
రేపటి నుంచి (అక్టోబర్ 10) వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌లో భారత తుది జట్టు ఇదే అంటూ అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే హింట్ ఇచ్చాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఎలాంటి మార్పులు ఉండవని సంకేతాలిచ్చాడు. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే ఉద్దేశం లేదని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపాడు.
సుదూర అవసరాల దృష్ట్యా నితీశ్ కుమార్ రెడ్డికి మరిన్ని అవకాశాలుంటాయని చెప్పకనే చెప్పాడు. నితీశ్‌ను నాణ్యమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపాడు.
తొలి టెస్ట్‌లో విఫలమైనా సాయి సుదర్శన్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని అన్నాడు. పరుగులు సాధించలేకపోతే జట్టులో ఎవరి స్థానం సుస్థిరం కాదని గుర్తు చేశాడు. ఈ సందర్భంగా కరుణ్ నాయర్ పేరును ప్రస్తావించాడు.
తొలి టెస్ట్‌లో జురెల్ సెంచరీ సాధించడం వల్ల సాయిపై ఒత్తిడి ఉంటుందంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సందర్భంగా జురెల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్ గైర్హాజరీలో ఆ స్థానానికి న్యాయం చేశాడని అన్నాడు. జురెల్ మిడిలార్డర్‌లో సరిగ్గా ఫిట్ అవుతాడని ముందే ఊహించామని తెలిపాడు.
డస్కటే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. రెండో టెస్ట్‌లో కూడా పడిక్కల్, అక్షర్ పటేల్, జగదీసన్, ప్రసిద్ద్ కృష్ణ బెంచ్‌కు పరిమితం కావల్సిందే.
కాగా, అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగి సత్ఫలితం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించి విండీస్‌ను మట్టికరిపించారు.
రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి సిరాజ్ 7 వికెట్లు తీయగా.. బుమ్రా 3, కుల్దీప్, జడేజా తలో 4, సుందర్ 2 వికెట్లు పడగొట్టారు. ఒకే ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్ చేయగా.. కేఎల్ రాహుల్, జురెల్, రవీంద్ర జడేజా శతకాలు బాదారు.
విండీస్‌తో రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. తొలి బౌలర్