సీజేఐని దుర్భాషలాడుతూ ఇద్దరు లా విద్యార్థుల వీరంగం
14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న మరో దూషణల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10వ తేదీన 13వ నంబర్ కోర్టు హాల్లో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సమక్షంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి యూపీలోని ఇటావాకు చెందిన లక్నో యూనివర్సిటీలో మూడో సంవత్సరం లా చదువుతున్న ప్రబల్ ప్రతాప్ సింగ్(24), రాయ్‌బరేలీకి చెందిన సెకండియర్ లా విద్యార్థి చందర్ భాన్(23)లను అరెస్ట్ చేశారు. పిటిషనర్‌గా ఉన్న ప్రబల్ సింగ్ ఓ కేసును స్వయంగా వాదించేందుకు కోర్టు హాలుకు వచ్చాడు.
ఈ సందర్భంగా చేతిలోని పేపర్లను గాలిలోకి విసిరివేస్తూ, సీజేఐ నుద్దేశించి దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. ఇతడికి చందర్ భాన్ తోడయ్యాడు. అడ్డుకోబోయిన భద్రతా సిబ్బందితో వీరు ఘర్షణ పడ్డారు. దీంతో, కోర్టు కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. భద్రతా సిబ్బందిని ఇద్దరినీ వెంటనే అదుపులోకి తీసుకుని మానసిక వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. అయితే, ఇద్దరికీ ఎలాంటి మానసిక చికిత్స అవసరం లేదని వైద్యులు నిర్ధారించారు.
వీరి వద్ద అభ్యంతరకర రాతలున్న కరపత్రాలు లభించాయి. సుప్రీంకోర్టు భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టు ఆదేశాలతో పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ గడువు బుధవారం పూర్తయింది. పోలీసుల వినతి మేరకు తదుపరి విచారణ నిమిత్తం వీరిద్దరినీ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ రవి ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్‌కు అనుమతించారు. వారం క్రితం సుప్రీంకోర్టు హాల్లో విచారణ సమయంలో ఓ లాయర్ అనుచితంగా వ్యవహరించడం, దూషణలకు దిగడం తెల్సిందే. అయితే, అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీజేఐ ప్రకటించారు.


