కోఠి దోపిడీ యూపీ గ్యాంగ్‌ పనే! | Robbery in Koti: Telangana | Sakshi
Sakshi News home page

కోఠి దోపిడీ యూపీ గ్యాంగ్‌ పనే!

Feb 3 2026 1:30 AM | Updated on Feb 3 2026 1:30 AM

Robbery in Koti: Telangana

నిందితులు పాత నేరగాళ్లుగా గుర్తింపు 

టవర్‌ డంప్‌ విశ్లేషణలో దొరికిన లీడ్‌ 

బయలుదేరి వెళ్లిన ప్రత్యేక బృందం 

షెల్టర్‌ తీసుకున్నది షహీన్‌నగర్‌లో..

సాక్షి, హైదరాబాద్‌: కోఠి బ్యాంక్‌ స్ట్రీట్‌లోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఉదయం చోటు చేసుకున్న దోపిడీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌గా, వాళ్లు పోలీసుల దృష్టి మళ్లించి కాచిగూడ నుంచే పరారైనట్లు గుర్తించారు. నగరంలో వీరు ప్రయాణించిన మార్గా ల్లోని సెల్‌ టవర్ల నుంచి సేకరించిన సెల్‌ఫోన్‌ నంబర్ల డంప్‌లో దొరికిన రెండు నంబర్ల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. వీరిని పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లకు బయలుదేరి వెళ్లాయి. ఏటీఎం కేంద్రంలో రిన్షాద్‌పై కాల్పులు జరిపి, రూ.6 లక్షలు దోచుకున్న ఈ ద్వయం ఏమాత్రం భయం లేనట్లు వ్యవహరించారు.

ఏ దశలోనూ తమ ముఖాలు దాచుకోవడానికి మాస్క్ లు వాడడం, సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా వెళ్లడం వంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రధాన రహదారిని వదిలి గల్లీలను వినియోగించారు. యూపీ నుంచి వచ్చిన ఈ ద్వయం పహాడీషరీఫ్‌ సమీపంలోని షహీన్‌నగర్‌లో తలదాచుకుందని అధికారులు గుర్తించారు. అక్కడ నుంచే బయలుదేరి, ఆటోలో వచ్చి, కోఠిలో నేరం చేసిన వీరు బాధితుడి ద్విచక్ర వాహనంపై కాచిగూడ వెళ్లారు. అక్కడ నుంచి ఆటోల్లో షహీన్‌నగర్‌కు వెళ్లారు. అక్కడ కాసే పు ఉండి...మళ్లీ కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకొని ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు.

దాదాపు 880 సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేసిన ప్రత్యేక బృందాలు ఈ అంశాలు నిర్ధారించాయి. మరోపక్క షహీన్‌నగర్‌ ప్రాంతంలో ఢిల్లీ, యూపీలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉండటంతో నిందితులకు తేలిగ్గా షెల్టర్‌ దొరికిందని భావిస్తున్నారు. ఏ ఇంట్లో బస చేశారన్నది గుర్తించడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. నగరం మొత్తం ఆటోల్లో ప్రయాణించిన వీరు ఎక్కడా ఆటో బుకింగ్, నగదు చెల్లింపు కోసం యాప్స్‌ వాడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

నేరగాళ్లు తిరిగిన మార్గాల్లోని సెల్‌ టవర్‌ కేంద్రంగా ఆయా సమయాల్లో పని చేసిన ఫోన్‌ నంబర్ల వివరాలను పోలీసులు సేకరించారు. షహీన్‌నగర్‌–కోఠి–కాచిగూడ–షహీన్‌నగర్‌–కాచిగూడ మార్గాల్లోని టవర్లలో ఒకే సమయంలో పని చేసిన కామన్‌ నంబర్లను గుర్తించారు. ఇలా నిందితులు వినియోగించిన రెండు సెల్‌ఫోన్‌ నెంబర్లు అధికారులకు తెలిశాయి. వీటి ఆధారంగా విశ్లేషించిన టాస్క్‌ఫోర్స్‌ నిందితులు పాత నేరగాళ్లని, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని తేల్చినట్లు సమాచారం.  

Advertisement
 
Advertisement
Advertisement