మానవత్వం మంటగలిసింది | Incident in Guntur | Sakshi
Sakshi News home page

మానవత్వం మంటగలిసింది

Sep 29 2026 5:53 AM | Updated on Sep 29 2026 5:58 AM

Incident in Guntur

వైద్యుల నిర్లక్ష్యం.. బస్సు డ్రైవర్, కండక్టర్‌ అమానవత్వం 

రాత్రి వేళ ఆర్టీసీ బస్సులోనే వికలాంగురాలి ప్రసవం 

రాత్రి వేళ రోడ్డుపైనే దించేసిన బస్సు సిబ్బంది 

సమయానికి స్పందించిన ‘సాక్షి’ రిపోర్టర్‌.. ఓ ఆటో డ్రైవర్‌ సాయంతో చేబ్రోలు ఆస్పత్రికి తరలింపు 

అక్కడా వైద్యులు లేక రెండు గంటలు ఆటోలోనే నిరీక్షణ 

చివరకు ప్రాథమిక వైద్యం చేసిన నర్సు.. గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు

చేబ్రోలు: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం, ఆర్టీసీ సిబ్బంది అమానుష వైఖరితో ఒక వికలాంగ గర్భిణి ప్రాణాపాయ స్థితికి చేరుకుని,  రాత్రి వేళ ఆర్టీసీ బస్సులోనే ప్రసవించిన ఘటన ఇది. బస్సులో పురిటి నొప్పులతో బాధ పడుతున్నా, ప్రయాణికులు వేడుకొన్నా బస్సు సిబ్బంది కనికరం చూపకపోగా, బస్సులోనే ప్రసవించిన వికలాంగురాలిని నడి రాత్రి వేళ రోడ్డుపై దించేసి వెళ్లిపోయారు. అదే బస్సులో ఉన్న ‘సాక్షి’ విలేకరి చొరవతో తల్లి, బిడ్డ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. బాపట్ల మండలం వెదుళ్లపల్లికి చెందిన వికలాంగురాలు ఆర్తిన లావణ్యకు ఆరేళ్ల కిందట గొర్రెల కాపరి గోపిరాజుతో వివాహమైంది.

వీరికి ఇప్పటికే ఒక పాప ఉంది. రెండోసారి గర్భిణిగా ఉన్న లావణ్య సోమవారం బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లింది. వైద్యులు కడుపులోని బిడ్డ తక్కువ బరువు ఉన్నాడని మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కి వెళ్లమని సూచించారు. ఆమె అంబులెన్స్‌లో గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లగా కాన్పుకు ఇంకా పది రోజుల సమయం ఉందని ఇంటికి వెళ్ళిపోవాలని సూచించారు. లావణ్య తన అమ్మమ్మ, అక్కలతో కలసి గుంటూరు బస్టాండ్‌లో చీరాల డిపోకు చెందిన విజయవాడ – చీరాల ఆర్టీసీ బస్సులో బాపట్లకు తిరుగు ప్రయాణమయ్యారు. 

నొప్పులతో విలవిల్లాడినా కనికరించని డ్రైవర్, కండక్టర్‌ 
బస్సు బయల్దేరిన కొద్దిసేపటికే నారాకోడూరు సమీపంలో లావణ్యకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. బస్సును సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు ప్రయాణికులు కూడా కోరినా డ్రైవర్, కండక్టర్‌ కనికరం చూపించలేదు. తీవ్ర నొప్పులతో తల్లడిల్లిన లావణ్య నారాకోడూరు–చేబ్రోలు గ్రామాల మధ్య బస్సులోనే మగబిడ్డకు జన్మనిచి్చంది. ప్రసవమైన తర్వాత అయినా సమీపంలోని చేబ్రోలు ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రాథేయపడినా కండక్టర్‌ ఒప్పుకోలేదు. రాత్రి వేళ, నిస్సహాయ స్థితిలో ఉన్న వికలాంగ బాలింతను, కనీసం బొడ్డు కూడా కోయని నవజాత శిశువును రోడ్డు పక్కన నిర్దాక్షిణ్యంగా దించేసి వెళ్లిపోయారు. 

ప్రాణాలు కాపాడిన ’సాక్షి’ రిపోర్టర్‌ 
అదే బస్సులో గుంటూరు నుంచి బాపట్లకు వెళ్తున్న బాపట్ల రూరల్‌ ‘సాక్షి’ విలేకరి అంగిరేకుల కోటేశ్వరరావు వెంటనే స్పందించారు. బాధితులతోపాటు బస్సు దిగి ఆటోను మాట్లాడారు. అందులో తల్లిని, బిడ్డను చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ పీహెచ్‌సీలోనూ ఒక్క డాక్టర్‌ కానీ, హెడ్‌ నర్స్‌ కానీ లేరు. మెయిన్‌ రోడ్డు పక్కన ఉన్న ఆస్పత్రిలో రెండు గంటల పాటు బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిరీక్షించాల్సి వచ్చింది. అప్పటికీ వైద్యులు రాకపోవడంతో చివరికి ఆటోలోనే ఉన్న బాలింతకు అక్కడ ఉన్న డ్యూటీ నర్స్‌ ప్రాథమిక చికిత్స అందించారు. బిడ్డ బొడ్డు తాడు కత్తిరించారు. పుట్టిన బాబు తక్కువ బరువుతో ఉండి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ప్రత్యేక వాహనంలో రాత్రి సమయంలో గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. 

బాధ్యులపై చర్యలకు డిమాండ్‌ 
పది రోజుల సమయం ఉందని చెప్పి నిర్లక్ష్యంగా పంపించేసిన గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు, రాత్రి వేళ ప్రసవమైనా రోడ్డుపై దించేసిన ఆర్టీసీ సిబ్బంది, అందుబాటులో లేని చేబ్రోలు పీహెచ్‌సీ సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య అధికారులు, సిబ్బంది, అమానుషంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్, కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement