మారనున్న హోమ్, పర్సనల్ లోన్ EMIలు! | RBI New Rules How Your Home and Personal Loan EMIs Will Change in 2027 | Sakshi
Sakshi News home page

మారనున్న హోమ్, పర్సనల్ లోన్ EMIలు!

Aug 19 2026 5:31 PM | Updated on Aug 19 2026 5:43 PM

RBI New Rules How Your Home and Personal Loan EMIs Will Change in 2027

హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా ఎంఎస్ఎంఈ లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ రేటు పెరిగినా, తగ్గినా దాని ప్రభావం నేరుగా ఈఎంఐపై పడుతుంది. అయితే.. చాలా సందర్భాల్లో బ్యాంకులు వడ్డీ రేటును ఎప్పుడు, ఎలా మారుస్తున్నాయో సాధారణ కస్టమర్‌కు పూర్తిగా అర్థం కావడం కష్టం. ఈ సమస్యను తగ్గించడంతో పాటు.. వడ్డీ రేట్ల విషయంలో మరింత పారదర్శకత తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రతిపాదించింది.

ప్రస్తుతం ఇవి ప్రతిపాదనలుగా మాత్రమే ఉన్నాయి. ఆర్బీఐ సెప్టెంబర్ 11, 2026 వరకు ప్రజలు, బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. ఈ నిబంధనలకు తుది ఆమోదం లభిస్తే.. 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

ఫ్లోటింగ్ రేట్ లోన్లకు కొత్త విధానం
కొత్త నిబంధనల ప్రకారం.. వాణిజ్య బ్యాంకులు ఇచ్చే ఫ్లోటింగ్ రేట్ పర్సనల్, హోమ్, ఎంఎస్ఎంఈ రుణాలను ఆర్బీఐ రెపో రేట్ లేదా ట్రెజరీ బిల్లుల వంటి బాహ్య బెంచ్‌మార్క్‌లకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

సింపుల్‌గా చెప్పాలంటే.. బ్యాంకు తనకు నచ్చిన విధంగా వడ్డీ రేటును మార్చకుండా, ఒక స్పష్టమైన ఎక్స్‌టర్నల్ రేటుతో దాన్ని లింక్ చేయాల్సి ఉంటుంది. దీంతో రుణగ్రహీతకు తన లోన్ వడ్డీ రేటు ఎందుకు పెరిగింది లేదా ఎందుకు తగ్గింది అనేది కొంతవరకు స్పష్టంగా తెలుస్తుంది.

మూడు నెలలకు ఒకసారి రీసెట్
మరో ముఖ్యమైన మార్పు వడ్డీ రేటు రీసెట్‌కు సంబంధించినది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. వడ్డీ రేటు మార్పును కనీసం మూడు నెలలకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తే, దాని ప్రభావం రుణగ్రహీతకు ఎక్కువ కాలం ఆలస్యం కాకుండా అందే అవకాశం ఉంటుంది. అంటే వడ్డీ రేటు తగ్గితే బ్యాంకులు ఈఎంఐని తగ్గించవచ్చు లేదా లోన్ కాలపరిమితిని తగ్గించవచ్చు.

అయితే.. ఇదే విధానం రేట్లు పెరిగినప్పుడు కూడా వర్తిస్తుంది. ఆర్బీఐ రెపో రేటును పెంచితే.. దాని ప్రభావం రుణ వడ్డీపై కూడా వేగంగా పడే అవకాశం ఉంది. అప్పుడు ఈఎంఐ పెరగవచ్చు లేదా రుణ కాలపరిమితి ఎక్కువ కావచ్చు.

లోన్ తీసుకునే సమయంలోనే పూర్తి వివరాలు
కొత్త నిబంధనల్లో పారదర్శకతకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. లోన్ తీసుకునే సమయంలోనే బ్యాంకులు తమ లోన్ అగ్రిమెంట్‌లో కొన్ని ముఖ్యమైన వివరాలను స్పష్టంగా ఇవ్వాలి. అందులో.. ''ఏ బాహ్య బెంచ్‌మార్క్‌కు లోన్‌ను అనుసంధానించారు?, బ్యాంకు మార్జిన్ లేదా స్ప్రెడ్ ఎంత?, వడ్డీ రేటును ఎప్పుడు రీసెట్ చేస్తారు?, వడ్డీ రేటు ఎలా మారుతుంది?'' వంటి విషయాలు స్పష్టంగా ఉండాలి. దీంతో రుణగ్రహీతకు తాను తీసుకుంటున్న లోన్ గురించి ముందుగానే మెరుగైన అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే లోన్ తీసుకున్నవారికి ఏంటి?
ఇప్పటికే పాత బెంచ్‌మార్క్ విధానంలో.. లోన్ తీసుకున్నవారికి కూడా కొత్త ప్రతిపాదనలో ఒక అవకాశం కల్పించారు. ప్రతిపాదన ప్రకారం.. 2029 ఏప్రిల్ 1 నాటికి అర్హత ఉన్న పాత రుణాలను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కొత్త ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ విధానంలోకి మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే.. ఇప్పటికే హోమ్ లోన్ లేదా ఇతర ఫ్లోటింగ్ రేట్ లోన్ ఉన్నవారు కూడా భవిష్యత్తులో ఈ కొత్త విధానం ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

ఎవరికి ఈ నిబంధనలు వర్తిస్తాయి?
ఈ ప్రతిపాదిత మార్గదర్శకాలు కేవలం పెద్ద వాణిజ్య బ్యాంకులకే పరిమితం కావు. ఇవి అమల్లోకి వస్తే.. ''వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, NBFCలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు'' వంటి సంస్థలకు వర్తించే అవకాశం ఉంది.

రుణగ్రహీతలకు లాభం ఏంటి?
ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు దాని ప్రయోజనం రుణగ్రహీతలకు వేగంగా అందేలా చేయడం. ఉదాహరణకు ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తే.. బ్యాంకులు కూడా తమ ఫ్లోటింగ్ రేట్ లోన్లపై వడ్డీని తగ్గించాల్సి రావచ్చు. దాంతో కొంతకాలం తర్వాత ఈఎంఐ తగ్గడం లేదా లోన్ కాలపరిమితి తగ్గడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

అదే సమయంలో.. మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. వడ్డీ రేట్లు ఎప్పుడూ తగ్గుతూనే ఉండవు. ఆర్బీఐ రేట్లు పెంచినప్పుడు ఈ మార్పులు రుణగ్రహీతలకు ప్రతికూలంగా కూడా మారవచ్చు. వడ్డీ పెరిగితే ఈఎంఐ పెరగడం లేదా లోన్ చెల్లించే కాలం పొడిగించడం వంటి పరిస్థితులు రావచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement