యూకే వీసా.. ఇండియన్స్‌కి గుడ్‌ న్యూస్‌ | UK Young Professionals Scheme 2026, Final Visa Ballot Opens For Indians On July 21st, Check Out Eligibility | Sakshi
Sakshi News home page

యూకే వీసా.. ఇండియన్స్‌కి గుడ్‌ న్యూస్‌

Jul 16 2026 10:30 AM | Updated on Jul 16 2026 11:29 AM

UK Visa Without Job Offer for Indians Young Professionals Scheme Ballot from July 21

యునైటెడ్‌ కింగ్‌డమ్‌.. యూకే వెళ్లాలని, అక్కడ చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని చాలామంది కలలు కంటుంటారు. అయితే ఆ అవకాశం అందరికీ దొరకదు. కానీ ఇప్పుడు యూకేలో ఉద్యోగం, ఉన్నత విద్య లేదా అంతర్జాతీయ అనుభవం కోసం ఎదురుచూస్తున్న భారత యువతకు మరో కీలక అవకాశం లభించింది. ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ (India Young Professionals Scheme - YPS) కింద 2026 సంవత్సరానికి సంబంధించిన రెండో, చివరి బ్యాలెట్‌ జూలై 21 నుంచి ప్రారంభం కానుంది.

ఈ వీసా స్కీమ్‌ ప్రత్యేకత ఏమిటంటే.. ముందుగానే ఉద్యోగ ఆఫర్‌ లేదా యజమాని స్పాన్సర్‌షిప్‌ అవసరం లేకుండానే అర్హులైన భారతీయులు యూకేలో రెండేళ్ల వరకు నివసిస్తూ, ఉద్యోగం చేయడం లేదా చదువుకోవడం చేయవచ్చు. ఈ వివరాలను యూకే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

జూలై 21 నుంచి 48 గంటలపాటు బ్యాలెట్‌

యూకే ప్రభుత్వ షెడ్యూల్‌ ప్రకారం బ్యాలెట్‌ జూలై 21, 2026 మధ్యాహ్నం 1:30 గంటలకు (IST)ప్రారంభమై, జూలై 23 మధ్యాహ్నం 1:30 గంటలకు ముగుస్తుంది. ఈ బ్యాలెట్‌లో నమోదు పూర్తిగా ఉచితం. అయితే బ్యాలెట్‌లో ఎంపికైన వారికి మాత్రమే తదుపరి వీసా దరఖాస్తు చేసే అవకాశం లభిస్తుంది. ఫలితాలను బ్యాలెట్‌ ముగిసిన రెండు వారాల్లోపు ఈమెయిల్‌ ద్వారా తెలియజేస్తారు.

మొత్తం 3,000 వీసాలు..

2026 సంవత్సరానికి ఈ పథకం కింద మొత్తం 3,000 వీసా స్థానాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం ఇప్పటికే ఫిబ్రవరిలో నిర్వహించిన తొలి బ్యాలెట్‌లో కేటాయించగా, మిగిలిన స్థానాలను ఇప్పుడు నిర్వహించే రెండో, చివరి బ్యాలెట్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. అందుకే ఇది ఈ ఏడాది చివరి అవకాశం కానుంది.

అర్హతలు ఇవే..

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి.

  • భారతీయ పౌరుడు అయి ఉండాలి.

  • వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

  • కనీసం బ్యాచిలర్‌ డిగ్రీ లేదా సమాన అర్హత ఉండాలి.

  • యూకేలో ప్రారంభ ఖర్చులకు సరిపడా 2,530 పౌండ్లు (సుమారు రూ.3.27 లక్షలు) పొదుపు ఉన్నట్లు నిరూపించాలి.

  • ఇతర వీసా అర్హతలను కూడా పూర్తి చేయాలి.

దరఖాస్తు ఎలాగంటే..

అర్హులైన అభ్యర్థులు యూకే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో బ్యాలెట్‌లో నమోదు చేసుకోవాలి. నమోదు సమయంలో పూర్తి పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్ట్‌ వివరాలు, పాస్‌పోర్ట్‌ స్కాన్‌ కాపీ, ఫోన్‌ నంబర్‌, ఈమెయిల్‌ వంటి వివరాలు సమర్పించాలి. నమోదు చేసిన సమాచారం పాస్‌పోర్ట్‌లోని వివరాలతో పూర్తిగా సరిపోవాలి.

ఎంపికైతే ఏమి చేయాలి?

బ్యాలెట్‌లో పేరు ఎంపికైన వారికి ఈమెయిల్‌ ద్వారా సమాచారం అందుతుంది. ఆ తేదీ నుంచి 90 రోజుల్లోపు వీసా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అలాగే వీసా ఫీజు, ఇమ్మిగ్రేషన్‌ హెల్త్‌ సర్‌చార్జ్‌ చెల్లించి, బయోమెట్రిక్‌ వివరాలు సమర్పించాలి. బ్యాలెట్‌లో ఎంపిక కావడం మాత్రమే వీసా మంజూరుకు హామీ కాదని, తుది పరిశీలన అనంతరం మాత్రమే వీసా జారీ అవుతుందని యూకే ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎంత ఖర్చవుతుంది?

వీసా దరఖాస్తు సమయంలో 340 పౌండ్లు వీసా ఫీజుతో పాటు 1,552 పౌండ్లు ఇమ్మిగ్రేషన్‌ హెల్త్‌ సర్‌చార్జ్‌ చెల్లించాలి. అదనంగా కనీసం 2,530 పౌండ్లు వ్యక్తిగత పొదుపు ఉన్నట్లు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

ఒక్కో బ్యాలెట్‌కు ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఎంట్రీలు చెల్లవు. ఈసారి ఎంపిక కాకపోయినా అర్హత కొనసాగితే భవిష్యత్‌లో నిర్వహించే బ్యాలెట్‌లకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ ఏడాదికి జూలై బ్యాలెట్‌నే చివరిదిగా యూకే ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల ఆసక్తి ఉన్న యువత ముందుగానే అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవడం మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement