
లివర్‌పూల్: తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటుతూ శుభారంభం చేసింది. మరో వైపు టోక్యో ఒలింపిక్స్ పతక విజేత లవ్లీనా బొర్గోహైన్‌కు తొలిరౌండ్‌లోనే చుక్కెదురైంది. పారిస్ ఒలింపిక్స్‌లో గాయంతో రెండో రౌండ్లోనే నిష్క్రమించిన నిఖత్ ఈ టోర్నీకి దీటుగా సిద్ధమైంది. శనివారం మహిళల 51 కేజీల విభాగంలో జరిగిన తొలి రౌండ్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఆమె అద్భుతమైన పంచ్ పవర్‌తో అమెరికా ప్రత్యర్థి జెన్నిఫర్ లొజానోను కంగుతినిపించింది.
ఈ తెలంగాణ స్టార్ 5–0తో జెన్నిఫర్‌పై తిరుగులేని విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. అయితే మహిళల 75 కేజీల కేటగిరీలో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన లవ్లీనా తొలి రౌండ్లోనే 0–5తో టర్కీకి చెందిన బుస్రా ఇసిల్దార్ చేతిలో కంగుతింది. పురుషుల ఈవెంట్‌లోనూ భారత్‌కు శనివారం కలిసిరాలేదు. రెండు సార్లు ప్రపంచకప్ పతకాలు సాధించిన హితేశ్ గులియా 70 కేజీల కేటగిరీలో రెండో రౌండ్లోనే ఇంటి దారి పట్టాడు.
మూడో సీడ్‌గా బరిలోకి దిగిన భారత బాక్సర్ 1–4తో బాస్ ఫిన్ రాబర్ట్ చేతిలో ఓడాడు. హితేశ్‌కు తొలిరౌండ్లో బై లభించగా.. రెండో రౌండ్లో తలపడిన భారత ఆటగాడికి డచ్ బాక్సర్ చేతిలో చుక్కెదురైంది. పురుషుల 90 ప్లస్ కేజీల తొలిరౌండ్లో నరేందర్ బెర్వాల్ 4–1తో ఐర్లాండ్ బాక్సర్ మారి్టన్ క్రిస్టోఫర్‌పై విజయం సాధించాడు.