పెళ్లయిన ఏడేళ్లలోపు చనిపోతే కట్నం చావే | Allahabad High Court holds that death within 7 years of marriage and dowry harassment | Sakshi
Sakshi News home page

పెళ్లయిన ఏడేళ్లలోపు చనిపోతే కట్నం చావే

Aug 9 2026 6:34 AM | Updated on Aug 9 2026 6:34 AM

Allahabad High Court holds that death within 7 years of marriage and dowry harassment

అలహాబాద్‌ హైకోర్టు రూలింగ్‌

లక్నో: కట్నం వేధింపుల కారణంగా చోటుచేసుకునే మహిళల మరణాలపై అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళ వివాహమైన ఏడేళ్లలోపు మరణించి, కట్నం వేధింపులకు గురైనట్లు ఆధారాలుంటే దానిని కట్నం వేధింపుల మరణంగా పరిగణించవచ్చని తెలిపింది. ఇందుకు భర్త లేదా అత్తమామల ప్రత్యక్ష ప్రమేయం ఉందనేందుకు ఆధారాలు చూపాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన కేసులో ఓ వ్యక్తికి దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదును పదేళ్లకు తగ్గిస్తూ తీర్పు వెలువరించింది. లక్నోలోని తల్కటోరా పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ అత్తింట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది. 

ఇందుకు కట్నం వేధింపులే కారణమంటూ ఆమె భర్త హోరాకు 2010లో దిగువ కోర్టు కఠిన జీవితా కారాగారం విధించింది. ఈ శిక్షను హోరా హైకోర్టులో సవాల్‌ చేశారు. విచారణ సమయంలో హైకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. ‘పిటిషనర్‌కు భార్య మరణంతో సంబంధం ఉందనేందుకు స్పష్టమైన ఆధారాలు లేనంత మాత్రాన, కట్నం చావు కేసు కాకుండా పోదు. అదే సమయంలో, పిటిషనర్‌కు గరిష్ట శిక్ష అయిన జీవిత ఖైదు విధించడానికి ట్రయల్‌ కోర్టు బలమైన కారణాలను చూపడంలో విఫలమైంది. ఇది తీవ్రమైన లేదా అరుదైన కేసుల పరిధిలోకి కూడా కాదు. హోరా ఇప్పటికే ఆరేళ్లకుపైగా జైలు శిక్ష అనుభవించారు. జైలు జీవితంలో అతడి సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుంటూ శిక్షా కాలాన్ని తగ్గిస్తున్నాం’అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement