భారతదేశంలో బంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మన దేశ ప్రజలు బంగారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా.. భవిష్యత్తు కోసం భద్రమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు. కాబట్టి ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అయితే.. ఇళ్లలోని బంగారం, దేశ ఆర్థిక వ్యవస్థలో ఉపయోగపడకుండా అలాగే ఉండిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (Gold Monetisation Scheme)ను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కొత్త రూపంలో తీసుకురావాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.
గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్
గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం.. ప్రజలు తమ ఇళ్లలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగించేలా చేయడం. బంగారం డిపాజిట్ చేసిన వారికి ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లించేది. గడువు పూర్తయిన తర్వాత వారు బంగారం రూపంలో గానీ, దానికి సమానమైన నగదు రూపంలో గానీ తిరిగి పొందే అవకాశం ఉండేది. అయితే ఈ స్కీమ్ అనుకున్నంత సక్సెస్ కాలేదు.
ఈ పథకం ఎందుకు విఫలమైంది?
దాదాపు పది సంవత్సరాల కాలంలో ఈ పథకం ద్వారా కేవలం 38 టన్నుల బంగారం మాత్రమే సేకరించారు. కానీ భారతీయుల వద్ద సుమారు 25,000 టన్నుల బంగారం ఉందని అంచనా. దీన్నిబట్టి చూస్తే.. ఈ పథకం ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదని తెలుస్తోంది.
➤భారతీయ కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి వచ్చిన లేదా భావోద్వేగ విలువ కలిగిన నగలను డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపలేదు.
➤పన్ను సంబంధిత విచారణలు వస్తాయనే భయం ప్రజల్లో ఉంది.
➤బ్యాంకులకు ఈ పథకం ద్వారా పెద్దగా లాభం లేకపోవడంతో వారు దీనిని ప్రోత్సహించలేదు.
➤ప్రభుత్వం వడ్డీతో పాటు బంగారం ధర పెరిగితే ఆ అదనపు మొత్తాన్ని కూడా చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగింది.
కొత్త మార్పులు ఏమిటి?
గోల్డ్ మానిటైజేషన్ స్కీములో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ముఖ్యమైన మార్పు ఏమిటంటే, దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలర్లు (బంగారు నగల వ్యాపారులు) కూడా కలెక్షన్ పార్ట్‌నర్లుగా పనిచేసే అవకాశం కల్పించడం.
అంటే.. ఇప్పటి వరకు బంగారాన్ని కేవలం బ్యాంకుల ద్వారానే మాత్రమే డిపాజిట్ చేయాల్సి వచ్చేది. ఇకపై ప్రజలు తమకు దగ్గరలో ఉన్న విశ్వసనీయ జ్యువెలర్ల వద్ద కూడా బంగారాన్ని ఇచ్చే అవకాశం ఉండవచ్చు. దీనివల్ల ప్రజలకు సౌకర్యం పెరుగుతుంది, అలాగే మరింత బంగారం ఈ పథకంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు
➤ఇళ్లలో ఉపయోగం లేకుండా ఉన్న బంగారం దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది.
➤విదేశాల నుంచి బంగారం దిగుమతుల అవసరం తగ్గుతుంది.
➤డాలర్లపై భారతదేశం ఆధారపడటం తగ్గుతుంది.
➤రూపాయి విలువ బలపడే అవకాశం ఉంటుంది.
➤దేశంలో బంగారం ఆధారిత వ్యాపారాలు మరింత పారదర్శకంగా మారతాయి.
➤దిగుమతులు తగ్గడం వల్ల, బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది.
ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. భారతీయుల వద్ద ఉన్న బంగారంలో కేవలం 5 శాతం మాత్రమే ఈ పథకం ద్వారా సమీకరించినా, సుమారు 1,250 టన్నుల బంగారం లేదా 80-90 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తి దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది. ఇది దాదాపు రెండేళ్ల పాటు బంగారం దిగుమతుల అవసరాన్ని తగ్గించే స్థాయిలో ఉంటుంది.
ప్రధానమంత్రి పిలుపు
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఒక సంవత్సరం పాటు కొత్త బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని కోరారు. దీనివల్ల దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


