సీఎం చంద్రబాబు కొత్త వాతావరణ శాస్త్రం
పల్లె పండుగ వేదికపై అబద్ధాల జడివాన
కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు వల్లె వేసిన వైనం
సాక్షి, అమరావతి: సెల్‌ఫోన్లు తెచ్చింది నేనే.. హైటెక్ సిటీ కట్టింది నేనే.. అని చెప్పుకునే చంద్రబాబు క్రెడిట్ ఖాతాలో తాజాగా వాన కూడా చేరిపోయింది. ఇటీవల విశాఖలో వర్షం తన వల్లే కురిసిందని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారాయన. పల్లె పండుగ పేరుతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామాపురంలో మంగళవారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విశాఖలో లోటు వర్షపాతం ఉందని.. తాను ఒక్కసారి ప్రార్థించడం వల్ల ఒకే రోజున 27 సెంటీమీటర్ల వర్షం పడిందని సెలవిచ్చారు.
దీంతో సభికులతోపాటు టీవీలు, మీడియాల్లో ఆ మాటలు విన్న వారంతా ముక్కున వేలేసుకున్నారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం వల్లే విశాఖతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురిసింది కదా.. ఇదేమిటి చంద్రబాబు ఇలా చెబుతున్నారని ఆశ్చర్యచకితులయ్యారు. 2024లో తన వైఫల్యంతో బుడమేరుకు వరదలు వచ్చి విజయవాడ మునిగిపోయినప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఎక్కువ వర్షం కురిసి వరద వచ్చిందని సెలవిచ్చారు. వరద వస్తే వాతావరణ మార్పు.. వాన వస్తే తన ప్రార్థన.. ఇదీ బాబు మార్కు వాతావరణ శాస్త్రం. అదే వేదికపై ఆయన నోటి నుంచి అబద్ధాలు జడివానలా కురిశాయి.
బాబు చెప్పిన అబద్ధం
1. మేం ప్రార్థిస్తే ఒకే రోజు 27 సెంటీమీటర్ల వర్షం పడింది
2. వైఎస్సార్‌సీపీ ఐదేళ్లలో 880 కిలోమీటర్ల మేర రోడ్లు వేసింది. మేం రెండేళ్లలో 6,500 కిలోమీటర్ల రోడ్లు వేశాం.
3. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేశాం.
నిజం
⇒ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం వల్ల వర్షాలు కురిశాయి.
⇒ వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక్క ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కిందే 3,125 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు పూర్తయ్యాయి. కూటమి హయాంలో ఇప్పుడు స్థానిక ఎన్నికల ముంగిట 6,500 కిలోమీటర్ల రోడ్ల కోసం ఆదేశాలు ఇచ్చారు. ఇంకా వేయలేదు.
⇒ ఆడబిడ్డ నిధి (ప్రతినెలా రూ.1,500), 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే ప్రతినెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఊసే లేదు. 2026–27 బడ్జెట్‌లో వీటికి కేటాయింపులే చేయలేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు, దీపం పథకాలను అరకొరగా ఇచ్చి మొత్తం ఇచ్చేసినట్లు అబద్ధాలు.


