ఒడిశాలో వరదల బీభత్సం.. 13 మంది మృతి | Odisha floods death toll rises to 13 schools shut across districts | Sakshi
Sakshi News home page

ఒడిశాలో వరదల బీభత్సం.. 13 మంది మృతి

Aug 18 2026 3:06 PM | Updated on Aug 18 2026 3:48 PM

Odisha floods death toll rises to 13 schools shut across districts

భువనేశ్వర్‌: ఒడిశాలో వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా తాజాగా  మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ వరదల  కారణంగా మృతిచెందిన వారి సంఖ్య  13కు చేరింది. భారీ వర్షాలు, ఉప్పొంగుతున్న వరద నీటితో రాష్ట్రంలోని బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కియోంఝర్, మయూర్‌భంజ్, కేంద్రాపడా జిల్లాల్లో జనజీవనం పూర్తిగా  దెబ్బతింది.

రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్‌ (ఎస్‌ఆర్‌సీ) కార్యాలయం తాజా నివేదిక ప్రకారం.. ఈ ఆరు జిల్లాల్లోని 1,300 గ్రామాలకు చెందిన 7.85 లక్షల మందికి పైగా వరదల ప్రభావం తాకింది. ఇప్పటివరకు 2.77 లక్షల మందిని ప్రమాదకర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజాగా నమోదైన ఐదు మరణాల్లో మూడు గోడలు కూలిపోవడంతో సంభవించగా, మరో రెండు నీటిలో మునిగిపోవడంతో చోటుచేసుకున్నాయి.

మరోవైపు పరిస్థితులు విషమించడంతో భద్రక్, సుందర్‌గఢ్, జాజ్‌పూర్ జిల్లాల్లో మంగళవారం పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేశారు. భద్రక్‌లో వరద ప్రభావిత ఆరు బ్లాకుల్లోని 268 పాఠశాలలు, 567 అంగన్‌వాడీ కేంద్రాలను ఒకరోజు మూసివేయాలని ఆదేశించారు. రోడ్లు నీటమునగడం, ప్రతికూల వాతావరణం కారణంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు.

సుందర్‌గఢ్‌లో భారీ వర్షాల సూచన,వరద పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేశారు. జాజ్‌పూర్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఒడిశా ఆదర్శ విద్యాలయాల పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. తల్లిదండ్రులు పిల్లలను ఇళ్లలోనే ఉంచాలని, నీటితో నిండిన ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

కేంద్రాపడా కలెక్టర్ రఘురామ్ ఆర్. అయ్యర్ మాట్లాడుతూ.. విద్యార్థులను భద్రత దృష్ట్యా పాఠశాల భవనంలోని మొదటి, రెండో అంతస్తులకు తరలించినట్లు తెలిపారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో వారిని వెంటనే బయటకు తరలించడం కష్టంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 2.77 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement