breaking news
british time
-
పర్యాటక మంత్రి హామీతోనైనా.. చంద్రగఢ్ దశ మారేనా?
వనపర్తి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత పురాతన కట్టడాల్లో చంద్రగఢ్ కోట ఒకటి. చుట్టూ రాతితో నిర్మించిన కోట చూడగానే అప్పటి నిర్మాణశైలి గుర్తుకొస్తుంది. అలాంటి కోట శిథిలావస్థకు చేరడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. 18వ శతాబ్దంలో మరాఠా రాజుల కాలంలో బాజీరావు పీశ్వా ఆత్మకూర్ సంస్థానానికి సంబంధించి పన్ను వసూలు చేయడానికి చంద్రసేనుడిని నియమించారు. చంద్రసేనుడు ఈ ప్రాంతంలోని ధర్మాపురం గ్రామానికి ఉత్తర దిశగా ఉన్న ఎత్తైన కొండపై ఈ కోట నిర్మించారు. చంద్రసేనుడు ఇక్కడి నుంచే వివిధ సంస్థానాధీశుల నుంచి పన్నులు వసూలు చేసి మరాఠాకు పంపేవాడు. చంద్రసేనుడు నిర్మించిన కోట కావడంతో దీనికి చంద్రగఢ్ కోటగా నామకరణం చేశారు. నేడు ఇక్కడ ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయంలో నిత్య పూజలతో పాటు ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శత్రువుల కదలికలను గుర్తించేందుకు.. కోట పైభాగంలో ఉండే సైనికులు శత్రు సైనం దండెత్తడానికి వస్తే సుమారు పది కిలోమీటర్ల దూరం నుంచి పసిగట్టి ఫిరంగులతో దాడి చేసేందుకు వీలుగా కోటగోడ భాగంలో భారీ రంధ్రాలను ఏర్పాటు చేశారు. పర్యాటక మంత్రి హామీతోనైనా.. అమరచింతలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చంద్రగఢ్ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి సూచించారు. మంత్రి హామీతో చంద్రగఢ్ కోట పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంతవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోటకు మరమ్మతులు చేయించి పార్క్‌లు ఏర్పాటుచేస్తే వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మంత్రి చొరవతో చంద్రగఢ్‌కు పూర్వ వైభవం రావాలని, ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు. ‘చుట్టూ పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకర వాతావరణంలో ఎత్తైన కొండపై 18వ శతాబ్దంలో నాటి సంస్థానాదీశుడైన చంద్రసేనుడు చంద్రగఢ్ కోటను నిర్మించారు. కోట మధ్యలో రామలింగేశ్వరస్వామి ఆలయంతో పాటు తాగునీటి కోసం రాతిపొరల మధ్య ఏర్పాటుచేసిన ఎనిమిది చిన్న చిన్న కొలనులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ ఏడాది పొడవునా నీరు ఉండటం విశేషం.’ ఇదీ ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం కోటలోని రాతి గోడలు శిథిలావస్థకు చేరాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోటను సందర్శించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అప్పట్లో కేవలం కోటపైకి వెళ్లడానికి వీలుగా సీసీ రహదారి నిర్మించి వదిలేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు చంద్రగఢ్ కోటను పట్టించుకునే వారే కరువయ్యారు. -
రాజంపేట రెవెన్యూ డివిజన్ కు సారొస్తారా
రాజంపేట: జిల్లాలో ఉన్న మూడు డివిజన్లో ఒకటైన రాజంపేటకు బాస్ ఎప్పుడోస్తారో అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాజంపేట రెవెన్యూ డివిజన్ అధికారి పోస్టు భర్తీలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. కొత్త సారు ఎప్పుడు వస్తారో అని డివిజన్ రెవెన్యూ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ పోస్టును దక్కించుకునేందుకు జాబితాలో పదిమంది ఉన్నారు. ఇప్పుడు తాజాగా మహిళా అధికారి ప్రయత్నాలు చేసుకుంటోంది. అయితే ఇంతవరకు ఎవరిని నియమించాలనే అంశంపై నిర్థారణకు ప్రభుత్వం రాలేదనే సమాచారం. మినీకలెక్టరేట్ చేస్తే... జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాలలో ఒకటైన రాజంపేటను మినీ కలెక్టరేట్‌గా చేసే యోచనలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అదే కానీ జరిగితే ఐఏఎస్‌ను సబ్ కలెక్టరుగా ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. పైగా రాజంపేట సబ్‌కలెక్టరు హోదా కలిగిన డివిజన్ కావడంతో దీన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇక్కడ సబ్‌కలెక్టరుగా పనిచేసిన వారు ప్రభుత్వ స్థాయిలో రాష్ట్రస్థాయి క్యాడర్లో పనిచేశారు. దాదాపు 20 మందికి పైగా ఉన్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఐఏఎస్‌ల పాలన రాజంపేట రెవెన్యూ డివిజన్లో కొనసాగింది. వీరి హయాంలో రెవెన్యూపాలన సక్రమంగానే కొనసాగిందనే వాదన. ఎప్పుడైతే ఆర్డీవోల చేతిలోకి ఇక్కడి పాలన వెళ్లిందో అప్పటి నుంచి ఈ డివిజన్లో రెవిన్యూ పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇష్టారాజ్యంగా రెవెన్యూ వ్యవహారాలు.. డివిజన్ రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాలకు సంబంధించి 17 మండలాలు ఉన్నాయి. మొన్నటి వరకు పనిచేసినా ఆర్డీవో ప్రభాకర్పిళ్లై పదవీ విరమణ పొందిన తర్వాత సోమశిల స్పెషల్ డిప్యూటీ కార్యాలయం ఎస్డీసీ చెంగల్రావును ఇన్చార్జిగా నియమించారు. డివిజన్లో రెవెన్యూ వ్యవహారాలు ఇష్టారాజ్యంగా మారిపోయాయి. డివిజన్ పరిధిలోని తహసీల్దార్లపై అజమాయిషీ, పర్యవేక్షణ చేసే డివిజన్ కేంద్రంలో అధికారి లేకపోవడంతో ఎవరి పనివారిదే అన్నట్లుగా కొనసాగుతున్నాయి. మరోవైపు అడ్డు అదుపు లేకుండా డివిజన్ పరిధిలో భూ ఆక్రమణలు పెద్ద ఎత్తున తెరదీశారు. ఇన్చార్జి ఆర్డీవోగా ఉన్న చెంగల్రావు నామమాత్రమే అన్నట్లుగా కొనసాగుతుండటంతో రెవెన్యూ అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నరీతిలో రెవెన్యూ పాలన కొనసాగుతోందన్న విమర్శలు వెలువడుతున్నాయి. అనుకూలమైన వారి కోసం పచ్చనేతలు ప్రయత్నాలు.. రాజంపేట సబ్‌కలెక్టరేట్‌కు వచ్చే బాస్ తమకు అనుకూలమైన వారినే తెచ్చుకోవాలనే తపన పచ్చనేతల్లో కనిపిస్తోంది. సీఎం వద్దకు కొందరిపేర్లు ఇప్పటికే ఉన్నాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు తన సామాజికవర్గానికి చెందిన రెవిన్యూ అధికారి(ఆర్టీవో)ని తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ డివిజన్ పరిధిలో రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాలలో తమకు పనులు జరగాలంటే తమ మార్కు ఉన్న అధికారి అయితేనే చక్కబెట్టుకోవచ్చునని పచ్చనేతలు భావిస్తున్నారు.