
గత కొన్నాళ్లుగా టీమిండియా టెస్టుల్లో నిరాశపరుస్తోంది. ముఖ్యంగా గౌతం గంభీర్ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడుతోంది. స్వదేశంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో కనీవినీ ఎరుగని రీతిలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ చేదు అనుభవం చవిచూసింది.
కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడి దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ చేరే అవకాశాన్ని కూడా టీమిండియా కోల్పోయింది. డబ్ల్యూటీసీ మొదలుపెట్టిన తర్వాత వరుసగా రెండుసార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్.. ఈసారి మాత్రం ఇలా డీలాపడింది.
అయితే, గత వైఫల్యాలు మరిచి డబ్ల్యూటీసీ 2025-27 సీజన్‌ను ఆరంభించిన టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలోనూ నిరాశపరుస్తోంది. కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నేతృత్వంలో... టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్‌లో ఓడిపోయిన టీమిండియా.. ఎడ్జ్‌బాస్టన్‌లో మాత్రం తొలిసారి గెలుపు జెండా ఎగురవేసింది.
అనంతరం లార్డ్స్‌లో ఓడిపోయిన గిల్ సేన... తాజాగా మాంచెస్టర్‌లో ముగిసిన నాలుగో టెస్టులో ‘డ్రా’ తో గట్టెక్కింది. ఇక ఓవల్ మైదానంలో.. ఆఖరిదైన ఐదో టెస్టులో గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను 2-2తో సమం చేయగలుగుతుంది. లేదంటే.. విదేశీ గడ్డపై వరుసగా రెండోసారి భంగపాటు తప్పదు.
నిజానికి లీడ్స్, లార్డ్స్‌లో వ్యూహాత్మక తప్పిదాల వల్లే గెలవాల్సిన మ్యాచ్‌లలో టీమిండియా ఓడిపోయింది. ముఖ్యంగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సేవలు వాడుకోకపోవడం.. కరుణ్ నాయర్ విఫలమవుతున్నా వరుస అవకాశాలు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ క్రమంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై వేటు వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.

అయితే, గంభీర్‌పై నమ్మకం ఉంచిన యాజమాన్యం బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటేలపై మాత్రం వేటు వేయనున్నట్లు సమాచారం. ‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం.. ఆసియా కప్-2025 ముగిసిన తర్వాత వీళ్లిద్దరికి ఉద్వాసన పలికేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రంగం సిద్ధం చేసింది.
వెస్టిండీస్‌తో అక్టోబరులో జరిగే సిరీస్‌కు ముందే వీరిపై వేటు వేయనుంది. మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియా బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పులేమీ రాలేదని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మరోవైపు.. అసిస్టెంట్ కోచ్‌గా డష్కాటే సేవలు కూడా అంత గొప్పగా లేవనే భావనలో ఉంది. ఈ నేపథ్యంలోనే మోర్కెల్, డష్కాటేలను సాగననంపేందుకు బోర్డు సిద్ధమైంది.
కాగా గంభీర్ కోరిక మేరకే మోర్నీ మోర్కెల్, డష్కాటేలతో పాటు అభిషేక్ నాయర్‌ను మేనేజ్‌మెంట్ అతడి సహాయక సిబ్బందిలో చేర్చింది. అయితే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అభిషేక్ నాయర్‌పై వేటు వేసిన బీసీసీఐ... తాజాగా మోర్నీ, డష్కాటేల భవితవ్యంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.