
లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్, రెండుసార్లు విశ్వవిజేత నిఖత్ జరీన్ మూడో పతకానికి విజయం దూరంలో నిలిచింది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5:0తో జపాన్‌కు చెందిన యునా నిషినాకాపై విజయం సాధించింది.
29 ఏళ్ల నిఖత్ 2022, 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకాలు గెలిచింది. మరోవైపు 48 కేజీల విభాగంలో మీనాక్షి హుడా కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించి పతకానికి గెలుపు దూరంలో నిలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో మీనాక్షి 5:0తో వాంగ్ కియుపింగ్ (చైనా)పై గెలుపొందింది. పురుషుల విభాగంలో భారత బాక్సర్లు సుమిత్ కుందు (75 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), నరేందర్ (ప్లస్ 90 కేజీలు), లక్ష్య చహర్ (80 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు.
సుమిత్ 0:5తో రామి కివాన్ (బల్గేరియా) చేతిలో, సచిన్ 1:4తో బిబార్స్ జెక్సన్ (కజకిస్తాన్) చేతిలో, నరేందర్ 1:4తో డీగో లెంజీ (ఇటలీ) చేతిలో, లక్ష్య చహర్ 0:3తో సీజర్ యోజెర్లిన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. పురుషుల విభాగంలో భారత్ నుంచి ప్రస్తుతం ఇద్దరు బాక్సర్లు మాత్రమే బరిలో మిగిలారు