ఔరా... కైమెరా...! | Rare two-coloured apple attracts visitors in New Zealand | Sakshi
Sakshi News home page

ఔరా... కైమెరా...!

Jun 21 2026 1:30 AM | Updated on Jun 21 2026 1:30 AM

Rare two-coloured apple attracts visitors in New Zealand

రకరకాల, రంగు రంగుల ఆపిల్‌ పళ్లను కొనడం, తినడం సాధారణమే. కానీ ఒక ఆపిల్‌ కోసం జనం తండోపతండాలుగా ఓ షాప్‌కు వెళ్లడం ఎక్కడైనా చూశారా? అది కూడా కొనడానికి, తినడానికి కాదు.. కేవలం చూడటానికి, వీలైతే ఒకసారి ముట్టుకోవడానికి.

న్యూజిలాండ్‌లో ప్రస్తుతం అలాంటి విచిత్రమే జరుగుతోంది. సగం ఎరుపు, సగం పసుపు రంగుతో కనిపిస్తున్న ఓ అరుదైన ఆపిల్‌ స్థానిక ప్రజలను అమితంగా ఆకట్టుకుంటోంది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ నగర శివారులో ఉన్న ఓ పండ్ల దుకాణంలో ఈ అరుదైన ఆపిల్‌ ప్రస్తుతం సెలబ్రిటీ హోదా అనుభవిస్తోంది. మార్కెట్‌కు మే నెలలో వచ్చిన రెడ్‌ బ్రేబర్న్‌ ఆపిళ్ల సరఫరాలో ఈ వింత పండు బయటపడింది. దీన్ని చూసి దుకాణ సిబ్బంది మొదట తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. సాధారణంగా పండ్లలో రంగు తేడాలు కనిపిస్తుంటాయి.

కానీ ఇలా రెండు వేర్వేరు రంగులు కచ్చితంగా సమానంగా విడిపోయి ఉండటం వారినెంతగానో ఆశ్యర్యపరిచింది. దీంతో ఆ ఆపిల్‌ను జాగ్రత్తగా భద్రపరిచారు. అయితే, దీని గురించి ఆనోటా ఈనోటా చుట్టుపక్కలకు పాకడం, సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ కావడంతో సన్‌షైన్‌ మార్కెట్‌కు సందర్శకులు క్యూ కట్టారు. కొందరు సెల్ఫీలు తీసుకుంటుంటే, మరికొందరు పిల్లలను తీసుకువచ్చి ప్రకృతి అద్భుతమంటూ చూపిస్తున్నారు.

ఇంకొందరైతే అదృష్టం కోసం ఆపిల్‌ను తాకాలని కూడా కోరుతున్నారట. ఇలాంటి పండ్లను శాస్త్ర పరిభాషలో  ‘కైమెరా ఆపిల్‌‘ అని పిలుస్తారు. కైమెరా అంటే ఒకే జీవిలో రెండు వేర్వేరు జన్యు లక్షణాలు ఉండటం. పది లక్షల ఆపిళ్లలో ఒకటి మాత్రమే ఇలా రూపుదిద్దుకునే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement