
అన్ని విభాగాల్లో నిలకడగా రాణిస్తున్న రవీంద్ర జడేజా
అసలు సిసలు ఆల్‌రౌండర్‌కు ప్రతిరూపం
ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వరుసగా నాలుగు హాఫ్‌సెంచరీలు
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ మెరుపులు
రెప్ప పాటులో దూసుకొచ్చే బంతులను ఒడిసి పట్టాలంటే అతడు ఉండాలి...పాయింట్, కవర్స్, మిడాన్, మిడాఫ్ ఇలా ఎక్కడైనా నమ్మశక్యం కాని క్యాచ్‌లు అందుకోవాలంటే అతడు కావాలి...అవుట్‌ఫీల్డ్ నుంచి నేరుగా వికెట్లను గురిచూసి గిరాటేయాలంటే బంతి అతడికి చేతికి చిక్కాలి!
పిచ్ నుంచి కాస్త సహకారం లభిస్తుందంటే చాలు ప్రత్యర్థిని చుట్టేయడానికి అతడు కావాలి...ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకున్నారంటే భాగస్వామ్యాన్ని విడదీయడానికి అతడు రావాలి...స్లో ఓవర్‌రేట్ బారిన పడకుండా చకచకా ఓవర్లు ముగించాలంటే అతడికి బౌలింగ్ ఇవ్వాలి!!
టాపార్డర్ బ్యాటర్లకు సరైన సహకారం లభించాలంటే నాన్‌స్ట్రయికర్‌గా అతడు ఉండాలి...లోయర్ ఆర్డర్‌ను కాచుకుంటూ విలువైన పరుగులు చేయాలంటే క్రీజులో అతడు ఉండాలి...గడ్డు పరిస్థితుల్లో జట్టును గట్టెక్కించాలంటే అతడు బ్యాట్‌తో ‘కత్తిసాము’ చేయాలి!!
ఇలా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో అతి ముఖ్యమైన ఆ అతడు మరెవరో కాదు... రవీంద్ర సింగ్ జడేజా. పుష్కర కాలానికి పైగా భారత టెస్టు జట్టులో కొనసాగుతున్న ఈ సౌరాష్ట్ర ఆల్‌రౌండర్ తాజాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తన విలువ చాటుకుంటున్నాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలతో మెరిసిన ‘జడ్డూ’... లార్డ్స్‌లో ఓటమి అంచున నిలిచిన జట్టును దాదాపు విజయానికి చేరువ చేశాడు. ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్ అనే విమర్శల నుంచి... పరిపూర్ణ ఆల్‌రౌండర్ అనిపించుకును స్థాయికి ఎదిగిన జడేజాపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడా విభాగం
ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ విజయానికి 193 పరుగులు అవసరం కాగా... 82 పరుగులకే టీమిండియా 7 వికెట్లు కోల్పోయింది. ఇంకేముంది మరో పది, ఇరవై పరుగుల వ్యవధిలో మిగిలిన మూడు వికెట్లు కూలడం ఖాయమే అనే ఊహగానాల మధ్య భారత జట్టు చివరకు 170 పరుగులు చేయగలిగింది. చివరి ముగ్గురు బ్యాటర్లు వీరోచిత పోరాటం చేసిన మాట వాస్తవమే అయినా... దానికి నాయకత్వం వహించింది మాత్రం ముమ్మాటికీ రవీంద్ర జడేజానే.
యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ ఇలా నమ్ముకున్న వాళ్లంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పడుతుంటే జడేజా మాత్రం మొక్కవోనిసంకల్పంతో బ్యాటింగ్ చేశాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో కట్టిపడేశాడు. మరో ఎండ్‌లో వికెట్ కాపాడుకోవడం కూడా ముఖ్యమైన తరుణంలో నితీశ్ కుమార్ రెడ్డి, బుమ్రా, సిరాజ్ అండతో జట్టును గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాడు.
ఈ క్రమంలో అతడు స్టోక్స్, ఆర్చర్, వోక్స్, కార్స్ వేసిన బౌన్సర్లకు ఎదురు నిలిచిన తీరు... పోరాట యోధుడిని తలపించింది. స్కోరు బోర్డు పరిశీలిస్తే జడేజా పేరిట అర్ధశతకం మాత్రమే కనిపిస్తుంది కానీ... లార్డ్స్‌లో అతడు చేసిన పోరాటం సెంచరీకి తీసిపోనిది. కఠిన క్షణాలు, పరీక్ష పెడుతున్న బంతులు, బ్యాటింగ్‌కు కష్టసాధ్యమైన పరిస్థితులు... వీటన్నిటితో పోరాడిన జడ్డూ క్రికెట్ ప్రేమికుల మనసు గెలుచుకున్నాడు.
వరుసగా నాలుగు ఫిఫ్టీలు...
11, 25 నాటౌట్, 89, 69 నాటౌట్, 72, 61 నాటౌట్... తాజా ఇంగ్లండ్ సిరీస్‌లో జడేజా గణాంకాలివి. తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తప్ప అతడు విఫలమైంది లేదు. లీడ్స్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ తరఫున జైస్వాల్, గిల్, రాహుల్ ఒక్కో సెంచరీ చేస్తే పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదాడు. దీంతో జడేజాకు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా... బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కెప్టెన్ గిల్ అనితరసాధ్యమైన బ్యాటింగ్ ప్రదర్శనకు సంపూర్ణ సహకారం అందించిన ఘనత జడేజాదే.
