలు చేసే పట్టిష్ట వ్యవస్థ లేకపోవడంతో అప్పట్లో ప్రజల గడప వద్దకే ప్రభుత్వ కార్యక్రమాలు అన్న నినాదంతో 2019లో అప్పటి ప్రభుత్వం ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
అప్పట్లో సచివాలయ వ్యవస్థకు దేశమంతటా ప్రశంసలు దక్కాయి. మరోవైపు వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల గడప వద్దకే ప్రభుత్వ సేవలు అందించడాన్ని పలు రాష్ట్రాలు పరిశీలించి అభినందించాయి. వీటన్నింటినీ జీర్ణించుకోలేని చంద్రబాబు సర్కారు.. ఏకంగా ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకుందని, ఈ క్రమంలోనే వలంటీర్లకు రెట్టింపు జీతం ఇస్తామని ఓట్లు వేయించుకుని.. తీరా గద్దెనెక్కాక వారిని ఇంటికి పంపిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను తగ్గించి ఉద్యోగులందరినీ ఛిన్నాభిన్నం చేయగా, ఇప్పుడు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ఉద్యోగులపై క్రిమినల్స్ ముద్రవేసే ప్రయత్నాలను అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు తప్పు పడుతున్నారు. పైగా అనారోగ్యంతో సీఐ మృతి చెందడాన్ని ఉద్యోగులకు ముడి పెట్టి కేసులు నమోదు చేస్తుండటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కక్ష సాధింపేనని స్పష్టం చేస్తున్నారు.
సమస్యల పరిష్కారంపై రాతపూర్వక హామీ ఇవ్వాల్సిందే
సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వాల్సిందే. ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరినా ప్రభుత్వం అనుమతించలేదు. జేఏసీ పిలుపు మేరకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేయడం.. నిర్భంధించడం రాష్ట్రమంతా చూసింది. ఉద్యోగులు ఎక్కడా దౌర్జన్యం చేయలేదు.
తమ బాధను వినిపించడానికి తాపత్రయ పడ్డారు. ఈ కార్యక్రమానికి బందోబస్తు కోసం వచ్చి గుండెపోటుతో మరణించిన సీఐ అలీకి ఉద్యోగుల తరఫున ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం. అయితే ఆయన మరణానికి ఉద్యోగులే కారణం అనడం సరికాదు. తక్కువ వేతనంతో కన్సాలిడేటెడ్ పద్ధతిలో పనిచేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయి. జేఏసీ నేతలపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయాలి. ఉద్యోగులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి. టీవీ–5 సాంబశివరావు ప్రభుత్వ ఉద్యోగులను ‘గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్’ వంటి పదాలతో సంబోధించడం సబబు కాదు.
– విప్పర్తి నిఖిల్ కృష్ణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


