సాక్షి, హైదరాబాద్: షాబాద్ హత్యల కేసులో నిందితుడు రాజ్‌కుమార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులో తీసుకున్నట్లు సమాచారం. చేగూరు నుంచి లిఫ్ట్ అడిగి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళిన రాజ్ కుమార్.. పోలీస్ కానిస్టేబుల్‌తో టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని అడిగినట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్‌పై కానిస్టేబుల్‌కు అనుమానం రాగానే పారిపోయేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. పోలీసులు వెంబడించి పట్టుకున్నట్లు సమాచారం.
అయితే, రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంపై చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం మాట్లాడుతూ.. ఆరుగురు హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశామని.. నిందితుడు కోసం మొత్తం తొమ్మిది బృందాలతో గాలిస్తున్నామన్నారు. చేగూరు రైల్వే ట్రాక్ దాటి అడవి ప్రాంతంలో రాజ్ కుమార్ వెళ్లినట్లు సమాచారం. రాజ్ కుమార్ తన మొబైల్ ఫోన్ శుక్రవారం రాత్రి 11:47 స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని రాజ్ కుమార్ కోసం రైల్వే పోలీస్, ట్రాకింగ్, హ్యూమన్ ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.
పోక్సో కేసులో నిందితుడైన రాజ్‌కుమార్ వరుసబెట్టి ఆరుగుర్ని అతి కిరాతకంగా హత్య చేశాడు. తనపై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, నానమ్మను మట్టుబెట్టిన ఈ రాక్షసుడు, వారికి మద్దతుగా నిలిచిందనే కోపంతో కట్టుకున్న భార్యను, అభం శుభం తెలియని ఇద్దరు కొడుకుల్నీ కడతేర్చాడు. శుక్రవారం అర్ధరాత్రి ఈ హత్యాకాండ చోటు చేసుకోగా, శనివారం ఉదయం ఈ ఘోరం సంచలనం సృష్టించింది.