తొలి ఇన్నింగ్స్‌లో ఆరో వికెట్‌కు గిల్‌తో కలిసి 203 పరుగులు జోడించి జట్టుకు కొండంత స్కోరు అందించిన ‘జడ్డూ’... రెండో ఇన్నింగ్స్‌లోనూ సారథితో కలిసి ఐదో వికెట్‌కు 175 పరుగులు జతచేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కెపె్టన్‌కు అండగా నిలుస్తూ స్ట్రయిక్ రొటేట్ చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్ ఓ మాదిరిగా రాణించిన సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌తో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసిన అతడు... రెండో ఇన్నింగ్స్‌లో అసాధారణంగా పోరాడాడు. ఇంగ్లండ్ బౌలర్లంతా ఒకదశలో జడేజాను అవుట్ చేయడం సాధ్యం కాదని నిర్ణయించుకొని అవతలి ఎండ్‌లో వికెట్ పడగొట్టేందుకే ప్రయత్నించారంటే అతడు ఎంత పట్టుదలగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు.
వికెట్ విలువ గుర్తెరిగి...
గత ఏడాది భారత జట్టు టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆ ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు జడేజా కూడా వీడ్కోలు పలికాడు. తదనంతరం ఆ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించగా... ‘జడ్డూ’ మాత్రం కొనసాగుతున్నాడు. జైస్వాల్, గిల్, సుదర్శన్, సుందర్, నితీశ్ వంటి యువ ఆటగాళ్లతో కూడిన జట్టులో... రాహుల్, పంత్ కన్నా ఎక్కువ టెస్టులు ఆడిన అనుభవం ఉన్న జడేజా ఈ సిరీస్‌లో తన వికెట్ విలువ గుర్తెరిగి బ్యాటింగ్ చేస్తున్నాడు.
పరిస్థితులకు తగ్గట్లు తన బ్యాటింగ్‌ను మార్చుకుంటూ ప్రతి కెప్టెన్ తన జట్టులో ఇలాంటి ప్లేయర్ ఉండాలనుకునే విధంగా ఆడుతున్నాడు. గతంలో కేవలం తన బౌలింగ్, ఫీల్డింగ్‌తోనే జట్టులో చోటు దక్కించుకున్న ‘జడ్డూ’... ఇప్పుడు నమ్మదగ్గ బ్యాటర్‌గా ఎదిగాడు. ఒకప్పుడు ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్ అని విమర్శలు ఎదుర్కొన్న అతడు... వాటికి తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. భారత గడ్డపై మ్యాచ్‌ల్లో ఎక్కువ వికెట్లు తీసిన జడేజా... విదేశాల్లో బౌలింగ్‌తో అద్భుతాలు చేయలేకపోయినా... నిఖార్సైన బ్యాటర్‌గానూ జట్టులో చోటు నిలుపుకునే స్థాయికి ఎదిగాడు.
తాజా ఇంగ్లండ్ పర్యటనలో పేసర్లు వికెట్ల పండగ చేసుకుంటుండగా... ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లంచ్‌కు ముందు చివరి ఓవర్‌లో స్టోక్స్ అవుట్ కావడం వెనక ‘జడ్డూ’ కృషి ఉంది. అంతకుముందు ఓవర్ వేసిన అతడు కేవలం 90 సెకన్లలోనే ఆరు బంతులు వేయడంతో మరో అదనపు ఓవర్ వేసే అవకాశం దక్కగా... అందులో సుందర్ బౌలింగ్‌లో స్టోక్స్ పెవిలియన్ చేరాడు.
ఎప్పుడూ తెరవెనుకే!
జడేజా టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి చూసుకుంటే... అతడి కంటే ఐదుగురు బౌలర్లు మాత్రమే ఎక్కువ బంతులు వేశారు. 2018 తర్వాతి నుంచి అతడు 42.01 సగటుతో పరుగులు రాబట్టాడు. 83 టెస్టుల్లో జడ్డూ 4 సెంచరీలు, 26 అర్ధసెంచరీలతో 3697 పరుగులు చేయడంతో పాటు... 326 వికెట్లు పడగొట్టాడు. అందులో 15 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.
అయితే ఇందులో అధిక శాతం ఉపఖండ పిచ్‌లపైనే నమోదవడం... జడేజా మంచి స్కోరు చేసిన మ్యాచ్‌ల్లో టాపార్డర్ భారీగా పరుగులు రాబట్టడంతో ఎప్పుడూ అతడి పేరు పెద్దగా వెలుగులోకి రాలేదు. పదకొండేళ్ల క్రితం 2014లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో టెస్టులో ధనాధన్ హాఫ్ సెంచరీతో పాటు ఆఖర్లో చక్కటి త్రోతో అండర్సన్‌ను రనౌట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన జడేజా ఈసారి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాలని విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాడు.
అయితే ఈ క్రమంలో తన పోరాటంతో మాత్రం అందలమెక్కాడు. ఇకపై కూడా అతడు ఇదే నిలకడ కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఆరు బంతులను ఒకే ప్రాంతంలో వేయగల నైపుణ్యంతో పాటు... వేర్వేరుగా సంధించగల వైవిధ్యం గల జడేజా... నోబాల్స్ విషయంలో మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది!