డేటా మీది.. సంపద
బడా పారిశ్రామికవేత్తలది
యూపీలో ‘విద్యార్థుల గొంతుక’
కార్యక్రమంలో రాహుల్ వ్యాఖ్య
ప్రయాగ్‌రాజ్: యువతరం విషయానికొస్తే సమస్య, సమాచారం, సంపద అంశాల్లో దేశానికి వీళ్లే అతిపెద్ద బలమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కీలక నగరాల్లో దశల వారీగా కొనసాగుతున్న ‘ఛాంత్రోంకీ గూంజ్(విద్యార్థుల గొంతు)’కార్యక్రమంలో భాగంగా శనివారం ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కేపీ గ్రౌండ్‌లో వేలాది మంది విద్యార్థులనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు.
ఎల్లప్పుడూ తెల్లని టీ–షర్ట్ ధరించే రాహుల్ తన శైలికి భిన్నంగా లేత గులాబీరంగు సాధారణ షర్ట్‌తో ఆకట్టుకున్నారు. ‘‘మీరే ఈ దేశ గౌరవం, భవిష్యత్తు. దేశంలో యువత జనాభా అత్యధికం. మీరు సృష్టించే డేటా అపారం. 21వ శతాబ్దిలో దేశ ఆర్థికవ్యవస్థకు మీరు, డేటాయే చోదకశక్తులు. అయితే యువత వద్ద డేటా ఉంది. దానికి తోడు యువతలో ఉండాల్సిన శక్తిసామర్థ్యాలన్నీ మీకున్నాయి. కానీ వ్యవస్థ అనేది మిమ్మల్ని ఒక చక్రవ్యూహంలో పడేసింది.
యువత ఎక్కువ రీల్స్ చూసేలా, ఎక్కువ వాట్సప్ మెసెజ్‌లలో మునిగిపోయేలా, ఇన్‌స్టా గ్రామ్ రీల్స్ చేస్తూ, షేర్‌చేస్తూ వాటిల్లోనే గడిపేలా ఒక అదృశ్య వ్యవస్థ నడుస్తోంది. ఇదంతా యువతకు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద వ్యసనంగా తయారైంది’’అంటూ రాహుల్ వెనక తెరమీద పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌ల ఫొటోలను ప్రదర్శించారు.
ఫొటోలను చూపిస్తూ.. ‘‘డేటా మీది. కష్టం మీది. కానీ సంపద మాత్రం వీళ్లది. ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ ఇదే. అదానీ సంపద గత పదేళ్లలో 30 రెట్లు పెరిగింది. ప్రభుత్వంతో ఆయన క్విడ్ ప్రోకో(నీకిది నాకది) ఒప్పందం చేసుకున్నారు. బీజేపీ సంపద అమాంతం పెరిగింది. బీజేపీ బ్యాంక్ ఖాతాలో సొమ్ము ఇన్నేళ్లలో రూ.150 కోట్ల నుంచి ఏకంగా రూ.10,000 కోట్లకు ఎగసింది. ఇక ఆర్‌ఎస్‌ఎస్ విషయానికొస్తే.. ప్రభుత్వ ఉద్యోగాల్లో, మీడియా, జ్యుడీషరీ, పారామిలటరీ, విశ్వవిద్యాలయాలు, కళాశాలలల్లో ఆర్‌ఎస్‌ఎస్ భావజాల వ్యక్తులున్నారు. ఇలా వీళ్లంతా మనల్ని నియంత్రిస్తున్నారు. ఇదే వ్యవస్థ’’అని రాహుల్ అన్నారు.
సర్టిఫికెట్లకు అర్థం లేకుండా పోయింది
‘‘కష్టపడి చదివి సంపాదించిన సరి్టఫికెట్లకు ఎలాంటి అర్థం లేకుండాపోయింది. ఇవి ఉద్యోగం ఇవ్వలేవు. విద్యార్థులుసైతం అత్యధిక ఫీజులు, పరీక్షల వ్యవస్థల అక్రమాల వలయంలో చిక్కుకున్నారు. ఉన్నత విద్య కోసం ఎంతో ఖర్చుచేయాల్సి వస్తోంది. తీరా కోర్సు పూర్తయ్యాక ఉద్యో గం రాదు. తయారీరంగం కుదేలవుతోంది. రుణాలు దొరకడం కష్టమైంది. పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీలు ఆగట్లేవు. ఏఐ వచ్చి ఉన్న ఉద్యోగాలనూ తీసేస్తోంది. యువత కష్టాలు ఇంకెన్నో’’అని రాహుల్ అన్నారు.
అంధకారంలో అగ్గిరాజేయండి
‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ఎందరో విద్యార్థులు ఉద్యమించారు. పేపర్ లీకేజీలతో మనస్తాపంతో మరెందరో బలవన్మరణాలకు పాల్పడ్డారు. వాళ్లకు నా నివాళులు. అస్తవ్యవస్త విద్యారంగంలో అంధకారం అలుముకుంది. మీ తల్లిదండ్రులు చేయలేని పనిని మీరైనా చేయండి. ఇకనైనా విద్యార్థులు భయాలను విడనాడి అంధకారంలో ఉద్యమదీపాలను వెలగించి దేశంలో మార్పులకు పునాదులు వేయండి. విద్వేషం, హింసతో మార్పులు తేలేం. ప్రేమతోనే ఇది సాధ్యం. మీరే దేశ స్ఫూర్తి. మీరే దేశ భవిత. ప్రపంచంలోని బ్యూటిఫుల్ యంగ్‌స్టర్స్ మీరే. ప్రేమ దుకాణాలను తెరవండి. ప్రేమతోనే పోరాడి గెలవండి’’అని రాహుల్ అన్నారు.


