బంగారం, వెండి, బిట్‌కాయిన్ గురించి చెప్పే 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఏఐ గురించి, ఉద్యోగాల గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. దాని ప్రభావం ఉద్యోగాలపై కూడా అంతే వేగంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఏఐ టెక్నాలజీని తమ పనుల్లో ఉపయోగించడం మొదలెట్టేశాయి. దీన్నిబట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా మాజీ వాణిజ్య శాఖ మంత్రి కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందని కియోసాకి పేర్కొన్నారు.
అమెరికా మాజీ వాణిజ్య శాఖ మంత్రి అభిప్రాయం ప్రకారం.. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువ ఉద్యోగులు రాబోయే కాలంలో ఏఐ ప్రభావానికి గుయారవుతారు. నిరుద్యోగం బాగా పెరిగిపోతుంది. అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, డేటా విశ్లేషణ వంటివన్నీ కూడా ఏఐ చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. అనేక కంపెనీల సీఈఓలు కూడా ఈ మార్పుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అమెరికా వద్ద ఏఐ అభివృద్ధికి కావలసిన స్పష్టమైన వ్యూహం ఉన్నప్పటికీ.. ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులను ఎలా సిద్ధం చేయాలనే దానికి కావాల్సిన ప్రణాళిక లేదని పేర్కొన్నారు. కాబట్టి యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాలు లేదా ఇతర కంపెనీల మీద ఆధారపడకుండా.. తమ భవిష్యత్తును తామే సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
జాబ్ చేస్తున్నవారు సైతం కేవలం ఒక ఉద్యోగంపై మాత్రమే ఆధారపడకుండా.. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఏఐతో ఎలా కలిసి పనిచేయాలి అనే విషయాలను నేర్చుకోవాలి. అవసరమైతే సొంతంగా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడం ముఖ్యమని చెబుతున్నారు. మొత్తం మీద ఏఐ ఉద్యోగాలకు ముప్పు తెస్తుందని స్పష్టంగా తెలుస్తోంది.


