
భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) గురించి టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే (Ryan ten Doeschate) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పనిభారం గురించి అతడు అస్సలు ఆలోచించడని.. తామే ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. సిరాజ్ సింహం లాంటివాడని.. జట్టు ప్రయోజనాల కోసం ఎల్లవేళలా బంతితో సిద్ధంగా ఉంటాడంటూ ప్రశంసించాడు.
నాలుగో టెస్టు గెలిస్తేనే..
ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ-2025 (Anderson- Tendulkar Trophy) ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఐదింటిలో ఇప్పటికి మూడు టెస్టులు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు గిల్ సేనపై 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలు సజీవంగా ఉంటాయి.
బుమ్రా ఆడేది మూడే
అయితే, ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండడని టీమిండియా యాజమాన్యం ముందే చెప్పింది. అతడు కేవలం మూడు టెస్టులే ఆడతాడని స్పష్టం చేసింది. ఈ క్రమంలో లీడ్స్‌లో ఆడిన బుమ్రా.. ఎడ్జ్‌బాస్టన్‌లో విశ్రాంతి తీసుకుని.. లార్డ్స్‌లో మళ్లీ ఆడాడు.
ఇక బుమ్రా గైర్హాజరీలో పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్న మరో సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ మెరుగ్గా రాణిస్తున్నాడు. మూడు టెస్టుల్లోనూ ఆడిన అతడు.. మొత్తంగా 13 (2, 6, 1, 2, 2) వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఎడ్జ్‌బాస్టన్‌లో ఆరు వికెట్లతో చెలరేగి భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
సిరాజ్ సింహం లాంటోడు
ఈ నేపథ్యంలో డస్కటే సిరాజ్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘అలాంటి ఆటగాడు మా జట్టులో ఉండటం మాకు సానుకూలాంశం. ఇక్కడ ఫాస్ట్‌బౌలర్‌గా అతడి నుంచి మనం అందరికంటే కాస్త ఎక్కువగానే వికెట్లు తీస్తాడని ఆశిస్తాం.
అయితే, తను పనిభారం గురించి మాత్రం అస్సలు పట్టించుకోడు. అందుకే మేమే అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. సింహం లాంటి పోరాటపటిమ అతడి సొంతం.
మేమే అతడిని వారిస్తాం
లార్డ్స్‌లో స్టోక్స్ మాదిరి అదనపు ఓవర్లు వేసేందుకు సిరాజ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ అతడు ఫిట్‌గా ఉండేలా చూసుకోవడం మా పని. అందుకే ఒక్కోసారి మేనేజ్‌మెంట్ అతడిని వారించాల్సి వస్తుంది కూడా. ఏదేమైనా అతడి చేతిలో బంతి ఉందంటే కచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేస్తాడనే నమ్మకం ఉంటుంది’’ అంటూ ఆట పట్ల సిరాజ్ అంకితభావం గురించి డస్కటే వివరించాడు.
కాగా 2023 నుంచి టీమిండియా ఆడిన 27 టెస్టులలో సిరాజ్ 24 మ్యాచ్‌లు ఆడాడు. టీమిండియా ఫాస్ట్‌బౌలర్లలో ఒక్కరు కూడా ఇలా వరుస మ్యాచ్‌లు ఆడలేదు. ఇక 2023 నుంచి ఇప్పటిదాకా అతడు 569.4 ఓవర్లు బౌల్ చేశాడు.
ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (721.2 ఓవర్లు), పేసర్ మిచెల్ స్టార్క్ (665.1) తర్వాత ఈ స్థాయిలో అలుపెరగకుండా బౌలింగ్ చేసిన ఏకైక భారత ఫాస్ట్‌బౌలర్ సిరాజ్. ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ వేదికగా జూలై 23-27 మధ్య భారత్- ఇంగ్లండ్ నాలుగో టెస్టు జరుగనుంది.