
భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్‌తో బాక్సింగ్ సమాఖ్య ఈడీ దురుసు ప్రవర్తన
క్రీడా మంత్రికి ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన ‘సాయ్’
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో దేశప్రతిష్టను ఇనుమడింప చేసిన స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్‌కు ఓ క్రీడా సమాఖ్య డైరెక్టర్ నుంచి వివక్ష ఎదురైంది. దీన్ని ఏమాత్రం సహించని ఆమె ఫిర్యాదు చేయడంతో భారత ఒలింపిక్ సంఘం, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) విచారణ చేపట్టాయి. గత నెలలో జూమ్ మీటింగ్ (ఆన్‌లైన్) జరిగింది. ఇందులో బాక్సర్ల లవ్లీనాతో పాటు భారత బాక్సింగ్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్నల్ అరుణ్ మలిక్, పలువురు ‘సాయ్’, టాప్స్ అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ ఆన్‌లైన్ మీటింగ్‌లో లవ్లీనా తన వ్యక్తిగత కోచ్‌ను కూడా శిబిరాలకు తనతో పాటు అనుమతించాలని కోరింది. దీనిపై అరుణ్ మలిక్ వివక్షాపూరిత ధోరణితో వ్యవహరించాడని లవ్లీనా వాపోయింది. ‘ఆయన చాలా కోపంగా మాట్లాడారు. నోర్ముయ్. తలదించుకొని మేం చెప్పింది చెయ్ అంతే అని తీవ్రస్థాయిలో స్పందించడం నన్ను లింగ వివక్షకు గురి చేసింది. దీంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను. ఏం మాట్లాడాలో కూడా పాలుపోలేదు. కొన్ని క్షణాలపాటు షాక్‌లోనే కూరుకుపోయాను. ఆయన పురుషాధిక్య ధోరణితో మహిళనైనా నన్ను తక్కువ చేసి మాట్లాడారు.
ఇది నన్ను అవమానించడం కాదు. మహిళా అథ్లెట్ల పట్టుదలని అవమానించడమే’ అని లవ్లీనా... క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ఫిర్యాదు చేయడంతో ఐఓఏ, సాయ్ విచారణ చేపట్టాయి. 2 వారాల్లోనే దర్యాప్తు నివేదికను సమర్పించాల్సి ఉంది. మరోవైపు అరుణ్ లలిక్ మాట్లాడుతూ లవ్లీనా అరోపణలు అసత్యమని అన్నారు. భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) నిబంధనల ప్రకారమే వ్యవహరించానని చెప్పారు. జాతీయ శిబిరాల్లో వ్యక్తిగత కోచ్‌లకు అనుమతించడం కుదరదని సున్నితంగానే చెప్పానని ఆయన వివరణ ఇచ్చారు.