చంద్రబాబు ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోంది | AP High Court says Chandrababu government is deceiving the BCs | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోంది

Sep 29 2026 5:55 AM | Updated on Sep 29 2026 5:55 AM

AP High Court says Chandrababu government is deceiving the BCs

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల జీవో ఏ కోర్టులో నిలబడదు

చట్టం చేయడం ద్వారా మాత్రమే వారికి న్యాయం జరుగుతుంది

తమిళనాడులో ఇలాగే చట్టం చేశారు 

ఇక్కడ మాత్రం ప్రభుత్వం మొక్కుబడిగా వ్యవహరిస్తోంది 

హైకోర్టుకు నివేదించిన జస్టిస్‌ వంగల ఈశ్వరయ్య  

డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు దాఖలు చేసిన వ్యాజ్యంలో ఇంప్లీడ్‌ పిటిషన్‌ 

ఆ పిటిషన్‌పై వాదనల్లో చంద్రబాబు బండారం బట్టబయలు

కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

సాక్షి, అమరావతి: బీసీలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, అఖిల భారత వెనుకబడిన తరగతుల ఫెడరేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్‌ వంగల ఈశ్వరయ్య సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర కులగణన, సామాజిక–ఆర్థిక–రాజకీయ సర్వే పూర్తిచేయకుండానే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవడం బీసీల హక్కులను హరించడమేనంటూ ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌ ఏపీ రాష్ట్ర విభాగం గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ ఆల వెంకటేశ్వర్లు హైకోర్టులో గత ఏడాది పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో తనను మరో పిటిషనర్‌గా చేర్చుకుని తన వాదనలు వినాలంటూ ఈశ్వరయ్య తాజాగా ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్‌ బీఎస్‌ భానుమతి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య స్వయంగా హైకోర్టు కొచ్చి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ భానుమతి, తాజాగా దాఖలైన ఇంప్లీడ్‌ పిటిషన్‌పైన అలాగే 2025లో ఆల వెంకటేశ్వర్లు దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యంలో కౌంటర్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చారు. తదుపరి విచారణ నాటికి కౌంటర్లు దాఖలు చేసి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. తదుపరి విచారణను అక్టోబర్‌ 1కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తీర్పు రిజర్వ్‌ చేసిన నేపథ్యంలో తాజా పిటిషన్లు జస్టిస్‌ బీఎస్‌ భానుమతి బెంచ్‌ ముందుకు వచ్చిన విషయం గమనార్హం.    

ఈశ్వరయ్య వాదనల్లో ముఖ్యాంశాలు.. 
– స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ జీవో ఏ కోర్టులో కూడా నిలబడదు.  ఇది తెలిసే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది.   
– సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదు.  దీనిని అధిగమించేందుకు రాష్ట్ర ఉభయ సభల్లో తీర్మానాలు చేసి వాటిని కేంద్రానికి పంపి చట్టం తీసుకొస్తేనే బీసీలకు వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు దక్కుతాయి.  
– తమిళనాడులో కూడా ఇలాగే చేయడంతో ఇందుకు అనుగుణంగా కేంద్రం చట్టం చేసింది.  దీని వల్ల తమిళనాడులో బీసీ రిజర్వేషన్లతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 69 శాతానికి చేరాయి. దీంతో అక్కడ ఏ కోర్టు కూడా జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉంది.  
– అయితే చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇలా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపే అవకాశం ఉన్నప్పటికీ, ఆ పని చేయకుండా బీసీలకు నామమాత్రపు రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోలిచ్చింది.  దీని వల్ల బీసీలకు అన్యాయమే జరుగుతుంది తప్ప, న్యాయం జరిగే అవకాశమే లేదు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement