జార్ఖండ్‌లో విద్యార్థి ఉద్యమకారులతో రెండూ రోజూ కొనసాగిన ప్రభుత్వ చర్చలు
ఉధృతమవుతున్న పరీక్షార్థుల నిరసనలు
నేడు మరో విడత చర్చలు
రాంచీ: చర్చలకు జార్ఖండ్ ప్రభుత్వం ముందుకొచ్చినా సరే తమ ఉద్యమపంథాను వీడేదిలేదని జార్ఖండ్‌లో పరీక్షల సంస్కరణల కోసం ఉద్యమిస్తున్న పరీక్షార్థులు పునరుద్ఘాటించారు. శుక్రవారం పది మంది సభ్యుల ప్రతినిధి బృందంతో మొదలైన చర్చలు శనివారం సైతం కొనసాగాయి. కానీ చర్చల్లో ఎలాంటి పురోగతి కన్పించలేదు. జార్ఖండ్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ వారి 14వ పరీక్షను రద్దుచేయాలన్న డిమాండ్‌సహా ప్రధాన డిమాండ్లకు సానుకూలంగా ఐదుగురు మంత్రుల ప్రతినిధి బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
దీంతో రెండో రోజూ చర్చలు సత్ఫలితాలివ్వలేదని తెలుస్తోంది. తమ డిమాండ్లను నెరవేర్చేదాకా రాంచీలోని జైపాల్‌సింగ్ ముండా స్టేడియంలో తమ నిరాహార దీక్షలు ఆగవని జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ సంస్కరణల మంచ్ శనివారం ప్రకటించింది. శనివారం చర్చలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ బృందం దీక్షాస్థలికి వచ్చి కొద్దిరోజులుగా నిరాహార దీక్షచేస్తున్న ఉద్యమనేత దేవేంద్ర నాథ్ మహతోను కలిసి మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్ మద్దతున్న ఎన్‌ఎస్‌యూఐ, ఏఎస్‌ఎస్, జేసీఎం విద్యార్థి సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం విడిగా భేటీ అయింది.
‘‘ఉద్యమిస్తున్న పరీక్షార్థుల డిమాండ్లలో వాస్తవికత దాగిఉంది. ఈ డిమాండ్లను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు నివేదించాం’’అని భేటీ తర్వాత మంత్రి సంజయ్ ప్రసాద్ యాదవ్ మీడియాతో చెప్పారు. ‘‘సీఎంతో నాలుగు గంటలపాటు చర్చించాం. ఉద్యమనేతలతో ఇప్పటికే ఐదు విడతల చర్చలు ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం ఆరో విడత చర్చిస్తాం’’అని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దీపికా పాండే సింగ్ తెలిపారు.
‘‘14వ జేపీఎస్సీ పరీక్ష రద్దు, గత పరీక్షలపై 90 రోజుల్లోపు సీఐడీ విచారణ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరహాలో జార్ఖండ్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు ఇలా ఆరు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుపెట్టామని జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ సంస్కరణల మంచ్ అధికార ప్రతినిధి సంజీవ్ షా తెలిపారు. మరోవైపు విద్యార్థుల ఉద్యమం శనివారం 15వరోజుకు చేరింది.
స్టేడియంలో పెద్దసంఖ్యలో విద్యార్థి సంఘా నేతలు, ఉద్యమకారులు చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో స్టేడియంను హోరెత్తించారు. అయితే దీక్షలో కూర్చున్న మహతో ఆరోగ్యం క్షీణిస్తోంది. ‘‘శుక్రవారమే మా డిమాండ్లు చెప్పాం. మళ్లీ శనివారం మీ వైఖరేంటని అడగడంలో అర్థంలేదు. నా ఆరోగ్యం పాడవుతోందని వైద్యులు హెచ్చరించారు. ఛాతిలో ఇన్ఫెక్షన్ సోకింది. ఇది ఇలాగే కొనసాగితే మాట్లాడలేను. రక్తపోటు, చక్కర స్థాయిలు పడిపోతున్నాయి. మీరు చెప్పే విషయాలు వినగలను. కానీ మాట్లాడలేను’’అని మహతో అన్నారు. మరోవైపు కాక్రోచ్ జనతాపారీ్ట(సీజేపీ) బృందం శనివారం దీక్షాస్థలికి వచ్చి ఉద్యమానికి మద్దతు తెలిపింది.
ఉద్యమంలోకి మరో వేదిక..
ఇప్పటికే జేపీఎస్సీ,జేఎస్‌ఎస్‌సీ సంస్కరణల మంచ్‌తోపాటు జేపీఎస్సీ,జేఎస్‌ఎస్‌సీ అభ్యర్తుల ఫోరమ్ ఈ స్టేడియంలో వేర్వేరుగా దీక్షాస్థలిలను ఏర్పాటుచేసి ఉద్యమిస్తున్నాయి. వీటికి శనివారం మరో వర్గం తోడైంది. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్‌ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాపై శుక్రవారం అసెంబ్లీ సమీపంలో సిరా దాడి జరగడంతో వాళ్లు సైతం స్టేడియంలో మరో నిరసన వేదికను ఏర్పాటుచేశారు. ‘వేదికలు వేరైనా ఉద్యమం మాత్రం ఒక్కటే. డిమాండ్లూ ఒక్కటే. 14వ జేపీఎస్సీ పరీక్షను రద్దుచేయాలి. పరీక్షల వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలి’’అని ఏఐఎస్‌ఏ రాంచీ అధ్యక్షుడు విజయ్ స్పష్టంచేశారు.


