హీరో ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌లు విడుదల | hero flex fuel splendor plus hf deluxe launch india price features | Sakshi
Sakshi News home page

హీరో ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌లు విడుదల

Jun 4 2026 12:39 PM | Updated on Jun 4 2026 12:46 PM

hero flex fuel splendor plus hf deluxe launch india price features

ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా దేశంలోనే తొలి భారీ స్థాయి ఫ్లెక్స్-ఫ్యూయల్ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లను హీరో మోటర్‌కార్ప్‌ (Hero MotoCorp) మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన ‘స్ల్పెండర్‌ ప్లస్’, ‘హెచ్‌ఎఫ్ డీలక్స్’ మోడళ్లను E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్లలో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ, పెట్రోలియం మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి పాల్గొన్నారు.

ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు పెట్రోల్‌తో పాటు అధిక శాతం ఇథనాల్ కలిగిన ఇంధన మిశ్రమాలను కూడా వినియోగించగలవు. దీంతో చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు కార్బన్ ఉద్గారాల నియంత్రణకు తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

స్ల్పెండర్‌ ప్లస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ ధరను (ఢిల్లీ ఎక్స్-షోరూమ్‌) రూ.82,710గా నిర్ణయించారు. 97.2 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ E85 ఇంధనంపై 8 బీహెచ్‌పీ శక్తి, 8.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇథనాల్ వినియోగానికి అనుగుణంగా కొత్త ఫ్యూయల్ పంప్, సవరించిన ఈసీయూ, అప్‌గ్రేడ్ చేసిన ఫ్యూయల్ సిస్టమ్‌ను అందించారు.

అదే విధంగా హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనం ధర రూ.72,792. దీన్ని కూడా  97.2 సీసీ ఇంజిన్‌తో E20–E85 ఇంధన మిశ్రమాలకు అనుకూలంగా రూపొందించారు. రెండు మోడళ్లలోనూ కొత్త డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, ట్యూబ్‌లెస్ టైర్లు, హీరో పేటెంట్ i3S (Idle Stop-Start System) టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ల విక్రయాలు జూలై నుంచి ఢిల్లీ-ఎన్‌సీఆర్, మహారాష్ట్రలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభమవుతాయి. అనంతరం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కొత్త మోడళ్లతో ఇథనాల్ ఆధారిత హరిత రవాణా దిశగా భారత ద్విచక్ర వాహన రంగంలో మరో కీలక అడుగు పడిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement