డెత్‌ యాపిల్‌.. ఈ చెట్టు కింద నిలబడితే అంతే సంగతి! | Fascinating Facts About The Caribbean Beach Death Apple Tree Found In Florida Forests | Sakshi
Sakshi News home page

డెత్‌ యాపిల్‌.. ఈ చెట్టు కింద నిలబడితే అంతే సంగతి!

Jun 20 2026 1:41 PM | Updated on Jun 20 2026 1:41 PM

Fascinating Facts About The Caribbean Beach Death Apple Tree Found In Florida Forests

ప్రకృతి

కిడ్స్‌ స్పెషల్‌

కార్‌ పార్క్‌ చేస్తే, దాని పాలు కారు మీద పడి పెయింట్‌ ఊడిపోతుంది

ఫ్లోరిడా అడవుల్లో, కరేబియన్‌ బీచ్‌ల దగ్గర ఒక చెట్టు ఉంది. పేరు ‘మంచినీల్‌’. చూడ్డానికి పచ్చగా ఉండే కాయలు కాస్తుంది. కానీ దాని ఆకు, కాయ, బెరడు, పాలు... అన్నీ విషం. అందుకే కొలంబస్‌ దీనిని ‘డెత్‌ యాపిల్‌’ అని పిలిచాడు.

ఈ చెట్టు 9 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. వాన పడుతుంటే ఈ చెట్టు కింద నిలబడితే... అంతే సంగతి. చెట్టు మీద నుంచి కారే వాననీళ్లు ఒంటి మీద పడితే చర్మం మంట పుట్టి దురద వస్తుంది. బొబ్బలు వస్తాయి. చెట్టు కింద కార్‌ పార్క్‌ చేస్తే, దాని పాలు కారు మీద పడి పెయింట్‌ ఊడిపోతుంది. అందుకే ఆ చెట్ల చుట్టూ ‘డేంజర్‌’ బోర్డులు పెడతారు. ఈ చెట్టులో ‘హిప్పోమేన్‌’ అనే విషం ఉంటుంది. చెట్టు మొత్తం విషమే. పొరపాటున ఈ చెట్టు కర్రని నరికినా, కాల్చినా వచ్చే పొడిని, పొగని పీల్చామంటే గొంతులో మంట, దగ్గు, జ్వరం వచ్చేస్తాయి. ఊపిరి ఆడదు. అందుకే ఈ చెట్టు జోలికి ఎవరూ వెళ్లరు.

మంచినీల్‌ కాయలు చూడ్డానికి జామకాయల్లా, చిన్న యాపిల్స్‌లా ముద్దుగా ఉంటాయి. కానీ ఒక్క కాయ తిన్నా నోరు, గొంతు కాలిపోతుంది. కడుపులో మంట. ప్రాణానికే ప్రమాదం. అందుకే అడవికి వెళ్లినా, బీచ్‌కి వెళ్లినా తెలియని కాయలు, పళ్లు అస్సలు ముట్టుకోకూడదు. తినకూడదు. ‘డేంజర్‌’ బోర్డు ఉంటే దూరం నుంచే దండం పెట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement