ఏనుగు దంతాల వివాదం: చిక్కుల్లో మోహన్‌ లాల్‌ | Actor Mohanlal Approaches Kerala Forest Department To Declare Ivory Under Amnesty Scheme, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఏనుగు దంతాల వివాదం: చిక్కుల్లో మోహన్‌ లాల్‌

Jul 4 2026 12:12 PM | Updated on Jul 4 2026 12:54 PM

Mohanlal turns to Kerala govts amnesty scheme to declare ivory articles

కొచ్చి: కేరళ ప్రభుత్వ వన్ టైమ్ అమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం కింద తన వద్ద ఉన్న ఏనుగు దంతాలను డిక్లేర్ చేయడానికి, తద్వారా చట్టపరమైన చర్యల నుండి మినహాయింపు పొందడానికి నటుడు మోహన్‌లాల్ కేరళ అటవీ శాఖను ఆశ్రయించినట్లు ‘ది హిందూ’ పత్రిక పేర్కొంది. ఇటీవల ఒక సీనియర్ అటవీ శాఖ అధికారి కొచ్చిలోని మోహన్‌లాల్ నివాసానికి వెళ్లి, వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972 లోని సెక్షన్ 41 ప్రకారం విచారణ జరిపినట్లు సమాచారం. ఈ విచారణలో భాగంగా, ఆ ఏనుగు దంతాలను ఆయన ఎలా సేకరించారు? వాటి వయసు ఎంత? అంతకుముందు వాటిని ఎందుకు డిక్లేర్ చేయలేదు? అనే అంశాలపై మోహన్‌లాల్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

యాజమాన్య పత్రాలను రద్దు చేసిన హైకోర్టు
మోహన్‌లాల్ వద్ద ఉన్న ఏనుగు దంతాలకు జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ పత్రాలను కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ 2025 అక్టోబర్‌లో రద్దు చేసింది. అలాగే ఆయన వద్ద ఏనుగు దంతాలు ఉండటాన్ని చట్టబద్ధం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా కోర్టు కొట్టివేసింది. 2015 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్ అధికారిక గెజెట్‌లో ప్రచురించలేదని, ఈ విధానపరమైన లోపం కారణంగానే ఆ యాజమాన్య ధృవీకరణ పత్రాలు, లైసెన్స్‌కు చట్టబద్ధత లేకుండా పోయిందని కోర్టు పేర్కొంది.

అయితే ఇలాంటి వన్యప్రాణి వస్తువులు కలిగి ఉన్నవారు వాటిని డిక్లేర్ చేసి, మినహాయింపు పొందేలా వన్ టైమ్ అమ్నెస్టీ పథకాన్ని  ఉపయోగించుకోవచ్చని హైకోర్టు బెంచ్ అప్పట్లో అభిప్రాయపడింది. హైకోర్టు యాజమాన్య పత్రాలను రద్దు చేసినప్పటికీ, అక్రమంగా ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అటవీశాఖ మోహన్‌లాల్‌పై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఈ తరుణంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.

కొనసాగుతున్న న్యాయపోరాటం
మోహన్‌లాల్‌పై ఉన్న ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఈ ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మోహన్‌లాల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉన్న క్రిమినల్ విచారణను ఎత్తివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement