breaking news
Rs 1 crore salary
-
దేశంలో ఇక్కడ రూ.కోటి జీతమొచ్చినా.. ఇల్లు రాదు!
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటైన గురుగ్రామ్‌లో సొంతింటి కల ఇప్పుడు అధిక ఆదాయం ఉన్న కుటుంబాలకు కూడా భారంగా మారుతోంది. వార్షికంగా రూ.80 లక్షలు నుంచి రూ.1 కోటి వరకు ఆదాయం ఉన్నవారికీ ఇల్లు కొనుగోలు చేయడం కష్టసాధ్యంగా మారిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ తన తాజా నివేదికలో వెల్లడించింది. పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, కుటుంబ ఆదాయాల కంటే వేగంగా దూసుకెళ్తుండటంతో గృహ కొనుగోలు సామర్థ్యం గణనీయంగా దెబ్బతిన్నట్లు నివేదిక పేర్కొంది.EMI భారం రెట్టింపుసీబీఆర్ఈ విశ్లేషణ ప్రకారం, గురుగ్రామ్‌లో సగటు EMI-ఆదాయ నిష్పత్తి 2021లో సుమారు 20 శాతం ఉండగా, 2025 నాటికి అది దాదాపు 40 శాతానికి చేరింది. అంటే కుటుంబ ఆదాయంలో దాదాపు సగం భాగం గృహ రుణ EMIకే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2026 నుంచి 2028 మధ్య ఈ నిష్పత్తి 38–40 శాతం వద్ద స్థిరపడే అవకాశమున్నప్పటికీ, అది ఇప్పటికీ అధిక భారం గానే ఉంటుందని నివేదిక సూచిస్తోంది.రూ.కోటి సంపాదించినా భారీ బడ్జెట్ అవసరంఏటా రూ.80 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలు సాధారణంగా 2,250–3,700 చదరపు అడుగుల 3-BHK ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుంటే, రూ.1 కోటి వార్షిక ఆదాయం ఉన్నవారు 3,000–4,300 చదరపు అడుగుల 4-BHK గృహాలను కొనుగోలు చేసే స్థాయిలో ఉంటారని సీబీఆర్ఈ అంచనా వేసింది. అయితే చదరపు అడుగుకు ధరలు భారీగా పెరగడంతో ఈ వర్గాలకూ గృహ కొనుగోలు సామర్థ్యం తగ్గిపోయింది.రుణాలు పెరిగినా ధరలే నిర్ణయాత్మకందేశంలో గృహ రుణాల లభ్యత గణనీయంగా పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.11.59 ట్రిలియన్లు ఉన్న రెసిడెన్షియల్ హోమ్ లోన్లు, 2026 నాటికి రూ.32.78 ట్రిలియన్లకు చేరాయి. తక్కువ వడ్డీ రేట్లు, బ్యాంకుల నుంచి రుణాల లభ్యత, పెరిగిన కుటుంబ ఆదాయాలు డిమాండ్‌కు బలం ఇచ్చినా, ప్రాపర్టీ ధరల వేగవంతమైన పెరుగుదల కొనుగోలుదారులపై అదనపు ఒత్తిడిని సృష్టిస్తోంది.గురుగ్రామ్‌లో రియల్ ఎస్టేట్ బూమ్2000 సంవత్సరం నుంచి గురుగ్రామ్‌లో 3.2 లక్షలకు పైగా నివాస యూనిట్లు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా 2021–2025 మధ్య గృహ విక్రయాలు కొత్త ప్రాజెక్టుల కంటే ఎక్కువగా నమోదవడం వల్ల మార్కెట్లో డిమాండ్ బలంగా కొనసాగింది. 2026 తొలి త్రైమాసికం నాటికి నగరంలో సుమారు 2.07 లక్షల పూర్తయిన గృహాలు, మరో 1.21 లక్షల యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది.ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేతో కొత్త హాట్స్పాట్లుగోల్ఫ్ కోర్స్ రోడ్, సోహ్నా రోడ్లతో ప్రారంభమైన అభివృద్ధి ఇప్పుడు నార్తర్న్ పెరిఫెరల్ రోడ్ (ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే), గోల్ఫ్ కోర్స్ ఎక్స్టెన్షన్, సదరన్ పెరిఫెరల్ రోడ్ ప్రాంతాలకు విస్తరించింది. 2024లో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతాల్లో ప్రీమియం గృహాలకు డిమాండ్ మరింత పెరిగింది.లగ్జరీ, బ్రాండెడ్ హౌసింగ్‌కు ఊపుగురుగ్రామ్లో ఇప్పుడు సాధారణ అపార్ట్మెంట్లకంటే బ్రాండెడ్ లగ్జరీ రెసిడెన్సులు వేగంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ హాస్పిటాలిటీ, లైఫ్‌స్టైల్ బ్రాండ్లతో కలిసి డెవలపర్లు హైఎండ్ ప్రాజెక్టులను తీసుకొస్తున్నారు. అదే సమయంలో వృద్ధాప్య జనాభా పెరుగుతుండటంతో సీనియర్ లివింగ్ కమ్యూనిటీలు కూడా కొత్త పెట్టుబడి అవకాశాలుగా మారుతున్నాయి. -
కోటి సంపాదించకుండానే కోటీశ్వరులు కావచ్చా?
ఎక్కువ జీతం వస్తేనే ధనవంతులు అవుతామని చాలా మంది భావిస్తారు. కానీ అధిక ఆదాయం కంటే ఆర్థిక క్రమశిక్షణ, ఖర్చుల నియంత్రణ, దీర్ఘకాలిక పెట్టుబడులే నిజమైన సంపదకు పునాది అని బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) మీనాల్ గోయెల్ పేర్కొన్నారు. లింక్డ్ఇన్లో ఆమె పంచుకున్న అభిప్రాయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.మాజీ డెలాయిట్, కేపీఎంజీ ఉద్యోగి అయిన గోయెల్ తన కెరీర్ ప్రారంభంలో వార్షికంగా రూ.1 కోటి సంపాదిస్తేనే తాను ధనవంతురాలినని భావించేదాన్నని చెప్పారు. అయితే అనుభవం పెరిగే కొద్దీ, ఎక్కువ సంపాదించడం ఒక్కటే సంపదకు ప్రమాణం కాదని, సంపాదించిన డబ్బులో ఎంత మిగుల్చగలుగుతున్నామన్నదే అసలు కీలకమని గ్రహించినట్లు వెల్లడించారు.జీతం పెరిగినా.. పొదుపు పెరుగుతుందా?గోయెల్ అభిప్రాయం ప్రకారం, ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా అదే వేగంతో పెరగడం చాలా మందిలో కనిపించే ప్రధాన సమస్య. దీనినే ఆర్థిక నిపుణులు "లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లేషన్" లేదా "లైఫ్‌స్టైల్ క్రీప్" అని పిలుస్తారు.జీతం పెరిగిన వెంటనే అధిక అద్దె ఉన్న ఇళ్లకు మారడం, ఖరీదైన కార్లను ఈఎంఐలపై కొనుగోలు చేయడం, తరచూ బయట భోజనం చేయడం, విలాసవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం వల్ల అదనంగా వచ్చిన ఆదాయం పూర్తిగా ఖర్చైపోతుందని ఆమె వివరించారు. దీంతో ఆదాయం ఎక్కువైనా, నికర సంపద మాత్రం ఆశించినంతగా పెరగదని పేర్కొన్నారు.ఎక్కువ జీతం... తక్కువ పొదుపుతన పోస్టులో గోయెల్ ఒక ఆసక్తికరమైన ఉదాహరణను ప్రస్తావించారు. సంవత్సరానికి రూ.50 లక్షలు సంపాదించే కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఏడాదికి రూ.12 లక్షల జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగుల కంటే తక్కువ మొత్తాన్ని పొదుపు చేస్తున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. కారణం ఆదాయం కాదు.. ఖర్చుల నియంత్రణలో ఉన్న తేడా అని ఆమె అభిప్రాయపడ్డారు.కోటీశ్వరులు కావాలంటే కోటి జీతం కావాలా?వార్షికంగా రూ.1 కోటి జీతం ఉంటేనే కోటీశ్వరులు కావచ్చనే అభిప్రాయం సరైంది కాదని గోయెల్ స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా పొదుపు చేయడం, పెట్టుబడులు కొనసాగించడం, ప్రతి జీతం పెరుగుదలలో కొంత భాగాన్ని ముందుగా పెట్టుబడులకు కేటాయించడం ద్వారా సాధారణ ఉద్యోగి కూడా దీర్ఘకాలంలో రూ.1 కోటి ఆస్తిని సృష్టించగలడని ఆమె అభిప్రాయపడ్డారు.ఆమె ప్రకారం, సుమారు 10% వార్షిక జీతం పెరుగుదలతో పాటు దీర్ఘకాలంలో సగటున 12–15% పెట్టుబడి రాబడిని సాధించగలిగితే, పదేళ్ల వ్యవధిలో కోటి రూపాయల పెట్టుబడి విలువను చేరుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. అయితే ఇది మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడి విధానం, కాలవ్యవధి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఆర్థిక స్వేచ్ఛ అంటే ఇదే..రూ.1 కోటి పెట్టుబడి దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయాన్ని అందించే ఆస్తిగా మారితే, అది నెలవారీ అవసరాల్లో పెద్ద భాగాన్ని భర్తీ చేసే అవకాశం ఉంటుందని గోయెల్ పేర్కొన్నారు. అదే నిజమైన ఆర్థిక స్వేచ్ఛకు తొలి అడుగు అని ఆమె అభిప్రాయపడ్డారు.పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు కూడా గోయెల్ అభిప్రాయానికి మద్దతు ఇస్తున్నారు. ఆదాయం పెరిగిన ప్రతిసారి ఖర్చులు పెంచడం కంటే, ముందుగా ఎస్ఐపీ (SIP), పీఎఫ్, ఎన్పీఎస్ లేదా ఇతర దీర్ఘకాలిక పెట్టుబడుల్లో వాటాను పెంచాలని సూచిస్తున్నారు. సాధారణంగా అత్యవసర నిధి, తగిన బీమా, క్రమబద్ధమైన పెట్టుబడులు, అవసరం లేని రుణాలకు దూరంగా ఉండటం ద్వారా దీర్ఘకాలంలో గణనీయమైన సంపదను నిర్మించవచ్చని వారు చెబుతున్నారు.ధనవంతులుఏ కావడం అనేది కేవలం భారీ జీతంతో వచ్చే విషయం కాదు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులను నియంత్రించడం, క్రమశిక్షణతో పొదుపు చేయడం, నిరంతర పెట్టుబడులు కొనసాగించడం, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను పాటించడమే నిజమైన సంపద సృష్టికి మార్గమని గోయెల్ సందేశం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశంపై విస్తృత చర్చ కొనసాగుతోంది. -
ఈ ఐటీ ఉద్యోగం.. రూ.కోటి జీతం
పేరున్న కాలేజీలో పెద్ద పెద్ద డిగ్రీలు చదివితేనే మంచి ఉద్యోగాలు వస్తాయన్న భావనకు కాలం చెల్లిపోతోంది. ఏఐ టెక్నాలజీ విస్తృతమవుతున్న నేపథ్యంలో కాలేజీలు, డిగ్రీలతో సంబంధం లేకుండా ప్రతిభ ఉంటే చాలు రూ.లక్షల్లో జీతాలతో ఉద్యోగాలిస్తామంటూ ముందుకొస్తున్నాయి కొన్ని సంస్థలు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన ఓ స్టార్టప్ ఫౌండర్ సోషల్ మీడియాలో అసాధారణమైన జాబ్ లిస్టింగ్‌ను పోస్ట్ చేసి ఆన్లైన్లో విస్తృత చర్చను రేకెత్తించారు.‘స్మాల్ ఏఐ’ అనే ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకుడు సుదర్శన్ కామత్ తన కంపెనీకి ఫుల్ స్టాక్ టెక్ లీడ్ కావాలంటూ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ జాబ్‌కి ఆయన రూ .1 కోటి వార్షిక వేతన పరిహారాన్నిఆఫర్ చేశారు. ఈ ప్యాకేజీలో రూ.60 లక్షల ఫిక్స్డ్ వార్షిక వేతనం కాగా రూ.40 లక్షలు కంపెనీ యాజమాన్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనికి అభ్యర్థి కాలేజీ డిగ్రీలతో నిమిత్తం లేదని, రెజ్యూమ్ కూడా అక్కర్లేదని ప్రకటించడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.ఇంకా ఈ ఉద్యోగానికి ఏమేం కావాలన్నది కామత్ వివరించారు. ఆదర్శ అభ్యర్థికి "4-5 సంవత్సరాల అనుభవం" ఉండాలని, "నెక్ట్స్ జెఎస్, పైథాన్, రియాక్ట్ జెఎస్" గురించి బాగా తెలిసి ఉండాలని కామత్ పేర్కొన్నారు. అలాగే ఈ ఉద్యోగం బెంగళూరు కేంద్రంగా ఉంటుందని, ఎంపికైనవారు తక్షణమే ఉద్యోగంలో చేరాల్సి ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా జాబ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానంలో ఉంటుందని, వారానికి 5 రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేయాలని కూడా వివరించారు.ఈ జాబ్‌కు అప్లయి చేయడానికి రెజ్యూమె అవసరం లేదని, కేవలం 100 పదాలతో తమ గురించి తెలియజేస్తే చాలంటూ కంపెనీ ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చారు. కామత్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు భిన్న కామెంట్లతో ప్రతిస్పందిస్తున్నారు.Hiring a cracked full-stack lead at Smallest AISalary CTC - 1 CrSalary Base - 60 LPASalary ESOPs - 40 LPAJoining - ImmediateLocation - Bangalore (Indiranagar)Experience - 4-5 years minimumLanguages - Next JS, Python, React JSWork from Office - 5 days a week (slightly…— Sudarshan Kamath (@kamath_sutra) July 7, 2025 -
