రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్ నిఖత్ జరీన్.. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌కు సిద్దమవుతోంది. ఈ ఫైనల్లో అత్యధిక ర్యాంకింగ్ పాయింట్లను సాధించడంపై ఆమె దృష్టి సారించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నవంబర్ 14 నుండి 21 వరకు గ్రేటర్ నోయిడాలో జరగనుంది. ఫ్లైవెయిట్, లైట్ ఫ్లైవెయిట్ విభాగాల్లో నిఖత్ పోటీపడనుంది.
కాగా 2022 (ఇస్తాంబుల్), 2023 (న్యూఢిల్లీ)లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న నిఖత్.. ఈ ఏడాది లివర్‌పూల్‌లో జరిగిన ఈ మెగా టోర్నీ క్వార్టర్‌ఫైనల్స్‌లో టర్కీకి చెందిన రెండుసార్లు ఒలింపిక్ రజత పతక విజేత బుస్ నజ్ చకిరోగ్లు (Buse Naz Çakiroglu) చేతిలో ఓడిపోయింది. ఈసారి మాత్రం ఎటువంటి తప్పిదాలు చేయకూడదని హైదరబాద్‌కు జరీన్ భావిస్తోంది.
"లివర్‌పూల్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో ఓటమి నిరాశపరిచింది. అయితే ఒక సంవత్సరం విరామం తర్వాత తిరిగి వచ్చి భారత జట్టు తరపున రెండు బౌట్‌లు గెలిచి, రెండుసార్లు ఒలింపిక్ రజత పతక విజేతతో ఓడిపోయాను. ఆఖరి వరకు పోరాడి ఓడినందుకు గర్వంగా ఉంది. ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాను.
ఇప్పుడు భారత్ ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ ఫైనల్స్‌లో సత్తా చాటేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఈ టోర్నీ కోసం తీవ్రంగా శ్రమించాను. నాతో పాటు మిగితా బాక్సర్లు ఎక్కువగా కష్టపడుతున్నారు. లివర్‌పూల్‌లో కంటే ఇక్కడ మెరుగ్గా రాణిస్తామని ఆశిస్తున్నాను.
రాబోయో అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు గెలవడం మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఆసియా క్రీడలు (Asian Games), కామన్వెల్త్ క్రీడల్లో (Commonwealth Games) సీడింగ్‌లు పొందడానికి మాకు గరిష్ట ర్యాంకింగ్ పాయింట్లు అవసరమని" మంగళవారం విలేకరుల సమావేశంలో నిఖత్ పేర్కొంది.
కాగా వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో గోల్డ్ మెడల్ విజేతకు 300 పాయింట్లు, రజత పతకానికి 150 , కాంస్య పతకానికి 75 పాయింట్లు లభిస్తాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025 కోసం భారత జట్టును భారత బాక్సింగ్ సమాఖ్య (BFI) మంగళవారం ప్రకటిచింది.
పురుషులు
హితేష్ (70 కేజీలు), అభినాష్ జమ్వాల్ (65 కేజీలు), జదుమణి సింగ్ (50 కేజీలు), పవన్ బర్త్వాల్ (55 కేజీలు), సచిన్ (60 కేజీలు), సుమిత్ (75 కేజీలు), లక్ష్య చాహర్ (80 కేజీలు), జుగ్నూ (85 కేజీలు), నవీన్ కుమార్ (90 కేజీలు), నరేందర్ (90+ కేజీలు)
మహిళలు
నిఖత్ జరీన్ (51 కేజీలు), జైస్మిన్ లంబోరియా (57 కేజీలు), మినాక్షి (48 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), సావీటీ బూరా (75 కేజీలు), నుపుర్ షెరాన్ (80+ కేజీలు), ప్రీతి (54 కేజీలు), పర్వీన్ (60 కేజీలు), నీరజ్ ఫోగట్ (670 కేజీలు), అరుంధతిక్ (670 కేజీలు)


