నేటి నుంచి ‘పంచ్‌’ పండుగ | National Senior Womens Boxing Tournament to be held in Hyderabad | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘పంచ్‌’ పండుగ

Jun 27 2025 4:13 AM | Updated on Jun 27 2025 4:13 AM

National Senior Womens Boxing Tournament to be held in Hyderabad

హైదరాబాద్‌ వేదికగా జాతీయ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ టోర్నీ

బరిలోకి నిఖత్‌ జరీన్, లవ్లీనా  

సాక్షి, హైదరాబాద్‌: టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌తో పాటు పలువురు అంతర్జాతీయ బాక్సర్లు మహిళల ఎలైట్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌ బరిలో దిగనున్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియం వేదికగా నేటి నుంచి ప్రారంభంకానున్న ఈ టోర్నీ జూలై 1న ముగియనుంది. 10 వెయిట్‌ కేటగిరీల్లో పోటీలు జరగనుండగా... 15 యూనిట్‌లకు చెందిన 100 మందికిపైగా బాక్సర్లు ఇందులో పాల్గొననున్నారు.  

తెలంగాణ బాక్సింగ్‌ సంఘం, భారత బాక్సింగ్‌ సమాఖ్య, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించనున్నాయి. ఆతిథ్య తెలంగాణతో పాటు రైల్వేస్, హరియాణా, ఆలిండియా పోలీస్, సర్వీసెస్, పంజాబ్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్, మహారాష్ట్ర, తమిళనాడు, సిక్కీం, భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) కంబైన్డ్‌ నేషనల్‌ ఎక్స్‌లెన్‌ సెంటర్‌ టీమ్, టాప్స్‌ కోర్, డెవలప్‌మెంట్‌ జట్లు బరిలోకి దిగుతాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత మనీషా, ఒలింపియన్‌ ప్రీతి, వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌ అరుంధతి చౌధరీ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. 

ఒక్కో విభాగంలో స్వర్ణ, రజతాలు సాధించిన బాక్సర్లు... పాటియాలాలో జరిగే ఎలైట్‌ జాతీయ శిబిరానికి ఎంపిక కానున్నారు. ‘భారత మహిళల బాక్సింగ్‌లోని పోటీతత్వానికి ఈ టోర్నమెంట్‌ నిదర్శనం కానుంది. అనుభవజు్ఞలు, యువ బాక్సర్ల మిళితమైన ఈ టోర్నమెంట్‌ ద్వారా కొత్తగా బాక్సింగ్‌లో అడుగుపెట్టిన వాళ్లు అనుభవం గడిస్తారు. మెరుగైన ప్రదర్శన కనబర్చిన వాళ్లను జాతీయ శిబిరానికి ఎంపిక చేస్తాం. కొత్త ప్రతిభను వెలికి తీసేందుకు ఇది ఉపయోగపడనుంది. 

భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇది ఉపకరిస్తుంది’ అని భారత బాక్సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఒక్కో జట్టు నుంచి 10 మంది బాక్సర్లు బరిలోకి దిగనున్నారు. ప్రపంచ బాక్సింగ్‌ నిబంధనల ప్రకారం నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌ ఒక్క బౌట్‌లో మూడు రౌండ్‌లు ఉంటాయి. ఒక్కో రౌండ్‌ వ్యవధి 3 నిమిషాలు కాగా... రౌండ్‌ల మధ్యలో ఒక్కో నిమిషం విరామం ఉటుంది.  

Advertisement
 
Advertisement
Advertisement