ఓపెన్ఏఐపై యాపిల్ దావా! | Apple Sues OpenAI Over Stolen Trade Secrets in Federal Court | Sakshi
Sakshi News home page

ఓపెన్ఏఐపై యాపిల్ దావా!

Jul 11 2026 6:33 PM | Updated on Jul 11 2026 6:40 PM

Apple Sues OpenAI Over Stolen Trade Secrets in Federal Court

ప్రపంచ టెక్ దిగ్గజాలు కృత్రిమ మేధ పోరులో భాగంగా ఇప్పుడు కోర్టు మెట్లెక్కారు. తమ అత్యంత రహస్యమైన వాణిజ్య సమాచారాన్ని, హార్డ్‌వేర్ డిజైన్లను దొంగిలించారంటూ ఐఫోన్ తయారీదారు యాపిల్ చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్‌ఏఐపై దావా వేసింది. ఓపెన్ఏఐతో పాటు సంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్న ఇద్దరు మాజీ యాపిల్ ఉద్యోగులనూ ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. కాలిఫోర్నియా నార్త్‌ డిస్ట్రిక్ట్‌ ఫెడరల్ కోర్టులో యాపిల్ 41 పేజీల సుదీర్ఘ ఫిర్యాదును దాఖలు చేసింది. కన్స్యూమర్ హార్డ్‌వేర్ (స్మార్ట్‌ఫోన్లు, ఇతర పరికరాలు) రంగంలోకి అడుగుపెట్టేందుకు ఓపెన్ఏఐ షార్ట్‌కట్‌లను వెతుకుతోందని, అందుకోసం యాపిల్ మేధోసంపత్తిని వ్యవస్థీకృతంగా దోచుకుందని ఆరోపించింది.

ల్యాప్‌టాప్ చోరీ..

యాపిల్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఈ వివాదంలో ఇద్దరు మాజీ ఉద్యోగుల పాత్ర కీలకంగా మారింది. యాపిల్‌లో ఐఫోన్, యాపిల్ వాచ్ ప్రొడక్ట్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్‌గా దాదాపు 24 ఏళ్లు పనిచేసిన టాంగ్ టాన్  ప్రస్తుతం ఓపెన్ఏఐ చీఫ్ హార్డ్‌వేర్ ఆఫీసర్‌గా ఉన్నారు. టాన్ యాపిల్ సరఫరాదారుల రహస్య సమాచారాన్ని ఓపెన్ఏఐకి చేరవేశారని యాపిల్ పేర్కొంది. అంతేకాదు, యాపిల్ ఉద్యోగులను ఓపెన్ఏఐ ఇంటర్వ్యూలు చేసే సమయంలో.. సంస్థకు చెందిన విడిభాగాలను తీసుకువచ్చి ప్రదర్శించాల్సిందిగా (‘షో అండ్ టెల్’ సెషన్స్) ఒత్తిడి తెచ్చారని యాపిల్ ఆరోపించింది.

చాంగ్ లియు అనే మాజీ యాపిల్ ఇంజినీర్ జనవరి 2026లో ఓపెన్ఏఐలో చేరారు. అయితే, యాపిల్‌కు చెందిన ల్యాప్‌టాప్‌ను తిరిగి ఇవ్వకుండా ఒక అంతర్గత ‘అథెంటికేషన్ బగ్’ (సాంకేతిక లోపం) ఆధారంగా యాపిల్ నెట్‌వర్క్‌లోకి చొరబడ్డారని సంస్థ గుర్తించింది. దీని ద్వారా విడుదల కాని ఉత్పత్తుల వివరాలు, సర్క్యూట్ బోర్డ్ డిజైన్లు కలిగిన వేలాది పేజీల రహస్య ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు యాపిల్ ఆధారాలను బయటపెట్టింది. ‘ఓపెన్ఏఐ కొత్త హార్డ్‌వేర్ సామ్రాజ్యం ఒక అక్రమ పునాదిపై నిర్మితమవుతోంది. యాపిల్ రహస్యాలను దొంగిలించి తమ హార్డ్‌వేర్ ప్రయత్నాలు చేపడుతున్నారు’ అని యాపిల్ తన పిర్యాదులో తెలిపింది.

మిత్రుల మధ్య శత్రుత్వం

2024లో యాపిల్ తన ‘యాపిల్ ఇంటెలిజెన్స్’ కోసం ఓపెన్ఏఐతో జతకట్టి చాట్‌జీపీటీని ఐఫోన్లలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే కాలక్రమేణా వీరి బంధం క్షీణించింది. యాపిల్ క్రమంగా గూగుల్ వైపు మొగ్గు చూపడం, మరోవైపు యాపిల్ మాజీ డిజైన్ హెడ్ జోనీ ఐవ్ నేతృత్వంలోని స్టూడియోను ఓపెన్ఏఐ దక్కించుకుని సొంతంగా ఏఐ స్మార్ట్‌ఫోన్ లేదా హార్డ్‌వేర్ పరికరాన్ని తయారుచేసే పనిలో పడటంతో ఇరు సంస్థల మధ్య పోటీ తీవ్రమైంది. ఫిబ్రవరి 2026 లోనే తాము ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ జరిపి ఓపెన్ఏఐని హెచ్చరించామని, అయినా వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని యాపిల్ స్పష్టం చేసింది.

స్పందించిన ఓపెన్ఏఐ

ఈ ఆరోపణలపై ఓపెన్ఏఐ ప్రతినిధి డ్రూ పుసాతేరి స్పందిస్తూ.. ‘మేము కోర్టు ఫైలింగ్‌ను పరిశీలిస్తున్నాం. మాకు ఇతర కంపెనీల వాణిజ్య రహస్యాలపై ఎలాంటి ఆసక్తి లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడే వినూత్న సాంకేతికతను నిర్మించడంపైనే మా దృష్టి అంతా ఉంది’ అని లీగల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దాదాపు 852 బిలియన్‌ డాలర్ల విలువతో త్వరలోనే ఐపీఓకి వెళ్లాలని భావిస్తున్న ఓపెన్ఏఐకి ఈ కేసు చట్టపరంగా పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. యాపిల్ ప్రస్తుతం తమ రహస్యాల వినియోగాన్ని అడ్డుకోవడంతో పాటు భారీ నష్టపరిహారాన్ని కోరుతోంది.

ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement