సంజూ శాంసన్.. గత కొన్నేళ్లుగా భారత క్రీడా వర్గాల్లో ఈ పేరు చర్చనీయాంశంగా ఉంది. ప్రతిభ ఉన్నా ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌కు తగినన్ని అవకాశాలు రావడం లేదని అతడి అభిమానులతో పాటు కొంతమంది మాజీ క్రికెటర్ల వాదన. అయితే, టీమిండియాలో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న సమయంలో.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడనేది విశ్లేషకుల మాట.
పేలవ ప్రదర్శన
ఆటలో నిలకడలేమి కారణంగానే సంజూను యాజమాన్యం నమ్మదగిన ఆటగాడిగా చూడటం లేదని ఇంకొంతమంది అభిప్రాయం. తాజాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో సంజూ (Sanju Samson) పేలవ ప్రదర్శనలే ఇందుకు కారణం. నిజానికి గతేడాది కాలంగా భారత టీ20 జట్టులో ఓపెనర్‌గా ఈ కేరళ ఆటగాడు కొనసాగుతున్నాడు.
సెంచరీలతో సత్తా చాటి
విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)కు జోడీగా సంజూ విదేశీ గడ్డలపై సెంచరీలతో సత్తా చాటాడు. అయితే, ఆసియా టీ20 కప్-2025 టోర్నీకి ముందు వైస్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తిరిగిరావడంతో సంజూపై వేటు పడింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో తనకంటూ ఓ స్థానం లేకుండా పోయింది.
వికెట్ కీపర్ కోటాలోనూ సంజూకు జితేశ్ శర్మ పోటీగా రావడంతో.. తుదిజట్టులో అతడు స్థానం కోల్పోయిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో టీ20 ఓపెనర్‌గా గిల్ విఫలం కావడం సంజూకు కలిసి వచ్చింది. ఫలితంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా తిరిగి ఓపెనర్‌గా అతడికి అవకాశం దక్కింది. అంతేకాదు.. ప్రపంచకప్ టోర్నీ-2026కు కూడా ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ ఎంపికయ్యాడు.
10, 6, 0.. పొంచి ఉన్న ఇషాన్ ముప్పు
అయితే, కివీస్‌తో సిరీస్ సందర్భంగా సంజూ తొలి మూడు టీ20లలోనూ తేలిపోయాడు. మూడు మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు 10, 6, 0. మరోవైపు.. దాదాపు మూడేళ్ల తర్వాత టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ దుమ్ములేపుతున్నాడు.
వరల్డ్‌కప్‌లో అభిషేక్ జోడీగా ఇషాన్ కిషన్?!
తిలక్ వర్మ గాయపడిన కారణంగా ఇషాన్ ప్రస్తుతం మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. నిజానికి అతడు కూడా ఓపెనింగ్ బ్యాటర్. సంజూ వైఫల్యం కారణంగా ఈ జార్ఖండ్ డైనమైట్ ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే తిలక్ వర్మ టీ20 ప్రపంచకప్ టోర్నీకి సిద్ధమవుతున్నాడని బీసీసీఐ ప్రకటించింది.
నిజానికి తిలక్ గాయం వల్ల కివీస్‌తో మిగిలిన రెండు టీ20లకు కూడా దూరం కావడంతోనే సంజూ వేటు నుంచి తప్పించుకున్నాడు. కాబట్టి న్యూజిలాండ్‌తో నాలుగు, ఐదో టీ20 మ్యాచ్‌లు అతడికి అత్యంత కీలకంగా మారాయి.
ఈ సందర్భంగా ఫామ్‌లోకి వస్తేనే వరల్డ్‌కప్‌లో సంజూ ఓపెనర్‌గా కొనసాగగలడు. లేదంటే.. అతడి స్థానాన్ని మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ భర్తీ చేయడం ఖాయం. ప్రస్తుతానికి టీమిండియా యాజమాన్యం సంజూకు మద్దతుగా నిలవడం అతడికి ఊరటనిచ్చే అంశం.
అండగా మేనేజ్‌మెంట్
సంజూ వైఫల్యాలలపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందిస్తూ.. ‘‘సంజూ తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఒకే ఒక్క ఇన్నింగ్స్ అవసరం. ఫలితంగా అతడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సరైన సమయంలో ఆటగాళ్లు పుంజుకునేలా చేసి.. ప్రపంచకప్ టోర్నీకి వారిని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడమే మా మొదటి ప్రాధాన్యం.
సంజూ శ్రద్ధగా శిక్షణలో పాల్గొంటున్నాడు. నెట్స్‌లో ప్రతి బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వస్తాడు’’ అని ధీమా వ్యక్తం చేశాడు. మోర్కెల్ చెప్పినట్లు సంజూ తిరిగి పుంజుకుంటే సరి.. లేదంటే అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీగా సంజూ స్థానాన్ని ఇషాన్ కిషన్ భర్తీ చేయడం లాంఛనమే అవుతుంది.


