ప్రపంచకప్ బాక్సింగ్ ఫైనల్స్ టోర్నీ
న్యూఢిల్లీ: మాజీ ప్రపంచ చాంపియన్, భారత బాక్సర్ నిఖత్ జరీన్ దాదాపు రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ పతకాన్ని ఖాయం చేసుకుంది. వరల్డ్‌కప్ ఫైనల్స్ టోర్నీలో తెలంగాణకు చెందిన నిఖత్ 51 కేజీల విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. ఒక్కో వెయిట్ కేటగిరీలో ఎనిమిది మంది అత్యుత్తమ బాక్సర్లు తలపడుతున్న ఈ టోర్నీలో నిఖత్ వెయిట్ కేటగిరీలో ఐదుగురు బాక్సర్లు మాత్రమే బరిలోకి దిగారు.
నేరుగా సెమీఫైనల్ ఆడిన నిఖత్ 5–0తో జెనీవా గుల్‌సెవర్ (ఉజ్బెకిస్తాన్)ను చిత్తు చేసింది. భుజం గాయంతో దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమైన నిఖత్ కోలుకొని ఇప్పుడే బరిలోకి దిగింది. 2024 ఫిబ్రవరిలో స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో సాధించిన విజయం తర్వాత ఆమె గెలిచే తొలి పతకం ఇదే కానుంది. నేడు జరిగే ఫైనల్లో స్వర్ణ పతకం కోసం గో యి యువాన్ (చైనీస్ తైపీ)తో నిఖత్ తలపడుతుంది.
మరో సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ జైస్మీన్ (57 కేజీలు) 5–0తో ఉల్జాన్ సర్‌సెన్‌బెక్ (కజకిస్తాన్)పై గెలిచి ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో జాస్మిన్... పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత వు షి యి (చైనీస్ తైపీ)ని ఎదుర్కొంటుంది.
పురుషుల విభాగంలో భారత్‌కే చెందిన జాదూమణి సింగ్ (57 కేజీలు), పవన్ (55 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), హితేశ్ గులియా (70 కేజీలు) కూడా ఫైనల్లోకి అడుగు పెట్టారు. పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి నేడు వేర్వేరు కేటగిరీల్లో జరిగే ఫైనల్స్‌లో భారత్ నుంచి 15 మంది పోటీపడనున్నారు.