‘రూ.కోటి జీతమిచ్చినా సాఫ్ట్వేర్ ఉద్యోగులంతే’
భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులపై తీవ్ర విమర్శలు చేశారు అమెరికాకు చెందిన ఓ కంపెనీ సీఈవో. భారత్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రూ. 1 కోటి వరకు అధిక జీతాలు ఇస్తున్నా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా లేరని విమర్శించారు. ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన వరుణ్ ఉమ్మడి తన కంపెనీ భారతీయ కార్యాలయానికి నియామకం ఇబ్బందిగా మారిందని, చాలా మంది ఇంజనీర్లు కూడా వారానికి ఆరు రోజులు పని చేయడానికి కూడా ఇష్టపడటం లేదంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు."మా భారతీయ కార్యాలయానికి ఇంజనీర్లను నియమించుకోవడంలో ఒక విచిత్ర పరిస్థితిని గమనించాను. రూ. 1 కోటి మూల వేతనం ఉన్నప్పటికీ, చాలా మంది కష్టపడి పనిచేయడానికి ఇష్టపడటం లేదు. 3 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉన్న ఇంజనీర్లు చాలా మంది వారానికి ఆరు రోజులు పని చేయడానికి ముందుకు రాలేదు" అంటూ వరుణ్ రాసుకొచ్చారు.వరుణ్ ‘ఎక్స్’ పోస్ట్‌కు లక్షలలో వ్యూస్ వచ్చాయి. భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే కాదు.. ప్రస్తుతం అన్ని వృత్తులలోనివారూ మెరుగైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారని చాలా మంది వినియోగదారులు కామెంట్స్ చేశారు.ఉద్యోగులను ఆదివారాలు కూడా పని చేయాలంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలతో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వివాదం మళ్లీ రాజుకుంది. ఈ నేపథ్యంలో వరుణ్ ఉమ్మడి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఉద్యోగులతో వారానికి ఆరు రోజులు ఎందుకు పని చేయిస్తున్నారంటూ కొంతమంది ఎక్స్ యూజర్లు వరుణ్‌ను ప్రశ్నించారు. -
రూ.కోటి జీతమొచ్చే ఉద్యోగానికి ‘ఆనందం’గా రాజీనామా
సాధారణంగా ఎవరైనా చేస్తున్న ఉద్యోగాన్ని ఎప్పుడు వదిలేస్తారు? ఏదైనా మరో మంచి ఉద్యోగ అవకాశం చేతిలో ఉన్నప్పుడు ఇలా చేస్తారు. కానీ బెంగుళూరుకు చెందిన ఓ టెక్కీ రూ.కోటి జీతమొచ్చే లక్షణమైన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేశారు. అది కూడా చేతిలో ఎలాంటి ఆఫర్ లేకుండా..అంతటి భారీ జీతమొచ్చే జాబ్‌ను తాను ఎందుకు విడిచిపెట్టింది.. వివరిస్తూ బెంగుళూరుకు చెందిన టెక్కీ వరుణ్ హసిజా ఇటీవల ‘ఎక్స్’లో పెట్టిన పోస్ట్ విస్తృత చర్చకు దారితీసింది. బెంగుళూరులో తన ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయడం ద్వారా తాను ఒక ముఖ్యమైన జీవిత నిర్ణయం తీసుకున్నట్లు హసిజా వెల్లడించారు. ఇక్కడ ఆయనకు రూ. 1 కోటి పైగా వార్షిక వేతనం వచ్చేదని వివరించారు.కారణం ఇదే..చేతిలో ఎటువంటి ఉద్యోగ ఆఫర్ లేకుండా భారీ జీతమొచ్చే జాబ్ నుంచి ఎందుకు విరమించిదీ వరుణ్ హసిజా ఆసక్తికరమైన కారణం చెప్పారు. దశాబ్దంపాటు కెరీర్ సాగిన తర్వాత అర్ధవంతమైన విరామం అవసరమని పేర్కొంటూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.