అందుబాటులోకి ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్
న్యూఢిల్లీ: దాదాపు 20 ఏళ్ల తర్వాత సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో ఐఆర్‌సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) తన టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందుకు సంబంధించిన బీటా వెర్షన్ ఈ నెల 15 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త వెబ్‌సైట్‌లో ప్రయాణికులకు సులభంగా, వేగంగా టికెట్ బుక్ చేసుకునేందుకు వీలవుతుంది. ఇందుకుగాను రైల్వే శాఖ నాలుగు ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చింది. ఇందులో ప్రకటనలు, అనవసరపు క్యాప్చాలు లేవు.
టికెట్ బుక్ చేసేటప్పుడు స్క్రీన్‌పై వచ్చే అనవసరపు పాప్–అప్‌లు, మిరుమిట్లు గొలిపే గ్రాఫిక్స్ ప్రకటనలు, ఇబ్బంది పెట్టే క్యాప్చాలను పూర్తిగా తొలగించింది. దీనివల్ల ప్రయాణికులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయంలో ఇది ఎంతో సహాయపడుతుంది. అన్ని తరగతుల సీట్ల లభ్యత ఒకే స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. రెగ్యులర్‌గా ప్రయాణించే వారి వివరాలు వెబ్‌సైట్‌లో ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్‌ఎస్) ద్వారా నిమిషానికి 1.5 లక్షల కంటే ఎక్కువ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. బీటా వెర్షన్‌ను ఐఆర్‌సీటీసీ ఇ–టికెటింగ్ పోర్టల్ ద్వారా లేదా ప్రస్తుత ఐఆర్‌సీటీసీ హోమ్‌పేజీలో ఉన్న లింక్‌తో యాక్సెస్ చేయవచ్చు.


