
నేటి నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్
నిఖత్, లవ్లీనాలపై దృష్టి
సెప్టెంబర్ 14 వరకు పోటీలు
లివర్‌పూల్: రెండేళ్ల క్రితం జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో భారత బాక్సర్లు మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటారు. మహిళల విభాగంలో మన బాక్సర్లకు నాలుగు స్వర్ణాలు దక్కగా, పురుషుల విభాగంలో మూడు కాంస్యాలు లభించాయి. అయితే ఆ తర్వాత మన బాక్సర్ల ప్రభ తగ్గింది. అటు ఆసియా క్రీడల్లో, ఇటు పారిస్ ఒలింపిక్స్‌లో కూడా పేలవ ప్రదర్శనతో మన ప్లేయర్లు విఫలమయ్యారు.
ఈ ఏడాది వరల్డ్ కప్‌లలో ఫర్వాలేదనిపించినా... దీంతో పోలిస్తే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పోటీ చాలా ఎక్కువ. 65 దేశాలకు చెందిన 550 మంది బాక్సర్లు ఇందులో పాల్గొంటుండగా... పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన 17 మంది ఇక్కడ బరిలో నిలవడం విశేషం. ఈ నేపథ్యంలో రెండేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 14 వరకు పోటీలు జరుగుతాయి. భారత్ నుంచి పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి 20 మంది బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు.
మూడో మెడల్‌పై నిఖత్ గురి...
తెలంగాణ ప్లేయర్ నిఖత్ జరీన్ మరోసారి ప్రపంచ వేదికపై తన సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. గతంలో రెండుసార్లు (2022, 2023)లలో ఆమె చాంపియన్‌గా నిలిచింది. అయితే ఈ రెండు సందర్భాల్లో ఆమె 52 కేజీలు, 50 కేజీల విభాగంలో బరిలోకి దిగింది. ఇప్పుడు ఈవెంట్ మారిన నిఖత్ 51 కేజీల కేటగిరీలో పోటీ పడనుంది. దాంతో ఆమె కొత్తగా సన్నద్ధం కావాల్సి వచ్చింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఇదే వయో విభాగంలో ఆడిన నిఖత్.. .రెండో రౌండ్‌లోనే ఓటమి పాలైంది. ఇప్పుడు కూడా ఆమె తగిన స్థాయిలో సాధన చేయలేకపోయింది.
పారిస్‌లో పరాజయం తర్వాత నిఖత్ ఒకే ఒక టోర్నీలో అది కూడా జాతీయ స్థాయిలోనే ఆడింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు సాధించిన లవ్లీనా బొర్గొహైన్ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. 75 కేజీల కేటగిరీలో తలపడనున్న లవ్లీనాకు కూడా సరైన ప్రాక్టీస్ లభించలేదు.
ఎక్కువ మంది కొత్తవారితో...
మహిళల బృందంతో పోలిస్తే పురుషుల విభాగంలో అనుభవజు్ఞలైన భారత బాక్సర్లు తక్కువ మంది ఉన్నారు. 2023లో జరిగిన గత ఈవెంట్‌లో పతకాలు సాధించిన నిశాంత్ దేవ్, దీపక్ భోరియా, హుసాముద్దీన్ వేర్వేరు కారణాలతో ఈసారి టోర్నీకి దూరమయ్యారు. సుమీత్ కుందు, 2021 వరల్డ్ యూత్ చాంపియన్ సచిన్ సివాచ్, హర్‡్ష చౌధరీలకు మాత్రమే గతంలో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న అనుభవం ఉంది.
మిగతా యువ బాక్సర్లంతా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు దీనికి సరైన వేదికగా వాడుకోనున్నారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న బాక్సర్లందరికీ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 1 వరకు షెఫీల్డ్‌లో ప్రత్యేక శిక్షణా శిబిరం కూడా జరిగింది.
భారత జట్ల వివరాలు: పురుషుల విభాగం: జాదుమణీ సింగ్ (50 కేజీలు), పవన్ బర్త్‌వాల్ (55 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), అభినాశ్ జమ్వాల్ (65 కేజీలు), హితేశ్ గులియా (70 కేజీలు), సుమీత్ కుందు (75 కేజీలు), లక్ష్య చహర్ (80 కేజీలు), జుగ్నూ అహ్లావత్ (85 కేజీలు), హర్‡్ష చౌధరీ (90 కేజీలు), నరేందర్ బెర్వాల్ (ప్లస్ 90 కేజీలు).
మహిళల విభాగం: మీనాక్షి హుడా (48 కేజీలు), నిఖత్ జరీన్ (51 కేజీలు), సాక్షి (54 కేజీలు), జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), సంజు ఖత్రి (60 కేజీలు), నీరజ్ ఫొగాట్ (60 కేజీలు), సనమచ చాను (70 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు), పూజ రాణి (80 కేజీలు), నుపూర్ షెరాన్ (ప్లస్ 80 కేజీలు).