నిర్ణయం ఉద్వేగభరితమైనది కాదని, ఉద్యోగ అవకాశాలను అంచనా వేసేటప్పుడు తాను అనుసరించే నిర్మాణాత్మక ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా తీసుకున్నది హసిజా పేర్కొన్నారు. తన ఫ్రేమ్‌వర్క్ ఆనందం, ప్రభావం, సంపద సృష్టి అనే మూడు ప్రధాన కారకాల చుట్టూ తిరుగుతుందని వివరించారు. పనిలో ఆనందం ఉండాలనేది హసిజా సిద్ధాంతం. అన్నింటికీ అదే పునాదిగా పనిచేస్తుందని ఆయన భావన.అంత జీతం వస్తున్నా తాను ఇప్పడు చేస్తున్న ఉద్యోగంలో సంతోషం, ప్రభావం ఎక్కువగా కనిపించడం లేదని హసిజా కనుగొన్నారు. ఎడ్టెక్ రంగం ఇప్పటికే పరిశ్రమ వ్యాప్త సవాళ్లను ఎదుర్కొంటోంది. అర్ధవంతమైన పని కంటే కూడా మనుగడ వైపు దృష్టిని మార్చడం ప్రారంభించింది. ఫలితంగా అంతర్గత మార్పులు పని ప్రదేశాన్ని అసంతృప్తికరంగా చేసింది. ఈ వాతావరణం పెరుగుతున్న ఒత్తిడితో పాటు ఆయన ప్రాధాన్యతలకు అనుగుణంగా లేని ఉద్యోగంలో కొనసాగడం విలువైనదేనా అని ప్రశ్నించేలా చేసింది.వరుణ్ హసిజా పెట్టిన పోస్టుకు సోషల్ మీడియాలో విస్తృత స్పందన వచ్చింది. అతని పోస్ట్‌లకు 2.2 లక్షల వ్యూస్ వచ్చాయి. సాహసోపేతమైన నిర్ణయానికి ప్రశంసలు వచ్చాయి. కొందరు హసిజా ధైర్యాన్ని మెచ్చుకోగా మరికొందరు ఆర్థిక భద్రత లేకుండా అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలివేయడం ఆచరణాత్మకతను ప్రశ్నించారు. -
కో అంటే.. జీతం కోటి రూపాయలే!
ముంబై: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ సంస్థలో 23 మంది ఉద్యోగులు ఏడాదికి కోటి రూపాయలకుపైగా జీతాన్ని తీసుకుంటున్నారు. ఐటీసీ తరహాలో ఫ్లిప్‌కార్ట్ కూడా ఉద్యోగుల ప్రతిభను గుర్తిస్తూ, వారికి భారీ స్థాయిలో వేతనాలిస్తూ ప్రోత్సహిస్తోంది. గతేడాది ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం ఉద్యోగులకు 476 కోట్ల రూపాయలను చెల్లించింది. 2014-15 సంవత్సరానికి గాను ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ మెకిన్ మహేశ్వరి 18.73 కోట్ల రూపాయల వేతనాన్ని అందుకున్నారు. హిందుస్తాన్ యునిలివర్ ఎండీ సంజీవ్ మెహతా, ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్ వంటి టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాల కంటే మెకిన్ మహేశ్వరి జీతం ఎక్కువ కావడం విశేషం. కాగా మెకిన్ మహేశ్వరి గత సెప్టెంబర్ ఈ పదవి నుంచి వైదొలగి.. సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. గతేడాది హిందుస్తాన్ యూనిలివర్ కంపెనీలో 169 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఎనిమిదంకెల జీతాన్ని (కోటి) తీసుకున్నారు. ఇన్ఫోసిస్‌లో 123 మంది, విప్రోలో 70 మంది ఉద్యోగులు కోటి రూపాయలకుపైగా జీతాన్ని అందుకున్నారు. ఈ ఏడాది ఈ కామర్స్ కంపెనీల్లో 500 మందికిపైగా ఎగ్జిక్యూటివ్‌లు కోటి రూపాయల వేతనాలను తీసుకోబోతున్నారు. కాగా ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులకు తాము అందుకుంటున్న భారీ స్థాయి వేతనాలకు తగినట్టుగా లక్ష్యాలకు చేరువకావాల్సిన బాధ్యత ఉంటుంది. నిరంతరం ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుంది.


