అలికాంటె (స్పెయిన్): బాక్సమ్ ఎలైట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ లవ్లీనా బొర్గోహైన్ శుభారంభం చేసింది. 75 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఈ అస్సాం బాక్సర్ తొలి రౌండ్‌లో 5:0తో ఒల్హా పిల్పిచుక్ (ఉక్రెయిన్)పై ఘనవిజయం సాధించింది. పురుషుల 70 కేజీల విభాగంలో హితేశ్ ముందంజ వేశాడు. హితేశ్ 5:0తో విన్సెంట్ సాంటోరీలో (కెనడా)పై గెలిచాడు.
భారత్‌కే చెందిన మహిళా బాక్సర్లు మంజు రాణి (48 కేజీలు), నీతూ (51 కేజీలు) కూడా తమ ప్రత్యర్థులపై నెగ్గారు. మంజు రాణి 5:0తో గ్లోరియా (ఫ్రాన్స్)పై గెలుపొందగా... నీతూ పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి లౌరా కాల్డెరాన్ (స్పెయిన్) తొలి రౌండ్‌లోనే చేతులెత్తేసింది. కుసుమ్ (51 కేజీలు), అరుంధతి చౌధరీ (70 కేజీలు) కూడా గెలుపు రుచి చూశారు. కుసుమ్ 4:1తో క్లౌడియా అల్‌కానిజ్ (స్పెయిన్)పై, అరుంధతి 5:0తో అజీజా ఇసీనా (కజకిస్తాన)పై విజయం సాధించారు.
విక్టోరియా పెన్నీ (కెనడా)తో జరిగిన 75 కేజీల విభాగం బౌట్‌లో సనమచ చాను (భారత్) 4:1తో నెగ్గింది. పురుషుల 55 కేజీల విభాగం బౌట్‌లో పవన్ బర్త్‌వాల్ పంచ్‌లకు తాళలేక అతని ప్రత్యర్థి థనారత్ (థాయ్‌లాండ్) రెండో రౌండ్‌లోనే ఓటమిని అంగీకరించాడు. జాదుమణి సింగ్ (51 కేజీలు) 4:1తో సియోవుష్ (ఉక్రెయిన్)పై, దీపక్ (70 కేజీలు) 5:0తో డేవిడ్ రొసాలెన్ (స్పెయిన్)పై, అంకుశ్ (80 కేజీలు) 3:2తో జఖ్‌పెకోవ్ (కజకిస్తాన్)పై నెగ్గారు. హర్‡్ష (90 కేజీలు) 5:0తో బ్రయాన్ కాల్‌వెల్ (కెనడా)ను ఓడించి ముందంజ వేశాడు.


