‘ఏఐ’తో ‘ఆట’లొద్దు | 65 percent of Indians use AI tools | Sakshi
Sakshi News home page

‘ఏఐ’తో ‘ఆట’లొద్దు

Jul 2 2026 5:51 AM | Updated on Jul 2 2026 5:51 AM

65 percent of Indians use AI tools

మనుషులకంటే ఏఐ బాగా అర్ధం చేసుకుంటుందనుకుంటున్న జనం

ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్న 65 శాతం మంది భారతీయులు

ఇది ప్రపంచ సగటు 31 శాతంతో పోలిస్తే రెండింతలకు పైగా ఎక్కువ

చిన్నారుల్లో భారీగా పెరుగుతున్న ఏఐ వినియోగం

పిల్లల్లో స్వయంగా ఆలోచించే శక్తి తగ్గిపోయే ప్రమాదం

ఆందోళన కలిగిస్తున్న ‘భారత్‌ సర్వే ఫర్‌ ఎడ్‌టెక్‌–2025’ గణాంకాలు

సాక్షి, అమరావతి: కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రపంచవ్యాప్తంగా విద్య, ఆరోగ్యం, సమాచార రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. మన దేశంలోనూ ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్‌ గ్లోబల్‌ ఆన్‌లైన్‌ సేఫ్టీ సర్వే–2024 ప్రకారం భారతీయుల్లో 65 శాతం మంది జనరేటివ్‌ ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచ సగటు 31 శాతంతో పోలిస్తే రెండింతలకంటే ఎక్కవ. విద్యార్థులకు పాఠాలు అర్థం చేసుకోవడం, సందేహాల నివృత్తి, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఏఐ ఉపయోగపడుతోంది. అదే సమయంలో పిల్లల మానసిక ఆరోగ్యం, ఆలోచనా శక్తి, సృజనాత్మకత, గోప్యత వంటి అంశాలపై ప్రతికూల ప్రభావాలు చూపుతోంది. 

సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ‘భారత్‌ సర్వే ఫర్‌ ఎడ్‌టెక్‌ 2025’ అధ్యయనం తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, ముగ్గురిలో ఒకరు వారి వ్యక్తిగత సమస్యలు, భావోద్వేగాలను ఏఐతో పంచుకుంటున్నారు. ఏఐతో వ్యక్తిగత విషయాలు చర్చించిన వారిలో 25 శాతం మంది ‘మనుషుల కంటే ఏఐ నన్ను బాగా అర్థం చేసుకుంటుంది’ అని భావిస్తున్నారు.

ఆలోచనా శక్తిపై ప్రభావం
ఇదే సర్వేలో మరో ఆందోళనకర అంశం బయటపడింది. ఏఐ గురించి తెలిసిన పిల్లల్లో 75 శాతం మంది ఏఐ పనితీరుపై అవగాహన లేక దాన్నొక సెర్చ్‌ ఇంజిన్‌లా భావిస్తున్నారు. అలాగే 46 శాతం కుటుంబాలు ఏఐ వల్ల తప్పుడు సమాచారం (మిస్‌ఇన్‌ఫర్మేషన్‌) వచ్చే ప్రధాన ప్రమాదమని పేర్కొన్నాయి. ఏఐ వెంటనే సమాధానాలు అందించడం వల్ల పిల్లలు స్వయంగా ఆలోచించడం, సమస్యలను విశ్లేషించడం, పరిష్కారాలు కనుగొనడం వంటి నైపుణ్యాలను కోల్పోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. హోంవర్క్, ప్రాజెక్టులు, వ్యాసాలు అన్నింటికీ ఏఐపై ఆధారపడితే సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం దెబ్బతినే అవకాశం ఉంది. యునిసెఫ్‌ నివేదికల ప్రకారం.. ఏఐ చాట్‌బాట్లతో ఎక్కువ సమయం గడిపే పిల్లల్లో ఒంటరితనం, భావోద్వేగ సంబంధాలు, సామాజిక సంబంధాలు తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.

