
స్మృతి మంధాన- ప్రతీకా రావల్ (PC: BCCI)
భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన (Smriti Mandhana)- ప్రతీకా రావల్ (Pratika Rawal) సరికొత్త చరిత్ర సృష్టించారు. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ సగటుతో వెయ్యి పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఓపెనింగ్ జోడీగా నిలిచారు. ఇంత వరకు ఏ జంటకు సాధ్యం కాని విధంగా 84.66 సగటుతో 1000 రన్స్ రాబట్టిన జోడీగా ప్రపంచ రికార్డు సాధించారు.
భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ (IND vs ENG ODI's)లు ఆడుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన హర్మన్ సేన.. తాజాగా వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది.
తొలి వన్డేలో భారత్ విజయం
సౌతాంప్టన్ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ మహిళా జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. 1-0తో ముందంజ వేసింది. ది రోజ్ బౌల్ మైదానంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో సోఫియా డంక్లీ (83), అలిస్ డేవిడ్‌సన్ రిచర్డ్స్ (53) అర్ధ శతకాలతో రాణించగా.. ఎమ్మా లాంబ్ (39), కెప్టెన్ నాట్ సీవర్- బ్రంట్ (41) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా రెండేసి వికెట్లు కూల్చగా.. అమన్‌జోత్ కౌర్, శ్రీ చరణి ఒక్కో వికెట్ పడగొట్టారు.
దీప్తి శర్మ అజేయ అర్ధ శతకం
ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 48.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. 262 పరుగులు సాధించి జయభేరి మోగించింది. ఓపెనర్లు ప్రతికా రావల్ (36), స్మృతి మంధాన (28) ఓ మోస్తరుగా రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్ (48) ఆకట్టుకుంది. ఇక ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అజేయ అర్ధ శతకం (62)తో చెలరేగి జట్టును విజయతీరాలకు చేర్చింది.
మంధాన- రావల్ సరికొత్త చరిత్ర
ఇదిలా ఉంటే.. గతేడాది నుంచి స్మృతి మంధాన- ప్రతీకా రావల్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరు కలిసి ఇప్పటికి నాలుగుసార్లు శతక, ఐదుసార్లు అర్ధ శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఇందులో వీరి హయ్యస్ట్ పార్ట్‌నర్‌షిప్ 233.
తాజాగా ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మంధాన- రావల్ జోడీ.. వన్డే క్రికెట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే అత్యుత్తమ సగటుతో ఈ మైలురాయిని చేరుకున్న ఓపెనింగ్ జోడీగా వరల్డ్ రికార్డు సాధించింది.
మహిళల వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ సగటుతో కనీసం వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనింగ్ జోడీలు ఇవే..
🏏స్మృతి మంధాన- ప్రతీకా రావల్ (ఇండియా): 84.66 సగటుతో 1016 పరుగులు
🏏కారోలిన్ అట్కిన్స్- సారా టేలర్ (ఇంగ్లండ్): 68.83 సగటుతో 1239 పరుగులు
🏏రేచల్ హెయిన్స్- అలీసా హేలీ (ఆస్ట్రేలియా): 63.41 సగటుతో 1839 పరుగులు.
చదవండి: Ravindra Jadeja: పోరాటయోధుడు.. అసలు సిసలు ఆల్‌రౌండర్‌కు ప్రతిరూపం