‘ఏఐ’ రూపంలో కొత్త ముప్పు
ఏఐ అందించే సమాచారం ఎల్లప్పుడూ సరైనదే కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాస్తవాలకు విరుద్ధమైన లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని కూడా అందించవచ్చు. చిన్నారులు దానిని నిజమని నమ్మే ప్రమాదం ఉంది. అలాగే వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, చాటింగ్‌ డేటా వంటి సమాచారాన్ని ఏఐ ప్లాట్‌ఫారమ్‌లలో పంచుకోవడం వల్ల గోప్యత సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీతో డీప్‌ఫేక్‌ చిత్రాలు, వీడియోలు సృష్టించడం సులభమవుతోంది. అమెరికాలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 33 శాతం మంది టీనేజర్లు వారి అనుమతి లేకుండా వారి  ఫొటోలను ఉపయోగించి డీప్‌ఫేక్‌ చిత్రాలు రూపొందించారని తెలిపారు. 

అలాగే 54 శాతం మంది ఇలాంటి కంటెంట్‌ను అందుకున్నట్లు చెప్పారు. యూకేలో 8 నుంచి 12 సంవత్సరాల పిల్లల్లో దాదాపు 22 శాతం మంది ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. 40 శాతం కంటే ఎక్కువ మంది పిల్లలకు ఏఐ భద్రత గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ వివరించలేదు. ఏఐ వాడే పిల్లల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది ఆరోగ్యం లేదా శరీరానికి సంబంధించిన సలహాల కోసం చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నారు. ఆరుగురిలో ఒకరు (సుమారు 17 శాతం) ఏఐ ద్వారా అనుచిత కంటెంట్‌ చూశామని తెలిపారు.

ఈ నేపధ్యంలో పిల్లల విద్య, మానసిక అభివృద్ధిపై ప్రభావం ఉంటుందనే ఆందోళనతో కొన్ని దేశాలు పాఠశాలల్లో ఏఐ వినియోగంపై నియంత్రణ విధించాలని భావిస్తున్నాయి. కానీ ఏఐను పూర్తిగా నిరోధించడం సాధ్యం కాదు. పిల్లలు దానిపై పూర్తిగా ఆధారపడకుండా, ఇతర మంచి విషయాలవైపు మళ్లేలా వారికి మార్గనిర్దేశం చేయాలి. అలాగే తప్పుడు సమాచారం, గోప్యత, డీప్‌ఫేక్‌ ముప్పుల గురించి అవగాహన కల్పించడం అవసరం. ఏఐ టెక్నాలజీ భవిష్యత్తును మార్చగల శక్తివంతమైన సాధనం. అయితే నియంత్రణ లేకుండా వినియోగిస్తే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

భారత్‌ సర్వే ఫర్‌ ఎడ్‌టెక్‌–2025 అధ్యయనం ప్రకారం ఏఐ వినియోగం ఇలా..
జనరేటివ్‌ ఏఐ టూల్స్‌ వినియోగిస్తున్న విద్యార్థులు – 35 శాతం
వీరిలో సందేహాల నివృత్తికి – 73 శాతం
కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి – 48 శాతం
పరీక్షల సన్నద్ధతకు – 32 శాతం

అమెరికాలో కామన్‌సెన్స్‌ మీడియా 2026 అధ్యయనం ప్రకారం..
9 నుంచి 17 సంవత్సరాల పిల్లల్లో ఏఐ వినియోగిస్తున్న వారు – 86 శాతం 
వీరిలో నిత్యం ఏఐతో మమేకమయ్యే వారు – 25 శాతం
ఏఐ కంపానియన్‌ చాట్‌బాట్ల ఉపయోగించే టీనేజర్లు – 72 శాతం
రోజూ వాటితో మాట్లాడేవారు – 13 శాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement